3130* వ రోజు...........

 పర్యావరణ ధ్వంసకమవుతూ - కేవలం ఒక్కసారికి మాత్రమే పనికి వచ్చే ప్లాస్టిక్కులు వాడనేల?

మరొక అసంతృప్తికర శ్రమదానం - @3130*

         ఎప్పుడో - ఏడాదికొకమారు మాత్రం జరిగే ఘటన - అంటే శనివారమైనా కార్యకర్తల సంఖ్య తరగడమూ, వీధి మెరుగుదల చర్యలు ఒకటికి రెండు మార్లు వాన వల్ల ఆగడమూ - మొత్తమ్మీద అంచనా మేరకు పని పూర్తికాకపోవడమూ ఈ 25.5.24 వేకువ జరిగింది!

         ఎంత దారుణమైన ఉక్కపోతగా ఉన్నా - 12-13 మంది కార్యకర్తలు 4.15 కాకముందే బెజవాడ బాటలోని పెట్రోలు బంకును చేరుకున్నారు; నిన్నటి తరువాయి వీధి స్వచ్ఛ కర్మలు ప్రారంభించారు; మిగిలిన కార్యకర్తలు ఒకొక్కరుగా రావడమూ, చేతొడుగులూ - పనిముట్లూ తీసుకుని వీధి కాలుష్యాలపైన కాలు దువ్వడమూ జరుగుతూనే ఉన్నది.

         అరగంటన్నా గడవక ముందే వరుణుడు ఆ ప్రాంతాన్ని దబాయించాడు.

అప్పటికే –

         సుందరీకర్తలు నిచెన్ల మీదికెగబ్రాకి కొన్ని చెట్ల కొమ్మలకి మంచీ - మర్యాద నేర్పుతున్నారు; ముగ్గుర్నలుగురు NTR విగ్రహం దగ్గర డ్రైన్ లో క్రమ్ముకొన్న పిచ్చి చెట్లనూ – తీగల్నీ లాగేస్తున్నారు.

         కార్యకర్తలు నిన్న ప్రోగేసిన చెత్త గుట్టల్ని పంచాయతీ కార్మికులు తీసేస్తే - మళ్లీ రాత్రికిరాత్రి ఎలా ప్రత్యక్షమయ్యాయో అనుకొంటూ కొందరాపన్లో ఉండగానే మళ్లీ రెండోమారు చినుకులు!

         వాన వల్ల కాస్త ఉపయోగమేమంటే - రోడ్ల, మార్జిన్ల గుంట లెక్కడున్నదీ స్పష్టంగా తెలుస్తుంది. పార్కు ఎదుటి పెద్ద గేటు వద్ద పెద్ద గుంటల్ని ఒక వీధి గుంటల స్వచ్ఛ కార్మికుడు పారతో చెక్కి పూడ్చేశాడు!

         రెస్క్యూదళమేమో కొంత మట్టీ – రాతి ముక్కలూ కనిపిస్తే - గబగబా ట్రక్కులో కెక్కించుకొని - గంగులవారిపాలెం వీధి మార్జిన్లో సర్దారు!

         నేటి 23 మంది కార్యకర్తల్లో సగం మందికి పూర్తి సంతృప్తి దక్కలేదు. 6.00 కు కొంచెం ముందే పని విరమణా, పెట్రోలు బంక్ అవరణలో కోట పద్మ గారి స్వచ్ఛ సుందర నినాదాలకు అందరూ స్పందనా,

         రేపటి వేకువ మాత్రం బంకు వద్ద కాక MRO కార్యాలయం వద్ద అందరం కలవాలని నిర్ణయించుకొని, ఈపూట కార్యక్రమం ముగిసిందనిపించారు!

    అంకితులు మన చల్లపల్లికి – 103

ఇడుగో ఇతడే శ్రీహరి – శ్రమదానోద్యమ నేర్పరి

గ్రామ మెరుగుదల కాపరి - పాఠ్యబోధనా గడసరి

యోగశిక్షణా మెలకువ వడ్డించిన విస్తరి

సామాజిక బాధ్యతలను చాటి చెప్పు కూర్పరి!

- నల్లూరి రామారావు

   25.05.2024