పర్యావరణ ధ్వంసకమవుతూ - కేవలం ఒక్కసారికి మాత్రమే పనికి రాగల ప్లాస్టిక్కులు ఇంకా వాడాలా?
మంగళవారం వేకువ సమయానిది 3153* వ ప్రయత్నం!
18.6.24 న 5.22 కే ఆ రెస్క్యూ పనులు!
స్థలం గంగులవారిపాలెం బజారు - అంటే ఊళ్లో కెల్లా స్వచ్చ – శుభ్ర – హరిత సుమ సుందర ప్రదేశమన్నమాట!
అక్కడ మరీ రాటు దేలిన మహాముదురు స్వచ్చ కార్యకర్తలు ముగ్గురు! వాళ్లకు ఉడతా సాయం చేసే మరో ముగ్గురం!
ఈ గంటా 50 నిముషాల పనుల కోసం ఒక ట్రాక్టరూ, 2 కత్తెర్లూ నిచ్చెన్లూ, ఎత్తు పీటలూ వగైరాలు!
వీధి పనుల్లోనే ఎనలేని ఆనందం వెతుక్కొనే ఈ కార్యకర్తలకు మరింత ఆహ్లాదపరిచేది - ఆస్పత్రి వారు నెలకొల్పిన మైకు నుండి వీనుల పసందైన మంద్ర సంగీతం!
అసలా సామాజిక శ్రమ దృశ్యమే ఈ కాలంలో ఒక అరుదైన - చిరస్మరణీయ ఆదర్శం!
స్వయంగా అక్కడుండి చూడని వాళ్లకు “జై స్వచ్ఛ చల్లపల్లి సైన్యం” వాట్సప్ చిత్రాలు మరొక అవకాశం!
- ట్రాక్టర్ లో ఎత్తు పీట మీద నిలిచి, ఇద్దరు కరెంటు తీగల్లోకి చొరబడే కొమ్మల్ని కత్తిరిస్తున్న,
- నిచ్చెన్ల మీదికెగబ్రాకి, తమకు నచ్చని తరు శాఖల్ని తొలగిస్తున్న,
- తెగి పడిన కొమ్మ - రెమ్మల్ని ప్రోగులు చేస్తున్న – ప్రోగుల్ని వీధి చారుల కడ్డు తొలిగిస్తూ ఉద్యానంలోకి మోస్తున్న,
- చీపురుతో ఒక సీనియర్ వైద్యుడు ఊడుస్తున్న - దృశ్య చిత్రాలకన్న గతి తప్పిన స్వార్ధం బరువు మోస్తున్న నేటి సమాజానికి ఆదర్శాలేముంటాయి?
“ఎవరొచ్చినా రాకున్నా మేం ముగ్గురమే గ్రామ వీధుల్ని తీర్చిదిద్దుతాం” అనే ఆత్మవిశ్వాసంతో కనిపిస్తున్న త్రిమూర్త్యాత్మక స్వచ్ఛ సైన్యం ఫొటోను గమనించండి!
ఈ నివేదిక వ్రాస్తున్న నేనే నేటి కార్యక్రమం ముగింపులో ఉద్యమ నినాదాలిచ్చాను!
రేపటి వేకువ మన పరస్పర పునర్దర్శనం వాన లేకుంటే బస్టాండూ, ఉంటే 1 వ వార్డులోని బాలికల హాస్టలూ!
శ్రమ భారం తగ్గేందుకు చతురులు
సాటి లేని చల్లపల్లి శ్రమదానం వేళలందు
వందల మొక్కల పేర్లను కొందరు చెప్పేయగలరు
ఇద్దరు ముగ్గురి పనులను ఒక్కొక్కరె చేస్తుందురు
శ్రమ భారం తగ్గేందుకు చతురులు కల్పిస్తుందురు!
- నల్లూరి రామారావు
18.06.2024