3127* వ రోజు....... ....

 పర్యావరణ ధ్వంసకమవుతూ - కేవలం ఒక్కసారికి మాత్రమే పనికి వచ్చే ప్లాస్టిక్కులు వాడనేల?

వేకువ 4.15 కే మొదలైపోయిన వీధి శుభ్రత/ భద్రత - @3127*

         బుధవారం – 22.5.24 నాటి 22 మందిది త్యాగమనాలో, బాధ్యతనాలో, విస్తృత ప్రజాశ్రేయస్సు కోసం తపస్సనాలో తెలియడం లేదు. తపస్సనుకొంటే - అది సుమారు 2 గంటల పాటు - బెజవాడ రహదారి మీద :

1) 16 మందితో జరిగినది. ఆ కార్యకర్తల ఇవాళటి పనిముట్లు పారలు, పలుగులు, డిప్పలు. జిల్లా పరిషదున్నత పాఠశాల ఎదుట రహదారికి పూర్వ – పశ్చిమ దిశల్లోని చిన్న మురుగు మట్టి దిబ్బ, పెద్ద రద్దు మిశ్రమ గుట్టల్ని ఒక దుర్భర ఉక్క వాతావరణంలో త్రవ్వడమూ, రాళ్ళు ఉంటే ట్రక్కులోకి ఎక్కించడమూ, అందుగ్గానూ తెల్లారే సరికి చెమట/దుమ్ము మొహాలేసుకు కనిపించడమూ.... అసలీ పనులకేం పేరు పెడతారో పెట్టండి!

         ఇహపోతే - ఈ డజనులో 3 మహిళా వదనాలు. వాళ్లు మగ కార్యకర్తల్తో పోటీపడి దుమ్ము పీలుస్తూ, రద్దును డిప్పలకెత్తడమూ, చీపుళ్లతో ఊడ్వడమూ... అసలిలాంటి మురుగు – డొక్కు, పరువు, తక్కువ పనులు ప్రతి వేకువలోనూ వచ్చి ఎందుకు చేస్తుంటారో చెప్పగలరా?

         ఏమైతేనేం వాళ్ళ తపస్సు ఫలించింది; 3 రోడ్ల గతుకులూ, 2 వీధి మార్జిన్ల గుంటలూ ఇప్పుడు పూడి, ప్రయాణికులకు కొంత ఉపశమనం కల్గినట్లే!

 2) ఇక ఐదారుగురి రెండో ముఠా శ్రమించింది మళ్లీ NTR పార్కు దగ్గరే! అందులో ఇద్దరు కత్తులు ఝళిపించింది పార్కు ప్రహరీ ఆనుకొన్న పిచ్చి చెట్ల కొమ్మల మీదే! పాపం – ముగ్గురు గంటన్నర పాటు పీల్చింది ఘాటైన మురుగు వాసనే – మురుగ్గుంట నుండి పైకి డిప్పల కొద్దీ లాగింది దిక్కుమాలిన వ్యర్ధాలనే – దట్టంగా అల్లుకొన్న కాడల్నే!

         6.18 సమయంలో ఈ 22 మందీ పెట్రోలు బంకు ఆవరణలో నిలబడి మైకందిస్తే 3 మార్లు నినదించినది అడపా గురవయ్యే - కొసరుగా అతడు వినిపించింది 2 సూక్తులే!

         రేపటి వేకువ సమయాన తమ కలయిక విజయవాడ రోడ్డులోని పెట్రోల్ బంక్ దగ్గరే అని నిశ్చయించుకొని గృహోన్ముఖులయ్యారు!

    అంకితులు మన చల్లపల్లికి – 100

ఉద్వేగం లేదతనికి - ఉవ్వెత్తున ఉరికి పడడు

మెకానిక్కుకుర్రాళ్లని మెల్లగ కూడగట్టగలడు

చాల వరకు గోల రహిత స్వచ్ఛ చర్యలే అతనివి

ఎవ్వరట్టి కార్యకర్త? యువ ఉస్మాన్ షరీఫుడు!

- నల్లూరి రామారావు

   22.05.2024