పర్యావరణ ధ్వంసకమయ్యే - కేవలం ఒక్కసారికి మాత్రమే పనికి వచ్చే ప్లాస్టిక్కులు వెంటనే మానేద్దాం!
కొంచెం క్రూర వాతావరణంలో 3088* వ వీధి పారిశుద్ధ్యం!
సదరు సంక్లిష్ట గ్రామ సామాజిక బాధ్యతామూర్తులు 20 మంది, బాగుపడిన గ్రామ భాగం బెజవాడ రోడ్డుకు చెందిన నారాయణరావు నగర్ వీధి మొదలు దక్షిణంగా 100 గజాల నిడివి. ఇందులో నిన్న పనికి ఆహార పథకంతో బాగా కనిపిస్తున్న తూర్పు ప్రక్క డ్రైనూ, నిన్న మిగిలిపోయిన బృందావన అపార్ట్మెంట్ల రేకు ప్రహరీ వెలుపలి చోటూ ఉన్నవి!
వేకువ 4:20 – 6:10 కి పరిమితమై, 30 కి పైగా పని గంటల పాటు అక్కడి శ్రమ దృశ్యాలేమిటి? అది క్రూర వాతావరణమెట్లైనది? అంటే :
- పనిలో మునిగిన కార్యకర్తల్ని నేను 3 మార్లు తిరిగి చూసి, దగ్గరగా వెళ్లి చూస్తే ఏం కనిపించిందంటే – సగం మంది బట్టలు పాక్షికంగానూ, మిగిలిన వాళ్లవి సంపూర్ణంగానూ చెమటతో నానిపోయినవని!
- అసలు పని చేయకుండా ఉన్నా సరే చెమట పట్టే స్థితి కనిపించింది. ఇక – డ్రైన్లో దిగి, కత్తుల్తో అక్కడి మొక్కల్ని నరికే – చెత్తా చెదారం ప్రోగేసే నడివయస్సు దాటిన వాళ్ల సంగతి చెప్పాలా?
- నాకైతే అన్నీ కనువిందు చేసే శ్రమదాన దృశ్యాలే గాని - రెండైతే మరీనూ!
మహాభారత యుద్ధ వీరుల్ని వ్యాసుడు అర్ధరథుడు, అతిరథుడు, మహారధుడు వంటి మాటల్తో వర్ణించాడు! మరి - బృందావన అపార్ట్మెంట్ల ఎదుటి వందలాది పిచ్చి మొక్కల్ని పీకిన – నరికిన - మోకాళ్ళానించి గడ్డి పీకిన ఒక విశ్రాంత ఉన్నతోద్యోగి కష్టాన్ని ఏమనాలి?
ఎన్నిమార్లు తుడుచుకొన్నా ఆ గని చెమటలతో రెండు డ్రైన్లనూ బాగుచేసిన ఇద్దరు పెద్దవాళ్ళ బాధ్యతను దేంతో కొలవాలి?
తమ హోదాల్ని మరచిపోయి, చీపుళ్ళు పట్టిన - డిప్పల్ని మోసిన గ్రామ ప్రముఖుల స్పూర్తి?
ఇందరిన్ని రోజులుగా అన్ని వాతావరణ వైపరీత్యాల్నెదిరించి ఈ రహదారి శుభ్ర – సౌందర్యాల్ని సాధిస్తుంటే పట్టించుకోని స్థానికుల సంగతి?
గ్రామ స్వచ్ఛ సుందరోద్యమ బ్యానర్ ని ప్రతిరోజూ ఎత్తి పట్టుకొనే పోస్టల్ మెండు శ్రీను నేటి నినాదకర్త,
సహకార్యకర్తలకు విక్స్ బిళ్లల్నీ, తన పిల్లలు తెచ్చిన టీ షర్టుల్నీ పంచిన ఆనందం విశ్రాంత గ్రామ రెవెన్యూ అధికారి కొర్రపాటి వీర సింహునిది,
రేపటి వేకువ మరింత ఎక్కువ సంఖ్యలో ఇదే విజయవాడ బాటలోనే శ్రమించాలనే నిర్ణయం అందరిదీ!
అంకితులు మన చల్లపల్లికి – 58
ఎందరెందరి స్వచ్ఛ సేవలనందుకొన్నదొ చల్లపల్లి
ఇంత స్థిరమగు సేవలెవరివి? ఇందిరా గురిందపల్లివి
ప్రమోదంగా - ప్రవిమలంగా - ప్రశిష్టంగా ఆమె సేవలు
ప్రగల్భించక - పరిధి దాటక ప్రశాంతంగా ఆమె చర్యలు!
- ఒక సీనియర్ స్వచ్ఛ కార్యకర్త
12.04.2024