3129* వ రోజు....... ....

 పర్యావరణ ధ్వంసకమవుతూ - కేవలం ఒక్కసారికి మాత్రమే పనికి వచ్చే ప్లాస్టిక్కులు వాడనేల?

3129* వ పని దినం వివరాలు!

తేదీ: 24-5-24, పనిమంతులు : 24 మంది,

పనిచోటు : విద్యుత్కార్యాలయ, వాహన ఇంధన నిలయ ప్రాంతాలు,

ఎప్పటిలాగే ఈ 2 డజన్ల మంది శ్రమ వేళ 5.20 - 6.10 నడుమ!

         మరి - ఎవరెవరి హరిత – సుందరీకరణ, వీధి శుభ్రతా మెరుగుదల విన్యాసాలేమిటో, ఎంత పాటుబడుతున్నా తరగని వీధి వ్యర్ధాల పట్ల వాళ్ల మొండి ప్రయత్నాలెట్టివో, ఫలితాలెంతటివో అన్నీ వివరంగా వ్రాయడమూ, ‘జై స్వచ్ఛ చల్లపల్లి సైన్యం’ వాట్సప్ పాఠకులు చదవడమూ కష్టమే గనుక – స్థూల వివరణలే ఇస్తాను!

         ఏకంగా డజను మంది కార్యకర్తల కఠోర శ్రమతో విద్యుదుపకేంద్రం ఎదుట పదారో - పదేడో చెట్ల పాదులెంత అందంగా, పొందికగా కనిపిస్తున్నవో చూడవచ్చు!

         మురుగు కంపు పీల్చి - పీల్చి బాగా అలవాటుపడిన 6 గురు మాత్రం NTR పార్కు వెలుపలి సగం ఎండిన డ్రైనుకు సంబంధించిన :

1) పీకటానికనువుగానున్న పిచ్చి చెట్లనూ,

2) ఏవేవో తీగలనూ,

3) మరీ ముఖ్యంగా ప్లాస్టిక్ - గాజు సీసాల్నీ, కప్పుల్నీ, సంచుల్నీ బైటకు రప్పించారు. కనీసం 2 డిప్పల సదరు వ్యర్ధాల్ని విజయవంతంగా సేకరించినది - ఒక వ్యాపారీ, ఇంకా విశ్రాంత ఉన్నతోద్యోగీ!

4) కొంచెం ఓపిక చేసుకొని మీరు గనుక తెల్లారాక శుభ్రంగా ఉన్న పెద్ద లారీ వెళ్తుండడాన్నీ, ఇద్దరో – ముగ్గురో మహిళలు తాము ఊడ్చిన వీధి శుభ్రతను చూసి, లోలోపల సంతసిస్తుండడాన్నీ కనిపెట్టగలరు!

         వేలకొద్దీ రోజులు పదేపదే గ్రామ ముఖ్య వీధుల్ని తాము అందంగా తీర్చిదిద్దుతున్నా – మళ్ళీ వచ్చి పడే వ్యర్ధాల్ని విసుగు లేకుండ తొలగిస్తున్న కార్యకర్తల సహనాన్ని మెచ్చుకోక ఉండలేను!

         కాఫీపానీయానంతర సమావేశంలో జోడు కత్తుల గురవయ్య గురువు గారి నినాదాలూ,

         కార్యకర్తలు గత 3 వారాలుగా రాతి ముక్కల్తో పూడ్చిన రోడ్డు గుంటల్ని ఉచితంగా రోలర్తో  చదునుచేస్తానన్న ఇంకొకరి ఔదార్యాన్ని DRK గారు ప్రస్తావించడమూ,

         రేపటి వేకువ కూడ NTR పార్కు దగ్గరే మన పనిపాటులనే నిర్ణయమూ...!

    అంకితులు మన చల్లపల్లికి – 102

పాగోలు దుర్గా ప్రసాదు – పాగోలే స్వగ్రామం

ఆతడున్న పరిస్థితికి స్వచ్ఛ కార్యకలాపమా!

రామబ్రహ్మం కండగ ఆతని సహకారమా!

ఎంతెంతటి దూరమైన చతుశ్చక్ర పయనమా!

- నల్లూరి రామారావు

   24.05.2024