3038* వ రోజు...........

 పర్యావరణ ధ్వంసకమయ్యే - కేవలం ఒక్కసారికి మాత్రమే పనికి వచ్చే ప్లాస్టిక్కులు ఇంకా వాడాలా?

ల్లపల్లి గ్రామ బాధ్యతల లో 3038* రోజులు !

         గురువారం (22-2-24) నాటిది ఆ సంఖ్య ! ఈ వేకువ తమ కష్టాన్ని సార్థకం చేసుకొన్న ధన్య జీవనులు 22 మంది! వారి చేతుల మీదుగా ఏడెనిమిది రకాలుగా విభజితమై బడా బోరేల్లో చేరిన మొత్తం చెత్త ఒక పెద్ద ట్రాక్టరు! ఈ క్రుళ్లిన చెత్త పనులు జరిగింది ఊరికి దూరంగా డంపింగ్ కేంద్రంలో!

         సుమారు 15 రోజులుగా ఇదే తంతు ! ఏ 3.30 AM కో లేస్తారు, 2-3 కిలో మీటర్ల దూరంలోని శ్మశాన స్థలికి గతుకుల రోడ్డు మీదుగా 4.00-4.15 కే గమ్యం చేరుతారు, చే తొడుగులు, మాస్కులు, తల దీపాలు ధరించి చెత్త విభజనకు దిగుతారు. 2 గంటల పాటు శ్రమిస్తారు, తాము సాధించిన గ్రామ ప్రగతికి సంతసించి, స్వచ్ఛ - సుందర నినాదాలు పలికి, ఇళ్లు చేరుకొంటారు!

          బాధ్యతలు గుర్తించే వారికి ఈ కార్యకర్తలు స్ఫూర్తి ప్రదాతలు! సామాజిక సేవా తత్పరులకుఆదర్శ మూర్తులు!  తామనుకొన్నది సాధించడంలో మొండి మనుషులు!  ఊరిలో కొద్దిమంది దృష్టిలోఅమాయకులు, చాదస్తులు! స్వార్థం బలిసిపోయిన సమాజంలో ఎదురీతగాళ్లు !

         చల్లపల్లి శ్రమదానం సంగతి బొత్తిగా తెలియని క్రొత్త వాళ్లు ఈ పూట అనుకోకుండా వచ్చి కార్యకర్తల పనులు చూస్తే అయోమయంలో పడతారు.

         “ఈ ముదనష్టపు కంపు పనుల కోసమా ఇందరు విద్యాధికులు, మహిళలు, రైతులు, ఉద్యోగులుఇంత చలిలో, మంచులో శ్మశానం దగ్గరకు వచ్చింది?”  అనుకొంటారేమో!  

         మొదట్లో కొందరు శంకించినట్లు- “ఎన్ని లక్షలో - కోట్లో- ఎక్కడ నుంచో వస్తుండ బట్టే ఇలా రోడ్లూడ్చే, గుంటలు పూడ్చే, మురుగు కాల్వల్లో దిగే పనులు చేస్తుంటారు” అని కూడ ఊహిస్తారేమో!

         “పదవులూ, బిరుదులూ, సంపాదనలూ లేక ఎవరైనా ఇంత నిస్వార్ధంగా పనిచేసే రోజులా ఇవి” అని కూడ ఆలోచిస్తారు!

         “లోకోః భిన్నరుచీ” అనే సామెత అందుకే మరి! “మంచి మార్పును పసిగట్టే –అభినందించే – సహకరించే – ఆశీర్వదించే వారూ ఉంటారనుకోండి!

          కార్యకర్తలు తమ బాధ్యతను చేసుకు పోతున్నారు. మరి ఊరి 5000 ఇళ్ళవారూ తలొక 5 నిముషాలు తమ ఇంటి వ్యర్ధాలను 3-4 రకాలుగా విడగొట్టి చెత్త బండికందించే బాధ్యత వహిస్తే ఊరి ప్రయోజనాన్ని కాపాడిన వారౌతారు!

         - కాఫీలు ముగించి, కార్యకర్తలు పల్నాటి అన్నపూర్ణ పలికిన స్వచ్ఛ- సుందరోద్యమ నినాదాలకుబదులిచ్చారు.

         ఒక దాత సౌజన్యంతో గోళ్ళ వేంకట రత్నం గారు కుట్టించిన 50 మాస్కులు, సర్పంచిగారందుకొన్నారు.

       - ఉద్యమ ఖర్చుల నిమిత్తం అన్నపూర్ణ గారి 1000/- వితరణను నేను ట్రస్టు తరపున స్వీకరించాను.

         - రేపటి వేకువ కూడ చెత్త సంపద కేంద్రం వద్దే కలవాలని నిర్ణయించారు.

         ఒక్కొక అడుగు ముందుకు వేయుచున్నది

స్థిరత్వం సమకూర్చుకొన్నది - చేతనత్వం నింపుకొన్నది

అంగ బలమూ కొదవ లేనిది - ఆటుపోటుల తట్టుకొన్నది

ఆశయం గురి చూసి ఒక్కొక అడుగు ముందుకు వేయుచున్నది

స్వచ్ఛ సుందర ఉద్యమానికి జయం తప్పక లభిస్తున్నది !

- నల్లూరి రామారావు

   22.02.2024