2990*వ రోజు.... ....

 పర్యావరణ ధ్వంసకమయ్యే - కేవలం ఒక్కసారికి మాత్రమే పనికి వచ్చే ప్లాస్టిక్కులకి ప్రత్యామ్న్యాయం వెతుకుదాం!

                        వేకువ 4.18 నుండే 2990*వ స్వచ్చంద శ్రమానందం !

          జనవరి 2024 తొలి శుక్రవారం పూట RTC ఆవరణలో అలాంటి ఆనందం 27 మంది కార్యకర్తలది.    “అసలీ చలేమిటి- మంచు ఏమిటి? వేకువనే వచ్చి ఈ దుమ్ము- మురికి పనులేమిటి? పైగా ఈ అలగా పనులకి “శ్రమానందం” అనే శీర్షికా? ఇంతకన్నా వెర్రి మాలోకాలు దేశంలో ఉంటారా ?”  అని ఎంతగా ప్రశ్నించుకొన్నా జవాబులు దొరకడం లేదా?

          ఇలాంటి పిచ్చోళ్ళతోనే చరిత్ర ఎన్నో మలుపులు తిరిగింది మరి! అందర్లాగా చలికి ముడుచుకొని పడుకొంటే, ఊరి అస్తవ్యస్తాలను, వీధి కాలుష్యాలను, తీరూ-తెన్నూ లేని శ్మశానాలను, మురుక్కాల్వల్ని, ఊరి బైట 9-10 రహదారుల్ని చూసీ చూడనట్లు వదిలేస్తే వీళ్లు స్వచ్ఛ కార్యకర్తలెలా ఔతారు?

          తమ చాదస్తపు స్వచ్ఛోద్యమాన్ని ఎవరనుసరిస్తారు, ఎవరు తాటాకులు కడతారు, దాని అంతరార్థాన్ని  ఎందరు గ్రహిస్తారు అని చూసుకోకుండ, తాము నమ్మిన సత్కర్మాచరణలో దశాబ్దంపాటు ముందుకు సాగబట్టే వాళ్లు "స్వచ్ఛ సుందర చల్లపల్లి కర్మవీరు" లయ్యారు!

          బిరుదులు, పదవులు, ప్రశంసలు, సన్మానాలు ఆశించేదైతే, స్వార్ధం వాసన కొట్టేదైతే, సహనం కోల్పోయేదైతే ఈ ఉద్యమం 3000* రోజులకు చేరువగా వచ్చేదే కాదు! ఏమో-ఎవరు చూడొచ్చారు-మరో5-10 ఏళ్లలో ఈ కార్యకర్తల ఆశయాలు – శత శాతం గ్రామస్తుల్లో స్వచ్ఛ- శుభ్ర స్ఫూర్తినింపి, న్యూజిలాండ్, స్కాండి నేవియన్  గ్రామాల్లాగా చల్లపల్లి మారుతుందేమో !

          అలాంటి సదాశయంతోనే నేటి 27 మంది కార్యకర్తల ప్రయత్నాలిలా ఉన్నవి:

- అశోక్ నగర్- సజ్జా ప్రసాదు గారి వీధిలో డ్రైను కడ్డంగా పెరిగిన మూడు నాలుగు చెట్లను నలుగురైదుగురు అరగంటలో అడ్డు తొలగించుట,

- బస్టాండులోని మూత్రశాలల ప్రక్కన అడ్డదిడ్డంగా, పెరిగిన చెట్ల కొమ్మల్ని రంపం, కత్తి ప్రయోగించి, తమకు నచ్చినట్లు సుందరీకరించుట,

-బస్టాండు లోతట్టున డజను మంది పిచ్చి- ముళ్ల చెట్లను ఛేదించి, ప్లాస్టిక్ తుక్కులేరి, 2 రకాల సీసాలను విభజించి, చేర్చవలసిన చోటుకు చేర్చుట,

- మరొకమారు గుంటలు పడ్డ రోడ్లను ఊడ్చి, శుభ్రపరచుట,

          ఇక ఈ కార్యక్రమాన్ని చూసి, RTC చెకింగ్ ఆఫీసర్లు ఆశ్చర్యానందాలు పొందుట!

          తాము రోజువారీ చేసే సమీక్షను Dr.DRK నిర్వహించుట, దానికి ముందు చిన్నపాటి మార్పులతో నేను ముమ్మారు స్వచ్ఛ సుందరోద్యమ నినాదాలను ప్రకటించుట.

          లంకే సుభాషిణి ఏ సమయమూ – సందర్భము లేకుండా తన అదనపు సంతృప్తి కోసం కార్యకర్తలకు మిఠాయిలు పంచుట,

          అంతిమంగా రేపటి మన శ్రమదాన వేదిక బస్టాండ్ లోనే అని అందరూ నిర్ణయించుకొనుట

         విచ్చేయుడు మళ్ళీమళ్ళీ!

ఇవి స్వచ్చోద్యమ లీలలు- ఇవె శ్రమదానం రీతులు

ఈ ఊరొక స్వచ్ఛ- శుభ్ర- సౌందర్య ప్రయోగశాల

ఇదే నవ వసంతాల స్వచ్ఛోద్యమ చల్లపల్లి

ఈ వింతలు గమనించగ విచ్చేయుడు మళ్ళీమళ్ళీ!

- ఒక స్వచ్ఛ సుందర కార్యకర్త

  05.01.2024