2992*వ రోజు.... ....

 పర్యావరణ ధ్వంసకమయ్యే - కేవలం ఒక్కసారికి మాత్రమే పనికి వచ్చే ప్లాస్టిక్కులకి ప్రత్యామ్న్యాయం వెతుకుదాం!

                     2992* వ ఉదయం పూర్తైన RTC ఆవరణ పనులు

          సదరు పనులకోసం ఆదివారమైనందున (7.1-24) హాజరైన కార్యకర్తలు 31 మంది. హైదరాబాదు ప్రయాణించిన ఇద్దరూ, చెన్నై వెళుతూ కూడ 1/2  గంట వచ్చి వెళ్లిన మరొకరూ లోపించారు. వీరిలో అత్యధికులు 4.16 - 6.08 నడుమ శ్రమించిన వారే!

          ఊరి జనుల, ప్రయాణికులు ఆహ్లాదమే ధ్యేయంగా వారం రోజుల్నుండీ నడిచిన స్వచ్ఛ- శుభ్ర- సుందరీకరణ క్రతువు ముగిసిన శుభ తరుణమిది;  గ్రామ జనంతో బాటు, ఎన్నో ఊళ్ళ ప్రయాణికుల సాక్షి గా కాలుష్య విముక్తి జరిగిన బస్ ప్రాంగణమిది!  ప్రతి ఉదయమూ డిప్పల కొద్దీ శీతల పానీయ,మద్యం ద్రవ ఖాళీ సీసాలూ, ఇతర వ్యర్థాలూ ట్రాక్టరు నిండుగానో,  సగంగానో తరలి వెళ్లిన ప్రజోపయోగ స్థలమిది. మైకునుండీ, గాయకుల గళం నుండీ చైతన్య కారక గీతాఝరి జాలు వారిన వారంరోజులివి!

          తక్కిన చోటులలా ఉంచి, నేటి శ్రమ ప్రసరించిన 2 ముఖ్యమైన స్థలాలను పరిశీలిస్తే:

1) ఒకప్పటి మోషే కాఫీ హోటల్, నేటి ఖాళీ స్థలమే దాదాపు అందరి శ్రమా ఖర్చైనది. వెలుతురు అంతంత మాత్రం గానూ, ఎగుడుదిగుడుగానూ, ఉన్న ఐదారు సెంట్ల భాగమే గంట పాటు పని వేళను తినేసింది. అక్కడ లేని వేమున్నది - సీసాలు, క్యారీబ్యాగులు, అన్నిరకాల పనికిరాని మొక్కలు, ప్రాత చెప్పులు, చింకి గుడ్డలు - అన్నీ ఈ వేకువ గంటలో అదృశ్యమై, శుభ్రమైన చోటు మిగిలింది.

 

  2) ఎందుకైనా మంచిదని ఏడెనిమిది మంది చీపుళ్ల వారు బస్టాండు మొత్తాన్నీ, ఎలుపలి రోడ్డునూ ఊడ్చేశారు.

3) పెదకళ్ళేపల్లి బాట వైపున్న ఖాళీ స్తలమూ తక్కువ తినలేదు – పైగా ఎవరో త్రవ్విన గుంటలు! అక్కడ కొంతమంది శ్రమ ఫలించింది!

          వారంరోజుల కష్టంతో బాగుపడిన, తోటల్నీ,  సైకిల్ స్టాండునీ,  మూత్ర శాలల పరిసరాన్నీ తృప్తిగా చూసుకొని, 6.20 తరువాత నాయుడు మోహనుని గంభీర నినాదాలకు బదులిచ్చి, వక్కలగడ్డకు చెందిన కాంపౌండర్ శేషు పాటకు ప్రజా నాట్యమండలికి చెందిన నాగార్జునుని వాద్య సహకారాన్ని మెచ్చి, నేటి తమ శ్రమ వేడుకను ముగించారు.

          అజ్ఞాత దాత విరాళ వివరం రేపు ప్రకటిస్తాను. ముందు చెన్నై, పిదప అమెరికా 3 నెలల యాత్రకుప క్రమించిన మాలెంపాటి గోపాలకృష్ణయ్య దంపతులకు స్వచ్ఛ కార్యకర్తల శుభాకాంక్షలు!

          సహనమె తమ ఆయుధముగ

సహనమె తమ ఆయుధముగ- శ్రమదానము యజ్ఞముగా-

గ్రామస్తుల సహకారమె కీలకముగ- ప్రోద్బలముగ

చల్లపల్లి స్వచ్ఛ- సుందరోద్యమమొక వేడుకగా

శ్రమ సంస్కృతి స్థాపనముగ - తొమ్మిదేళ్ల కాలముగా....!

- ఒక స్వచ్ఛ సుందర కార్యకర్త

  07.01.2024