3154* వ రోజు....... ....

 పర్యావరణ ధ్వంసకమవుతూ - కేవలం ఒక్కసారికి మాత్రమే పనికి రాగల ప్లాస్టిక్కులు ఇంకా వాడాలా?

క్లుప్తంగా 3154* వ నాటి వీధి సంస్కారాలు!

         ఆదివారం తరువాయిగా అవి మరొకమారు 1 వ వార్డు వీధుల్లోనే! పాతిక వేలమంది గ్రామ జన సంఖ్యలోనూ వెయ్యి మందికి పైగా 1 వ వార్డు నివాసుల్లోనూ అట్టి సంస్కారాలకు పాల్పడిన వారు - పురిటిగడ్డకు చెందిన నాదెళ్ల గుత్తేదారుతో సహా - కేవలం 23 గ్గురే - అందుక్కారణం బహుశా వాన రాకడ గురించి సందేహమే!

         ఈ ఒక్కో కార్యకర్త సేవను గురించి ఏ 2 వాక్యాలు వ్రాసినా పేజీలు పెరిగిపోతాయి! అందుకే నేనెప్పుడూ విడివిడి కర్తవ్య నిర్వహణల గురించి కాక - సామూహిక ప్రయత్నం గురించే వ్రాస్తుంటాను!

         సందేహాలో, సమాధానం దొరకని ప్రశ్నలోగాని - కొద్ది మందిని తొలిచే సంగతులు -

         “సజ్జా వారి, మిలిటరీ వెంకటేశ్వరావు గారి ఇళ్ల వెనుక డ్రైన్ మురుగు వాసనను భరిస్తూ గడ్డినీ, పిచ్చి మొక్కల్నీ, తుక్కునూ తొలగించే ఖర్మ 5-6 గురు కార్యకర్తలకెందుకు?

         “30-40 ఏళ్లు గౌరవ ప్రదంగా ఉద్యోగించి, రిటైరైన ఉద్యోగులకు వార్డు మొదట్లోని పాడుబడ్డ చెరువు గట్లు ఊడ్చే దుస్థితి ఏల?”

         “జరుగుబాటుకు కొరత లేని ఉద్యోగినులూ, గృహిణులూ తగుదుమమ్మా అని వేకువ 4.15 కే రోడ్ల పారిశుద్ధ్యానికి పూనుకోవడమా?

         “హాస్టల్ ప్రాంతాన్ని శుభ్రపరిచిందికాక - అంతకు ముందున్న అడపా ఉద్యాన స్థలంలో మళ్లీ క్రోటన్లతో, నేరేళ్లతో నింపడమెందుకు?

         “వృక్ష శాఖల సుందరీకరణలెందుకు?

         “రోడ్ల మార్జిన్లు క్రుంగితే రాతిముక్కలతో నింపి, వాటి పునః పటిష్టత లేల?

         “పదేళ్లుగా గ్రామం కోసం ఈ నిర్విరామ శ్రమదానం ఏమాశించి?

         “అసలిలాంటి ప్రశ్నలకు ఇప్పటికీ సగానిపైగా ఊరి జనం స్పందించరేల?

         కనీసం – పని జరిగే ప్రాంతీయులైనా కలిసిరారెందుకు?

         - ఇలాంటి సశేష ప్రశ్నలెన్నో!

         6.20 కి గ్రామ శ్రమదాన పునరంకితుడైన బాల దుర్గారామ్ ప్రసాదుని వేగవంతమైన నినాదాలతో నేటి శ్రమ వేడుకకు విరామం.

         హిందూ శ్మశాన వాటిక దారి బాగుదల కోసం రేపు కూడ మనం బాలికల హాస్టల్ వద్దనే కలుద్దాం!

         భ్రమలు లేవు మనకెవరికి

స్వచ్చోద్యమ చల్లపల్లి శతశాతం వెలిగిందని

తండాలుగ ఊరి ప్రజలు తరలి పాలుగొన్నారని

కథ సుఖాంతమయిందనీ - భ్రమలు లేవు మనకెవరికి

సగం ప్రయాణం జరిగిన సంతోషం మాత్రముంది!

- నల్లూరి రామారావు

  19.06.2024