3171* వ రోజు.......... ....

 పర్యావరణ ధ్వంసకమవుతూ - కేవలం ఒక్కసారికి మాత్రమే పనికి రాగల ప్లాస్టిక్కులు మనకేల?

మళ్లీ రెస్క్యూ (సోమ) వారం పనులు! - @3171*

          బండ పనులకలవాటు పడిన నలుగురు కార్యకర్తలుండగా, వాళ్లకండగా నలుగురు అనుభవజ్ఞులు – మరీ ముఖ్యంగా నాలుగైదు రోజుల వియోగానంతరం పునరాగమించిన శంకర శాస్త్రి గారుండగా - వీధి రెస్క్యూ పనులకేం లోటు?

          అసలు వాళ్లు 4.20 కే గస్తీగది వద్ద హాజరయ్యారు. కొసరు వాళ్లం మాత్రం ఒకొక్కరుగా కలుసుకొన్నాము. (వీళ్లలో 19 నెలల ప్రాయపు తాతినేని వారసుడూ ఉన్నాడు!) ముందుగా కార్యకర్తల చూపు సోకింది బండ్రేవుకోడు కాల్వ మలుపు దగ్గర గజిబిజిగా పెరిగిపోయి, వాహన చోదకులను ఇబ్బంది పెటుతున్న గద్దగోరు పూల చెట్ల మీద.

          అవన్నీ స్వచ్ఛ కార్యకర్తలు నారుపోసి - నాటి - నీరు పోసి - సాకిన పాతిక ముప్పై వేల మొక్కల్లోనివే! ఐనా అదుపుతప్పి, ఆహ్లాదంతోబాటు ఆ సౌకర్యం కలిగిస్తున్నందున అరగంటలో ఆ కొమ్మ రెమ్మల్ని అదుపు చేశారు!

          అంతకన్నా మొండి - బరువు పని గంగులవారిపాలెం బజారులోని శాయి నగర్ తొలి వీధి వద్ద దొరికింది. మూడేళ్ల క్రితం దొరికిన అతి పెద్ద చెట్టు మొదలుకు రంగులద్ది, అది పిల్లల్ని బాగా ఆకర్షించినా – వానలకు శిథిలమౌతుంటే - దాన్ని ముక్కలు కొట్టి, మిగిలిన మొద్దును నిచ్చెన మీదుగా ట్రాక్టర్లో కెక్కించి, తరలించడమే ఆ పని!

          ఇక అప్పుడు - పద్మాభిరామం వద్ద బృందావనుడిని అనుసరించి, అందరూ తమ శ్రమదానోద్యమ నినాదాలు వల్లించారు. గస్తీగది వద్దకు చేరుకొని, కబుర్లూ - కాఫీ కాలక్షేపం చేసి, 6.45 కు ఇళ్ళకు చేరుకొన్నారు!

          తకధిమి తక నాట్యం వలె

ముక్కుచు - మొహమాటపడుచు తప్పని తద్దినం కాదు

స్వచ్ఛోద్యమ చల్లపల్లి సామాజిక శ్రమ దీపిక!

స-రి-గ-మ-ప-ద-గానం వలె - తకధిమి తక నాట్యం వలె

బృందగానమును పోలిన అందమైన శ్రమవేడుక!

- ఒక తలపండిన కార్యకర్త

   08.07.2024