3086* వ రోజు...........

పర్యావరణ ధ్వంసకమయ్యే - కేవలం ఒక్కసారికి మాత్రమే పనికి వచ్చే ప్లాస్టిక్కులు వెంటనే మానేద్దాం!

@3086 - రంజాన్ శుభాకాంక్షలతో-!

            10/4/24 - బుధవారం శ్రమదానం జరగవలసింది బెజవాడ రోడ్డులోని నారాయణరావునగర్ ముఖ్య వీధి వద్ద. ఐతే ప్రతి రంజాన్ వేకువనా ముస్లిం భక్తులు ప్రార్థనలు చేసుకొనే ఈద్గా పడమటి వీధి పరిశుభ్రత బాగా లోపించినందున తెల్లారేసరికి సదరు శ్రీనగర్ రోడ్డును బాగుచేయడం గత 3 - 4 ఏళ్ల నుండీ ఆనవాయితీగా వస్తున్నది.

            స్వచ్ఛ - సుందర కార్యకర్తల పవిత్ర హస్తాలతో శుభ్ర సుందరీకరించాక తాము ప్రార్ధనలు చేసుకోవడం మంచిదనే ముస్లిం పెద్దల సెంటిమెంటు కూడ లేకపోలేదు. అసలు 2 ముఖ్యమతావలంబకులు కలిసి సహకారంగా, సౌహార్ద్రంగా, ఒక గ్రామ వీధి మెరుగుదల కోసం శ్రమించిన దృశ్యం ఎంత ఆకర్షణీయం ఎంత అభినందనీయం!

            ఆ విధంగా శ్రీనగర్ వీధి వద్ద 4:156:00 వేళల నడుమ జరిగిన కష్టం తొలుత పాతిక మంది కార్యకర్తలది, తదుపరి 21 మంది ముస్లిం సామాజికులదీ తప్ప ఆ వీధి ప్రజల నుండి రావలసిన స్పందన రాలేదు!

            ఈద్గా ప్రహరీ బారునా, పడమటి ఐదారు ఇళ్ల పొడుగునా ఎన్నెన్ని రకాల చిత్రవిచిత్ర వ్యర్ధాలున్నాయో ! నెలల తరబడీ రోడ్డు వారనా, ఇళ్ల గేటుల దాకా వందల కొద్దీ పిచ్చి మొక్కలూ, దుమ్మూ - ధూళీ పెచ్చరిల్లుతుంటే ఎందుకు పట్టించుకోరో అర్థం కాదు!

            దశాబ్దకాలంగా స్వచ్ఛ శుభ్ర - సుందరోద్యమం ఉన్న చల్లపల్లి వీధేనాఅనిపించకమానదు! ఊళ్ళోని పాతిక వేల మంది ప్రజలకూ తమ తమ వీధి పారిశుద్ధ్య సౌందర్య - సౌకర్యాల రుచి ఎప్పటికి అనుభవంలోకి వస్తుందో బోధపడదు!

            100 కు పైగా గజాల వీధి తెల్లారి 6:00 కు మంత్రించినట్లుగా మారిపోయింది. డ్రైన్లలోని, ఇళ్ళ ప్రహరీల ముందరి వ్యర్ధాలు మాత్రం మిగిలిపోయినవి.

            40 కి పైగా కార్యకర్తల తుది సమావేశంలో కార్యకర్తల నిస్వార్ధ శ్రమ పట్ల ఘోరీ గారి ఆశ్చర్యమూ, కృతజ్ఞతాభావమూ, DRK గారు గుర్తుచేసిన 32 ఏళ్ల నాటి అప్పటి ముస్లిం పెద్ద అమనుల్లాఖాన్ గారి హితవచనమూ

            మల్లంపాటి ప్రేమానంద్ గారి కుమారులు సందీప్, శ్రీదీప్ లు వారి నాయనమ్మ వసుమతి గారి పెద్ద కర్మకాండలకు (రేపు - గురువారం 12 గంటలు) స్వచ్ఛ కార్యకర్తలను పిలిచిన వైనమూ -

            ఉస్మాన్ షరీఫ్ గారు విన్పించిన ఉద్యమ నినాదమూ.. ముఖ్య విశేషాలు!

            రేపటి వేకువ మన శ్రమ ప్రదేశం మళ్ళీ విజయవాడ బాటలోని బాలాజీ అపార్ట్మెంట్ సమీపమే!

             అంకితులు మన చల్లపల్లికి 56

నిరంజనుడా - ప్రభంజనుడా! స్వచ్ఛ చర్యల విక్రమార్కుడ!

అతని వేగం - అతని త్యాగం - అద్భుతావహమగు ప్రయాణం

యువ వికాసం శ్రమ వినోదం గ్రామ భవితకునవోల్లాసం

అసాధారణ గ్రామ సేవలకతనికిదె అభినందనం!

- ఒక సీనియర్ స్వచ్ఛ కార్యకర్త          

   10.04.2024