2991*వ రోజు........

 పర్యావరణ ధ్వంసకమయ్యే - కేవలం ఒక్కసారికి మాత్రమే పనికి వచ్చే ప్లాస్టిక్కులకి ప్రత్యామ్న్యాయం వెతుకుదాం!

                               2991* వ కృషి కూడ RTC ఆవరణలోనే!

          శనివారం (6.1.24) నాటి 29 మంది ఉత్సాహపూరిత బాధ్యతలు వేకువ 4.18 కే మొదలై 6.16 దాక కొనసాగాయి - కొందరివి లోతట్టునా, ఇంకొద్ది మందివి ఎదుటి వీధిలోనూ!

          లోపలి బాధ్యతాయుతులు కూడ ఒక్కచోట కాదు - 3 చోట్ల - అంటే సైకిల్ స్టాండు, మెష్ లు బిగించిన, వేప చెట్లు దక్షిణాన, పాయిఖానా దొడ్ల పడమర గానూ!  కార్యకర్తల స్వచ్ఛ- సుందరతా చర్యలు కూడ మూడు నాలుగు విధాలుగా!

          అవనిగడ్డ రోడ్డు మీద 5 గురి పనులూ ఔట్ గేటు దగ్గర మళ్లీ చేరిన కూరల, కండెల కొట్ల వ్యర్థాల్నీ, టీ-కాఫీ దుకాణ గలీజులకూ పరిష్కారం చూపాయి!

          ప్రధాన ప్రవేశాన్ని, సైకిళ్ళ నిలుపుదల చోటునూ పట్టి పట్టి, మూల మూలల్నూ శోధించి, కాలుష్య కారక వ్యర్థ్యాల్ని సాధించిన 4 సుందరీకర్తలూ!

- పెదకళ్లేపల్లి మార్గం వైపున్న తిక్క-ముళ్ల మొక్కలూ, తీగలూ, ప్లాస్టిక్ వ్యర్థాలూ ఏడెనిమిది మంది వంతు!

- అన్నిటికన్నా ఘోరమైన పని కక్కూసుదొడ్ల దగ్గరిదే! అక్కడ శుభ్ర పరచిన 10 మందీ నిజంగా మొండి కార్యకర్తలనుకోవాలి! ఎందుకంటే - ఒక ప్రక్క లెట్రిన్లో ట్యాంకుల్నుండి లీకౌతున్న నీళ్ల కంపూ, కాళ్ల క్రింద ఆ తడీ, అక్కడ పెరిగిన దట్టమైన రకరకాల చెట్లూ !

          వాళ్ల సంగతలా ఉంచి, ఒక సీనియర్ వైద్యుడు అక్కడి చాలీచాలని వెలుతుర్లో పొరపాటున ఆ నీటి పల్లంలో మోకాలు లోతున దిగడమూ!

          ఇంకా చెప్పాలంటే-చీకట్లో చెట్టెక్కి వాటి కొమ్మలు నరికి, సుందరీకరించిన వారూ, ఆ ఎగుడుదిగుడు చోట్ల ప్లాస్టిక్ తుక్కులేరిన వారూ, చీపురుతోనో- చేతుల్తోనో వ్యర్థాల్ని సేకరించిన వారూ--

          ఊరి ముఖ్య బహిరంగ ప్రదేశమైన బస్ ప్రాంగణ పరిశుభ్రత పట్ల ఈ కార్యకర్తలకెంత యావో 6.15 దాటినా తుది మెరుగులు దిద్దడం చూస్తే తెలిసి పోతుంది!

          నేటి తుది సమావేశ వివరాలిలా :

- బాణావతు రమేష్ నినదించిన గ్రామ స్వచ్ఛ సుందరోద్యమ సందేశమూ,

- 3000 దినాల గ్రామ బాధ్యతానుభవాలను వ్రాసుకొచ్చిన సుభాషిణి రచనా,

- ఎవరో ఎందుకో మనకోసం మనం ట్రస్టు కిచ్చిన 500/- విరాళమూ,

రేపటి తుది మెరుగుదల చర్యలు కూడ RTC ప్రాంగణంలోనే అనే నిర్ణయమూ,  

             అంత వరకూ వారు మారరు

ఎవరి కాళ్ళకు స్వార్ధ సర్పం ఎంత కాలం చుట్టు కొనునో

ఎవరి మెదడులకహంకారం ఎంత సమయం వ్రేలబడునో

ఒక సమూహపుశక్తి నెవ్వరు ఒప్పుకొనరో పూనుకొనరో-

అంత వరకూ వారు మారరు స్వచ్ఛ సుందర కార్యకర్తగ!

- ఒక స్వచ్ఛ సుందర కార్యకర్త

  06.01.2024