పర్యావరణ ధ్వంసకమయ్యే - కేవలం ఒక్కసారికి మాత్రమే పనికి వచ్చే ప్లాస్టిక్కులు ఇంకా వాడాలా?
నిర్విఘ్నంగా ముగిసిన 3040* వ శ్రమదాన క్రతువు!
శనివారం వేకువ 4:20-6:25 నడుమ ప్రజ్వరిల్లిన సదరు యజ్ఞంలో ఋత్విక్కులు 23+2 మంది; స్థలం భీతిగొలుపుతుందనుకొనే రుద్రభూమికీ, జుగుప్స పుట్టించే చెత్త కేంద్రానికీ మధ్య; సమిధలు కంపుగొట్టే 10 రకాల వ్యర్ధాలు; ఖాళీ అయిందొక పెద్ద ట్రాక్టరు తుక్కు!
నిద్రా దేవత కౌగిలి వదిలించుకొని, 3-4 కిలోమీటర్ల దూరం దాటుకొని, 4:20 కే చెత్త కేంద్రానికి ఎలా చేరుకోంటారో -
రకరకాల నేపధ్యాల, చోటుల, గ్రామాల కార్యకర్తలు ఎందుకిలా దశాబ్దాల తరబడీ బట్టలు దుమ్ము కొట్టుకొనేలా - చేతులు నొప్పెట్టేలా – హోటళ్ల, టిఫిన్ బళ్ల నిలవ ఆహార దుర్వాసనలకు వాంతులయ్యేలా - చల్లపల్లి గ్రామ సామాజిక బాధ్యతను నియమ నిష్టల్తో నిర్వర్తిస్తారో –
తాము మంచిదని నమ్మిన శ్రమదాన నిబద్ధులౌతారో......
ఇన్నేళ్ల తర్వాత ఇక ఆమీమాంసలనవసరం!
ఇకముందైనా ఏ వార్డు నుండి కొందరు కార్యకర్తలు ఊరి మేలుకు జరిగే శ్రమవేడుకలో పాల్గొనక పోతారా అనేదే స్వచ్ఛంద శ్రమదాతల ఆశయం!
తమిళ వెల్లూరి శ్రీనివాసన్ గారి కల - ‘గ్రామీణ భారతానికి చల్లపల్లి ఘన ద్రవ వ్యర్ధాల సంపద కేంద్రపు ఉదాహరణ ఔతుంది’ అనే అంశమే ప్రస్తుతం!
అందుగ్గాను పాతిక ముప్పై మంది స్వచ్ఛ కార్యకర్తలూ, పంచాయతి ఉద్యోగులూ, క్రొత్తగా పనిలో చేరిన 35 మంది ఉద్యోగులూ, పగలు కొందరూ, వేకువ కొందరూ పనిచేస్తుండడం చూస్తే కల నెరవేరేట్లే కనిపిస్తున్నది.
మధ్యలో తుక్కు పోసుకొని ప్లాన్ ప్రకారం విడగొట్టే నాలుగైదు ముఠాలు కాక –
ఇద్దరు దంతెల్తో చెత్త గుట్టను తిరగేస్తుంటే, అక్కడికక్కడే ఒకాయన ప్లాస్టిక్ కవర్లు ఏరేస్తుంటే, ప్లాస్టిక్ కప్పులూ - ప్లేట్లూ – గ్లాసులూ - సీసాలూ 2 గోతాలకు సరిపడా ఇంకొకరు విభజిస్తుంటే - కాస్త దూరంగా, సిమెంటు బాటకు దక్షిణం అంచున గడ్డి – పిచ్చిమొక్కల్నొకాయన తొలగిస్తుంటే -
6:25 కు గాని నేటి శ్రమదానం ఒక కొలిక్కి వచ్చింది!
రామానగరానికి చెందిన యువ ఉద్యోగి రాజు గారు ముమ్మారు శ్రమదాన నినాదాలు ప్రకటించగా,
ఈ కార్యకర్తలకు పల్నాటి అన్నపూర్ణ తీపి పదార్థాలందించగా,
రేపటి పనులు కూడ ఇదే చెత్త కేంద్రంలోనే అని ప్రకటించారు!
స్వచ్చోద్యమ వస్తాదు!
పని ఎంతైనా జడవడు - పనే అతని జూచి జడియు
అవలీలగ నలుగురి పని అతగాడే చేయగలడు
అతని ఎడమ చేతి కత్తి అద్భుతాలు చేస్తుంటది
అతడె సజ్జా ప్రసాదు – స్వచ్చోద్యమ వస్తాదు!
- నల్లూరి రామారావు
24.02.2024