2993*వ రోజు........

 పర్యావరణ ధ్వంసకమయ్యే - కేవలం ఒక్కసారికి మాత్రమే పనికి వచ్చే ప్లాస్టిక్కులకి ప్రత్యామ్న్యాయం వెతుకుదాం!

                                 పరిమిత శ్రమదానం-@2993*

          అది 8.01.2024 వేకువ 4.19 – 6.12 నడుమ జరిగినది. 20 మందితో, నాగాయలంక బాటలోని సుందర టాయిలెట్ల, రహదారి వనాల ప్రాంతం లోనిది; రోడ్డుకు తూర్పుగా 2 వీధుల నడిమిది; రోడ్డు వరకు  చూడ ముచ్చటగా ఉన్నా – ట్రాక్టర్ మెకానిక్ షెడ్డూ, మురుగు కాల్వా రకరకాల వ్యర్థాలు చేరిన చిన్నపాటి డంపింగ్ యార్డున్న జాగా !

దావణగెరె కార్యకర్త వేమూరి అర్జున నామధేయునితో సహా 20 మందికీ, 80-90 గజాల అవనిగడ్డ రోడ్డుకూ పరిమితమైన శ్రమదానం వివరాలివి:

1) తొలుదొల్తగా ఆయుధపాణులైన తొమ్మిది మందీ దుమ్మూ ధూళి కొట్టుకుపోయిన పోతులూరి వీరబ్రహ్మం గుడి దగ్గరే వీధి కాలుష్యాల మీద దండెత్తారు.

2) తదుపరి వచ్చినవారు వచ్చినట్లు కత్తులు, దంతెలతో తూర్పు ప్రక్క కాలుష్యాల నిలయమైన ట్రాక్టర్ల మరమ్మత్తు ఆవరణ మీద తిరుగుబాటుచేశారు. మరికొందరు పనిలో పనిగా మురుగు కాల్వ సంస్కరణకు తెగించారు.

3) అందులో ఒక విశ్రాంత కేంద్ర ప్రభుత్వోద్యోగైతే ఒకదాని తరవాత ఒకటిగా కనీసం 3 పనులు దున్నేశాడనుకోండి! వాటిలో డ్రైను మీదుగా పెరిగిన ఎండు-పచ్చి కొమ్మల ఖడ్గ విన్యాసాలైతే వీడియో తీయదగినవి !

4) అదే డ్రైను ఒడ్డున డిప్ప బోర్లించి కూర్చొని ముందుకు జరుగుతూ మురుగు ఓడుతున్న సీసాల్ని, గ్లాసుల్ని ఏరుతున్న కాలు గాయపడ్డ కార్యకర్తనూ, షెడ్డు ఆవరణను ఊడ్లి, శుభ్రం చేస్తున్న ముగ్గురు మహిళల్నూ చూసి తీరాలి!

5) వయసు మీరిన భారీ కార్యకర్తలు ముగ్గుర్నలుగురెన్ని ముళ్ళ చెట్లనూ, తీగల్నీ కోసి, నరికి తొలగిస్తే- తెల్లారాక ఆ ప్రాంతం ఈ మాత్రం పరిశుభ్రంగా ఉన్నదో చూడండి!

           స్వచ్ఛ కార్యకర్తలది తమ గ్రామ వీధుల శుభ్ర - సౌందర్య వ్యసనమే ఐతే,  అది  మరొక 5-10 పదేళ్లి లాగే వర్ధిల్లాలని కోరుకొందాం!

          2 గంటలపాటు తమ వీధిలో-షెడ్డులో పరిసరంలో ఇంత సందడి నెలకొన్నా చలించని, ముసుగులు తొలగించి, కార్యకర్తలతో చేతులు కలపని ఆ 18 వ వార్డు గ్రామస్తుల్లో మాత్రం మార్పు రావాలని వేడుకొందాం!

          6.25 వేళ ఈ సమూహంలోని ఒక పాటగాడే ముమ్మారు స్వచ్ఛ- సుందరోద్యమ నినాదకుడుగా మారి, నేటి స్వచ్చంద కార్యక్రమం ముగిసింది.

రేపటి వేకువ కూడా ఇదే  పబ్లిక్ టాయిలెట్ల వద్ద – బండ్రేవు కోడు కాల్వ వంతెన వద్ద మనం తొలగించవలసిన మినీ డంపింగ్ కేంద్రం ఎదురు చూస్తున్నది!

     శ్రమ వేడుక సాధన గమనించారా?

ఎక్కడైన చూశారా - ఈ శ్రమదానోద్యమాన్ని?

ఎప్పుడైన పీల్చారా వీళ్ల చెమట కంపుసొంపు?

సామూహిక శ్రమ వేడుక సాధన గమనించారా?

ఐతే- స్వచ్చోద్యమానికతిథులుగా విచ్చేయుడు!

- ఒక స్వచ్ఛ సుందర కార్యకర్త

  08.01.2024