3087* వ రోజు...........

 పర్యావరణ ధ్వంసకమయ్యే - కేవలం ఒక్కసారికి మాత్రమే పనికి వచ్చే ప్లాస్టిక్కులు వెంటనే మానేద్దాం!

బృందావన భవన విభాగాల వద్ద 3087*వ శ్రమదానం!

         అది ఇరవై ఇద్దరి సార్థక సామూహిక సామాజిక బాధ్యత! 4:17 కే పదునొకండుగురూ, సమయ క్రమాన మిగిలిన వారూ పాల్గొని, 6:06 దాక చెమటలు దిగగారుతున్నా, కొందరి నడుములు నొప్పిపెడుతున్నా, పట్టు సడలక తీర్చుకొన్న గ్రామ సామాజిక ఋణం!

         విజయవాడ బాటలో ఉత్తరాన ఆటోనగర్ తొలి వీధి మొదలు దక్షిణాన 150 గజాల బారునా నూకలవారి అపార్ట్మెంట్స్ దాటిన వీధి పారిశుద్ధ్య/ సుందరీకరణ తాజా ప్రయత్నం!

         ఎవరి అభిరుచిని బట్టి - శారీరక శక్తి స్తోమతుకొలది – పని ఆవశ్యకత నిర్ణయానుసారంగా వారు విడివిడిగానూ - కలివిడిగానూ సాగించిన బ్రహ్మ కాలపు శ్రమల వివరాలు :

- ఇద్దరి సహకారంతో ఒక సుందరీకర్త వడివడిగా ఐదారు చెట్ల కొమ్మలకి కత్తెర్లతో క్రమశిక్షణ నేర్పడమూ, అందుగ్గాను నిచ్చెన మీదికెగ బ్రాకి - బోగన్ విలియా పూల చెట్టు ముళ్లను లెక్క చేయకపోవడమూ,

- క్రొత్త అపార్ట్మెంట్ గేటు ఎదుటా, ప్రక్కనా ఒక ప్రసాదు కసిగానూ, ఇంకో ప్రసాదు సాత్వికంగానూ కత్తుల్తో వంగొనీ, కూర్చునీ పనికిమాలిన మొక్కల్ని తొలగించడమూ,

- ఇద్దరు కత్తుల వాళ్లకొక దంతె ధారి చొప్పున నరికిన ముళ్ల – పిచ్చి చెట్లనూ, తుక్కునూ లాగి గుట్టలుగా పేర్చడమూ,

- మొన్న ఊడ్చినా సరే – ఈ వేకువ కూడ ముగ్గురు చీపుళ్ల వారు వీధి బారునా క్షుణ్ణంగా శుభ్రపరచడమూ,

- అసలింకో పెద్దాయనున్నాడు – అదేంటో గాని, ఎంతో అవసరమైతే తప్ప రెండోవారి సాయం కోరనేకోరడు - ఒంటరిగా దంతెను ఊతగా పట్టుకొని నారాయణరావునగర్ తొలి వీధి దగ్గరి డ్రైన్ ను శుభ్రపరచడమూ,

- ఇంకో పెద్దాయన లేటుగా వస్తే వచ్చాడు గాని – గోనె సంచి నిండా దిక్కుమాలిన 2 రకాల సీసాలను ఏరుతుండడమూ.....

         ఇలా ఈ గురువారపు (11/4/24) వేకువ శ్రమ విన్యాసాలెన్నిటినో పేర్కొనవచ్చు!

         ఇక 6:25 కాలపు సమీక్షా సమావేశంలో మైకు లేకుండానే సజ్జా వారి నినాదాలూ,

         “నీ కాలు బాగుపడేదాక శ్రమదానానికి వెళ్లొద్దుమొర్రోఅని కుటుంబ సభ్యులు వారించినా వినని పల్నాటి అన్నపూర్ణ తన మామ గారు మల్లిఖార్జునరావు గారి 1000/- ట్రస్టుకు విరాళమూ కూడ!

         ఈ మధ్యాహ్నం 12 కు శివరామపురంలోని పెద్దావిడ కర్మకాండలకు అందరం వెళ్లాలనీ, రేపటి వేకువ కూడ ఇదే బెజవాడ రహదారిలో మనం కలవాలనీ విన్నపాలు!

          అంకితులు మన చల్లపల్లికి 57

మాట విపులత – చేత నిపుణత కోట పద్మకు సహజ సూత్రం  

ఏపనెంతగ చేయదగునో - ఎచట దానిని నిలుపువలెనో

మార్పుచేర్పులొనర్పవలెనో - ఓర్పు నేర్పుల చూపదగునో

పట్టు విడుపులు ప్రదర్శించుట పద్మ కోటకు నీళ్ల ప్రాయం!

- ఒక సీనియర్ స్వచ్ఛ కార్యకర్త     

  11.04.2024