3115* వ రోజు...........

పర్యావరణ ధ్వంసకమవుతూ - కేవలం ఒక్కసారికి మాత్రమే పనికి వచ్చే ప్లాస్టిక్కులు తక్షణమే ఆపేద్దాం!

మే మాసపు 9 వ శ్రమదాన ఘట్టం! - @3115*

         అది గురువారం వేకువ 4.15 కే ప్రారంభమైనది; తొలుత ఏడెనిమిది మందితో మొదలైనా 4.20, 4.30 కల్లా 24 మందితో కళకళలాడినది; పని విరమణ సూచక ఈల శబ్దాల పిదప 6.10 కి ముగిసినది! కనీసం ఇద్దరు గృహిణులైనా తమ గ్రామ సమాజం బాగు కోసం పాల్గొన్నది!

         పదేళ్లుగా - 3 లక్షల పని గంటల పాటు శ్రమించినా, తమ సొంత కష్టార్జిత ధనాన్ని ట్రస్టుకు చందా రూపేణా స్వచ్ఛ కార్యక్రమానికిస్తున్న – పాగోలు కంఠంనేని రామబ్రహ్మం పంటి దాతలెందరో స్తోమతుకు మించి ఎన్నెన్నో సౌకర్యాలు కల్పించినా – ఇంకా ఇప్పటికీ వీళ్ళేదో పదవీ వ్యామోహాలతో శ్రమను నటిస్తున్నారనీ,

         కేంద్ర - రాష్ట్ర ప్రభుత్వాల నుండి, విదేశాల నుండి వీళ్ళ జేబుల్లోకి ధనం ప్రవహిస్తుంటుందనీ అనాలోచితంగా - గ్రుడ్డిగా కొందరు నమ్మే స్వచ్ఛ - సుందరోద్యమమిది! ఇందుకు ఏ అమాయకుల్నీ తప్పు పట్టరాని పరిస్థితి! ఏ మంచి పనినీ, త్యాగాన్ని గుర్తించని - హర్షించని పాడు కాల మహిమ మరి!

         ఊరి సౌకర్య నిమిత్తం స్వచ్ఛ కార్యకర్తల పని దినాలు నెలలుగా – సంవత్సరాలుగా – మారుతున్నా వారి పట్టదల సడల లేదు; నిన్నటికీ నేటికీ పని స్థలంలో కూడ ఏమంత మార్పూలేదు - అదే బెజవాడ రోడ్డు – కార్యకర్తలాగింది అదే విజయా కాన్వెంటు వద్ద – తలా గంటన్నరకు పైగా చేమటోడ్చిందీ నిన్నటిలాగే మూడు చోట్ల

1) కాన్వెంట్ పడమరగానూ,

2) ప్రభుత్వాసుపత్రి వీధిలోనూ,

3) విద్యుత్ కార్యాలయం దగ్గర్లోనూ!

         ట్రక్కులో వ్యర్ధాలు నింపడమైతే జరిగింది గాని - అవెటుగా వెళ్లాయో నేను చూడలేదు.

నేటి శ్రమజీవన చివరి దశ -

1) కోడూరి వేంకటేశ్వర మహోదయుని 520/- చందాతోనూ,

2) రామబ్రహ్మం గారి పెద్దకర్మకు వారి ఆత్మీయులు పాగోలు మునసబు గారి - కుమారుడు వెంకటేశ్వర ప్రసాదుల పిలుపుతోనూ,

3) అడపా వారి నినాదాలు, సూక్తులతోనూ ముగిసింది!

         కార్యకర్తలందరం ఏకరంగు దుస్తుల్తో 12.50 కల్లా పాగోలు చేరుకొని, దివంగత మిత్రుడు కంఠంనేని రామబ్రహ్మం గారికి శ్రద్ధాంజలి ఘటించవలసి ఉన్నది!

         రేపటి వేకువ కూడా మనం విజయా కాన్వెంట్ వద్దనే కలుసుకోవలసి ఉన్నది!

   అంకితులు మన చల్లపల్లికి – 87

ఒంటరి జీవితం నుండి, వృద్ధ్యాప్యం వెతల నుండి

ఒక సత్వర హఠాద్విముక్తి కంఠంనేని అదృష్టం!

ఆతని సహృదయాన్నీ, ఆతని దాతృత్వాన్నీ

కోల్పోయిన చల్లపల్లి - పాగోలుది దురదృష్టం!

- ఒక సీనియర్ స్వచ్ఛ కార్యకర్త     

   09.05.2024

కోడూరి వేంకటేశ్వరరావు గారి విరాళం