3039* వ రోజు....... ....

 పర్యావరణ ధ్వంసకమయ్యే - కేవలం ఒక్కసారికి మాత్రమే పనికి వచ్చే ప్లాస్టిక్కులు ఇంకా వాడాలా?

3 వారాల నుండి చెత్త కేంద్రం పనులే! - @ 3039*

         ఈ శుభ శుక్రవారం (23-2-24) బ్రహ్మకాలంలో ఆ పనులకు పాల్పడిన సామాజిక సేవా ఘనులు 27+2 మంది! 4:20 నుండి 6:25 దాక! తాము తలపెట్టిన పనికి గుర్తింపు, సంపాదన, మెప్పుల వంటి ప్రతిఫలాన్నాశించే కార్యకర్తలైతే తొలి వంద రోజుల్లోనే చాప చుట్టేశేవారు!

         10 సంవత్సరాల సుదీర్ఘ శ్రమదాన విజయ రహస్యం ఒక్కటే - ఈ కార్యకర్తలది కేవలం నిష్కామ కర్మ! అంటే సొంతానికి ఏ ఆశా ఉండదు – గ్రామ ప్రజల్లో సామాజిక చైతన్యం, ఊరంతా శుభ్రంగా - హరితంగా - ఆహ్లాదంగా -సౌకర్యంగా ఉండడం వంటి కోరికలు తప్ప!

         “ఎందరి భుజాల మీదుగా పరిశీలిస్తేనో ఈ నా ఆవిష్కరణలు” అని న్యూటన్ మహాశయుడున్నాడట! “ముందు చూపున్న ఎందరు మహనీయుల త్యాగాల వల్లనో మన బ్రతుకులీ మాత్రం మెరుగ్గా ఉన్నాయి” అనే స్పృహతోనే చల్లపల్లి స్వచ్ఛ – సుందరోద్యమకారుల ఎడతెగని శ్రమదానం!

         అందుకు తాజా ఉదాహరణలు కావాలంటే 20 రోజుల్నుండీ మురుగు చెత్త మీద ప్రతివేకువా 20-30 మంది సామాజిక హితం కోరి శ్మశానం దగ్గర మురికి-తుక్కు పనుల్ని చూస్తే చాలు! రాలేనివారు శంకర శాస్త్రీయ వాట్సప్ మురికి-తుక్కు పనుల్ని చూసినా చాలు! రాలేని వారు చిత్రాల్ని చూసినా తెలిసిపోతుంది!

         నేటి వీడియో ఒకటి చూడండి - ఇద్దరు రైతు కార్యకర్తలు చుట్టూ ఏడెనిమిది డిప్పల్లోకి తమ ఎదుటి చెత్త గుట్టను తిరగేస్తూ, క్రుళ్ళిన తిండి వ్యర్ధాల్ని కదిలిస్తూ, గుప్పుమని కొట్టే దుర్గంధాన్ని పీలుస్తూ, ఒక్కో రకాన్ని ఒక్కో డిప్పలోకి ఎత్తుతున్న దృశ్యాన్ని!

         ఒకాయనకీ చెత్త పనుల్తో వళ్లు నొప్పులూ-జ్వరమూ, నిన్నటికి నిన్న మరొక తనికి గొంతు నొప్పి! ఐనా తాత్కాలిక విరామం తప్ప – ఎవరు రాకమానుతున్నారు?

         ఒక పెద్దాయన ప్లాస్టిక్ సీసాలు ఏరుతుంటే చూసి, ధ్యానమండలి వ్యక్తి “మాజీ ప్రిన్సిపల్ కు ఏ గతి పట్టిందో...” అని సరదాగా అన్నాడు!

         ఇంతటి కష్టాన్ని ఇష్టంగా మార్చుకొని గ్రామ సర్పంచీ, మంచి శస్త్రకారులైన సీనియర్ డాక్టర్లూ, గృహిణులూ శ్రమించడం లేదూ?

         ఒక పెద్ద ట్రాక్టర్ వ్యర్ధాల్ని విభజించి, ఏరి, పెద్ద గోనె సంచుల్లో నింపే సరికే బారెడు ప్రొద్దెక్కింది.

         ప్రముఖ సుందరీకర్త – ఆకుల దుర్గా ప్రసాద్ కాస్త వేగంగా స్వచ్ఛ సుందరోద్యమ నినాదాలు వల్లించగా,

         రేపటి వేకువ కూడ – ఇదే పని – ఇదే డంపింగ్ కేంద్రం దగ్గర అని నిర్ణయించారు!

         తన పింఛను డబ్బంతా

సదాచార సంపన్నుడు శాస్త్రీజీ కేలనో

స్వచ్చోద్యమ చల్లపల్లి మురికి పనుల సంగతి

తనది విజయవాడ గదా! తనకెందుకు ఇచట వసతి!

తన పింఛను డబ్బంతా ధారబోయు సత్కృతి!

- నల్లూరి రామారావు

   23.02.2024