3089* వ రోజు...........

 పర్యావరణ ధ్వంసకమయ్యే - కేవలం ఒక్కసారికి మాత్రమే పనికి వచ్చే ప్లాస్టిక్కులు వెంటనే మానేద్దాం!

శనివారం (13-4-24) - 3089* వ నాటి శ్రమోద్యమ ముచ్చట్లు.

         ఏ బరువు పనులెవరెచ్చట నిర్వహించారో గాని, నేను చూసేప్పటికి కనీసం 3 చోట్ల చకచకా పనులు జరిగిపోతున్నాయి. పని స్థలం C/o విజయవాడ రహదారే - బృందావన గృహాల వద్ద నిన్నటి కృషికి పొడిగింపు గానే!

         చివర్లో ప్రముఖ సుందరీకరణ చొరవశాలి ఆకుల దుర్గాప్రసాదు గారు పూనుకొని, గ్రామ స్వచ్చోద్యమ నినాదాలను ప్రకటిస్తున్నప్పుడు మొత్తం కారకర్తలు రెండు డజన్ల దాకా లెక్కించాను. ఇందులో సగం మంది 4:18 కే కార్యోత్సాహం చూపుతున్నారు.

         కత్తులు ఝళిపిస్తూనూ - దంతెల్తో వ్యర్ధాల్ని ప్రోగులు చేస్తూనూ - డిప్పల్తో వాటిని ప్రక్క పొలంలోకి చేరవేస్తూనూ - 15 మంది తీరిక లేకుండా కనిపించారు. రహదారిని చీపుళ్ళతో నిష్కళంకపరుస్తూ ముగ్గురు మహిళలు లేస్తున్న దుమ్ములో నుండి లీలగా కన్పించారు!

         కాస్తంత భారీ కార్యకర్తలు ముగ్గుర్నలుగురు రోడ్డుకు తూర్పు డ్రైను గట్టు కాలుష్యాల పని పడుతున్నారు. అందులో ఒకాయన అక్కడి పిచ్చి చెట్ల మీద కసితో “సరిగ్గా విసిరితే కత్తి దెబ్బకొక ముళ్ల చెట్టు తెగిపడాలి” అంటున్నాడు.

         రోడ్డుకు పడమటి దిశగా నీడ, పూల చెట్లను సుందరకరించే నలుగురూ ఏ మాత్రం తీరిగ్గా లేరు. ఆరు గంటల వేళ సమీపిస్తుండడంతో తమ లక్ష్య సంపూర్తి తప్ప చెమట ధారల్నీ, బట్టలు దుమ్ము కొట్టుకోవడాన్ని పట్టించుకొనే అవకాశమే వాళ్లకి లేకపోయె!

         3089* రోజుల చల్లపల్లి స్వచ్ఛ - సుందర - హరితోద్యమంలో ఇవన్నీ నిత్య దృశ్యాలే కావచ్చు – అటుగా వచ్చే - పోయే గ్రామస్తులకు చూసి - చూసి విసుగనిపించవచ్చు. ఒక సమున్నత సామాజిక లక్ష్యం కోసం జరుగుతున్న ఈ శ్రమజీవన సన్నివేశాలన్నీ నాకు మాత్రం నిత్య నూతనాలే! రంగూ – రుచీ తగ్గని ఆచరణలే!

తుది సమావేశంలో :

1) వయోవృద్ధ కార్యకర్త - గొరిపర్తి కృష్ణ గారి మొన్నటి మరణ స్మృతీ,

2) కార్యకర్తలకు శంకర శాస్త్రి కృత తినుబండారాల పంపకమూ,

3) నేటి పనుల సమీక్ష తరువాత -

         రేపటి వేకువ మనం కలువదగింది సాగర్ బైపాస్ వీధిలోని కమ్యూనిస్టు వీధి వద్ద అనే నిర్ణయమూ!

          అంకితులు మన చల్లపల్లికి 59

ఈతడు వేముల శ్రీనట - పౌరశాస్త్ర బోధకుడట!

కాస్త వెనకా ముందుగ వచ్చిన వీధి సేవ మానడటా!

చెత్త - తుక్కు ప్రోగుచేయు దంతే తన ఆయుధమట!

ఊరు మారునంతదాక స్వచ్ఛసేవ మానడట!

- ఒక సీనియర్ స్వచ్ఛ కార్యకర్త     

  13.04.2024