3128* వ రోజు...........

 పర్యావరణ ధ్వంసకమవుతూ - కేవలం ఒక్కసారికి మాత్రమే పనికి వచ్చే ప్లాస్టిక్కులు వాడనేల?

ఈ స్వచ్ఛ - సుందరోద్యమ పనిదినం 3128*వది!

         అంటే అది గురువారం - 23.5.24 వ తేదీ, పని కాలం వేకువ 4.15 నుండి 6.05, పని చోటులు – 2, విజయవాడ దారిలోని NTR పార్కు వద్దా, ప్రభుత్వోన్నత పాఠశాల వద్దా!

         ఈ వీధి కార్మికులు 23 మందే కావచ్చు గాని, వాళ్లు కష్టించినది 40 పని గంటలైతే కావచ్చు గాని, స్వార్ధంతో పుచ్చిపోతున్న నేటి సమాజానికి వారు పంచిన స్ఫూర్తి, గ్రామ వీధి సమస్యల పట్ల ప్రదర్శించిన తెగువా కొలిచి చెప్పలేనివి!

         గ్రామ ప్రజా సౌకర్య కల్పన పట్ల ఎంత నిబద్ధత లేకపోతే - దూషణ భూషణ తిరస్కార పురస్కారాల పట్ల స్థిత ప్రజ్ఞత లేకుంటే - సంఘ జీవులుగా ఎంత తాత్త్విక పునాదుల్లేనట్లయితే –

         ఈ కార్యకర్తలు పదేళ్లుగా – మూడు నాల్గు లక్షల పని గంటలుగా ఇంతటి మురుగు – పాచి పనులు చేయగలుగుతారు? శ్మశాన సంచారాలు చేస్తారు? మొలబంటి మురుక్కాల్వలోదిగి సిల్టులూ, తుక్కులూ లాగుతారు? [ఈ వ్రాతలు కార్యకర్తల్ని ప్రోత్సహించడానికనో, వాళ్ల కృషిని ప్రపంచానికి పరిచయం చేయడానికనో భావించకుందురుగాక!]

         6.20 కి తుది సమావేశంలో నూతక్కి శివబాబు ముమ్మారు జాడించి నినాదాలు చెప్పాక – ఇంటికి వచ్చాక కూడ నాకు గుర్తున్న కొన్ని శ్రమ దృశ్యాలివి:

1) పింగళి వెంకయ్య విగ్రహం దగ్గర్లోని రాళ్ళ - ఇసుక గుట్టను విడగొట్టి ట్రక్కులో నింపుకొని, కాస్త దూరంగా ఉన్న NTR విగ్రహం దగ్గరి రోడ్డు మార్జిన్ గుంటలను పూడ్చినది;

2) ఒకే వయసూ, ఎత్తూ ఉన్న ఇద్దరు వైద్య సిబ్బంది ఆ రోడ్డును ఊడ్చిన పని నాణ్యత,

3) NTR పార్కు దగ్గరి ఘాటు కంపుకొట్టే మురుగు కాల్వను 6 గురు గంటన్నరకు పైగా సంస్కరించడమూ;

4 ) ఒకానొక (వి) జ్ఞాన ప్రసాదు మహాశయుడు చూట్టానికి కాస్త బక్కగా ఉన్నా మురుగులోని పెద్ద గోనె సంచీడు ప్లాస్టిక్ తుక్కుని ఏరడమూ,

5) అసలీ అనాగరిక పనుల్ని వీళ్లంతా సందడిగా, సంతోషంగా చేయడమూ

         రేపటి శ్రమదానం కూడ ఇదే NTR పార్కు వద్ద నుండే పార్రంభించాలని నిర్ణయించారు!

    అంకితులు మన చల్లపల్లికి – 101

ఎంత పట్టుదల చూపెనో - వీధి చెత్త తొలగించేనొ

తోటి కార్యకర్తల్లో ఉత్సాహం నింపేసెనో!

కొడాలి బాల నాగేశ్వర శర్మ ఏల ఆపేసెనొ!

స్వచ్ఛ చల్లపల్లి సేవ ఎప్పుడు ప్రారంభించునొ!

- నల్లూరి రామారావు

   23.05.2024