2989 వ రోజు........

 పర్యావరణ ధ్వంసకమయ్యే - కేవలం ఒక్కసారికి మాత్రమే పనికి వచ్చే ప్లాస్టిక్కులు ఇంకెంత కాలం?

                         గ్రామ మెరుగుదల బాటలో 2889* వ అడుగు!

అడుగుల్తో కదం త్రొక్కినది 29 మంది! 4.20 నుండి 6.10 దాక RTC ప్రాంగణంలో ఆ అడుగులలా పడుతూనే ఉన్నాయి! ఇప్పటికి 4 రోజులుగా కార్యకర్తలు ఈ ఆవరణలోని అశుభ్రత, అస్తవ్యస్తత, కాలుష్యాల మీద కత్తులు దూస్తూనే ఉన్నారు ! RTC సిబ్బందిగాని, సమీప వ్యాపారులు గాని జోక్యం చేసుకోనేలేదు!

          అందుగ్గాను పెద్దగా ఆశ్చర్యపడవలసిందీ లేదు! రాముడి ప్రక్కనా, పాండవేయుల వెనుకా, స్వాతంత్ర్య సమర వీరులకండగా నిలబడింది అల్ప సంఖ్యాకులే మరి! మురికి-బురద-పారిశుద్ధ్య పనులకు మాత్రం జనం రాకపోతే వింతేముంది?

          కాకపోతే- సుదీర్ఘకాలంగా చల్లపల్లి బాగుదలకు కంకణం కట్టుకొన్న స్వచ్ఛ కార్యకర్తల పట్ల గ్రామస్తులూ, ప్రయాణికులూ కాస్త గౌరవ దృక్కులు ప్రసరించడమే ఊరట!

          క్రొత్త సంవత్సరం నాల్గవ రోజున- బుధవారం వేకువ ఇందరు గ్రామ బాధ్యులేం సాధించారు? అంటే :

1) వాహన నిష్క్రమణ మార్గంలో ఘాటెక్కిన మూత్ర దుర్గంధం నడుమ చీపుళ్లతో ఊడ్చిన ముగ్గురు మహిళలూ,

2) దానికి తూర్పుగా మినీ ఉద్యానంలో నిలబడలేక-డిప్పమీద కూర్చొని అటూ ఇటూ జరుగుతూ గడ్డీ గాదం తప్పిస్తూన్న మరొకగృహిణీ,

3) అక్కడికి ఉత్తరంగా శ్రమించిన డజను మంది కష్టమూ

 4) పడమర దిశగా మూత్రశాలల వద్ద మరొకమారు సుందరీకరించిన నలుగురు నిపుణులూ,

5) దొరికిన వ్యర్థాలను ఆకులూ-కొమ్మలూ, ప్లాస్టిక్ సీసాలూ, గాజు సామాన్లూ కొమ్మలుగా విభజించి, ఓపికగా లోడు చేసిన వారూ,

          అసలదంతా ఎవరో లోతుగా త్రవ్విన గుంటా, ఎగుడు దిగుడు చోటూ, ముళ్ల-పిచ్చి మొక్కల చిట్టడవి ! ఎంతో జాగ్రత్తగా అడుగులు వేయకపోతే -  వయసు మళ్లిన కార్యకర్తలు పడిపోయే పరిస్థితి!

          6. 25 తరవాత అందరొక చోట – ‘లౌవ్లీ’ బిరుదాంకిత కొత్తపల్లి వేంకటేశ్వరుని నాయకత్వంలో ముమ్మారు గ్రామ స్వచ్ఛ సుందరోద్యమ నినాదాలు పలికి, DRK గారి సమీక్షా వచనాలాలకించారు.

          ఇళ్లకు వెళుతున్న వారిని ఆపి మరీ షణ్ముఖ (వేముల) శ్రీనివాసుడు తలా సంచిడు రేగు పండ్లందించడం మరొక విశేషం!

 గురువారం వేకువ కూడ మన కార్య రంగం - RTC బస్టాండేనట!

            అధి నాయక స్థానీయులు

బాధ్యతలను మోయు వారె నాయకులై వెలుగుతారు

ఆ  ధైర్యం చాలక అనుయాయులుగా మిగులుతారు

ఇది చారిత్రక సత్యం - ఇందుకనే స్వచ్ఛకార్య

కర్తలె మన సమాజానికధి నాయక స్థానీయులు!

- ఒక స్వచ్ఛ సుందర కార్యకర్త

  04.01.2024