3126* వ రోజు....... ....

 పర్యావరణ ధ్వంసకమవుతూ - కేవలం ఒక్కసారికి మాత్రమే పనికి వచ్చే ప్లాస్టిక్కులు వాడదగునా!

గ్రామ వీధి భద్రతా చర్య మంగళవారం కూడ @3126*

            సోమ, మంగళవారాల ఖాళీని రెస్క్యూ బృందం ఎప్పుడు వదిలింది కనుక! ఊరి 100 వీధుల్లో -  ముఖ్యంగా ప్రధాన దారుల్లో ఎప్పుడూ ఏదో ఒక సమస్య తలెత్తుతూనే ఉంటుంది. వీధి సమస్యలు స్వచ్ఛ కార్యకర్తల కోసమూ, కొందరు అత్యుత్సాహ కార్యకర్తలు శిరసెత్తే సమస్యల కోసమూ కాచుక్కూర్చుండడం చల్లపల్లిలో గత 10 ఏళ్ళ ఆనవాయితీ!

            నిన్న జాతీయ రహదారి వికృతాలను సరిజేసిన వాలంటీర్ల టీమ్ ఈ పూట గంగులవారిపాలెం/ భవఘ్ని నగర్ల రోడ్డు మార్జిన్ గుంటల్ని చక్కబెట్టే పని చేపట్టింది. ఆ గుంటలు వర్షాలకు నీళ్లు పెరిగి, భారీ వాహనాల వల్ల రోడ్డు దెబ్బతినే పరిస్థితిని పసిగట్టిన కార్యకర్తలు SBI దగ్గర రాతిముక్కల రద్దును చూసి, ఉడత్తు బాబు గారి అనుమతితో ఉచితంగా ఆ గుట్టను ట్రక్కులో నింపుకొని, ఆ లోపాల్ని సరిజేయడమే నేటి పని!

            ఇది ముగిశాక బండ్రేవు కోడు వంతెన దగ్గర భవిష్యత్ అవసరాల కోసం తాము నిల్వ చేసిన రద్దును అరగంటపాటు కొంత సర్ది, ఇంకా మిగిలిన రద్దును మళ్లీ ట్రక్కులో కెక్కించి, అదే రోడ్డు మలుపు వద్ద పల్లంలో కార్చి, సర్దిన సంగతిని ఛాయాచిత్రం సాక్ష్యంగా గమనించండి!

            ఐతే - ఇక్కడ ఆ రద్దుల్ని అడగ్గానే ఉచితంగా ఇచ్చిన గృహస్తులకి మనం కృతజ్ఞతలు చెప్పుకోవాలి!

ఈ వేకువ శ్రమలో ఒక చిన్న అపశ్రుతేమంటే :

- అతడు కస్తూరి శ్రీనివాసుడు! ట్రస్టు కార్మిక కృషి పర్యవేక్షకుడు! నేటి పనుల తొందరలో మరొకరు విసిరిన రాయి అతని వ్రేలిపై పడి నలిగిపోయింది. ఒకరిద్దరం కాస్త కంగారు పడినా, అతడు తన పని వదలి వెళ్లనేలేదు! రెస్క్యూ కార్యకర్తంటే అలా ఉంటుంది మరి!

            6.20 కి పద్మాభిరామ ముఖద్వారం వద్ద 3126* వ నాటి బ్యానర్ ఎదుట7 గురమూ నిలిచి, పిడికిళ్లు బిగించి, BSNL నరసింహుల వారి నినాదాలకు బదులిచ్చాం!

            రేపటి విస్తృత కార్యకర్తల కలయిక NTR పార్క్ దగ్గరే!

      అంకితులు మన చల్లపల్లికి 99

ఈ మాజీ కార్యకర్త సూర్యదేవరాన్వయుండు!

నాగేశ్వర నామధేయ - సామాజిక సుహృద్భావ

పారీణుడు! వైద్య శిబిర ప్రవర్తకుడు – J.V.V.

భార వహుడు కళాశాల భౌతిక శాస్త్రాధ్యాపకుడు!

- ఒక సీనియర్ స్వచ్ఛ కార్యకర్త          

   21.05.2024

తమ వివాహ 37 వ వార్షిక శుభ సందర్భంగా తగిరిశ రమ్య - సాంబశివరావు (రిటైర్డ్ ప్రిన్సిపల్) గారలు “స్వచ్ఛ సుందర చల్లపల్లి” నిర్మాణ ఖర్చులకై సమర్పించిన విరాళం 1,000/-.