పర్యావరణ ధ్వంసకమవుతూ - కేవలం ఒక్కసారికి మాత్రమే పనికి రాగల ప్లాస్టిక్కులు మనకేల?
గురువారం (11.07.2024 ) నాటిది 3174* వ శ్రమదానం!
నిన్నటి వలెనే ఈ పూట కూడ 27 మంది వాలంటీర్లేగాని - దైనందిన శ్రమ వేళలు 4.30 - 6.00 అనే హద్దుల్ని ఉల్లంఘించారు! 4.13 నుండి 6.16 అనగా 2 గంటల 3 నిముషాల పాటు సదరు దానం జరుగుతూనే ఉన్నది! సుమారు 50 పనిగంటల ప్రయత్నంతో పుట్టుకొచ్చిన వ్యర్థాల లోడింగు పూర్తి కాకపోవడమే జాప్యానికి కారణం కావచ్చు!
శ్రమదాన పరిగ్రహీత మళ్లీ సాగర్ టాకీసు ప్రాంతమే! ఐతే ఎట్టకేలకు 2 రోడ్ల కూడలిని దాటి మరో 30-40 గజాలు పడమరగా పురోగమనం ఉన్నది! అసలు నేనిదంతా వివరించకుండానే ఛాయా గ్రాహక ద్వయం (PSS & DRK) ఆద్యంతం పెట్టిన దృశ్య శ్రవణ చిత్రాలే ఈపూట వీధి పారిశుద్ధ్య/సుందరీకరణ శ్రమను వివరింపగలవు!
- నిన్న పంచాయతీ కార్మికులు సేకరించని వ్యర్థాల్ని లోడింగు చేయడమూ,
- సిమెంటు బాటకు దక్షిణాన జానెడేసి పల్లాలుంటే సైజు రాళ్లను పేర్చి, సర్ది, పూడ్చడమూ,
- మురుగు కాల్వల్లో దిగలేదుగాని - వాటి అంచులపైన నిలిచి, గడ్డినీ, పనికి మాలిన చెట్ల కొమ్మల్ని తొలగించడమూ,
- ఇటు సినిమా హాలు ప్రక్కనా, అటు ఉత్తరపు ఉద్యానంలోనా నిన్న మిగిలిన పనుల పూర్తీ, నేటి పనుల వివిధ దశలన్నమాట!
నిన్నటిలాగా బైపాస్ మార్గంలో 2 ప్రక్కలా వ్యర్ధాల గుట్టలు మిగిలి పోరాదనే పట్టుదలతో - 2 మార్లు బూర మ్రోగినా- ఐదారుగురు తప్ప ఎవరూ పని నిలుపుదల చేయలేదు!
6. 15 దాటి - సూర్యుడు గబగబా పైకెగ బ్రాకుతున్న కొద్దీ - పనివేగం పెరిగి, గాల్లో ఎగురుతున్న డిప్పలూ, కార్యోత్సాహంతో కదులున్న కార్యకర్తలూ - మరి ఇవేగదా - స్వచ్ఛ చల్లపల్లి ప్రత్యేకతలు!
తుది సమీక్షా కాల సమావేశంలో:
1) హిందూ శ్మశాన వాటికకు సజ్జా చలపతి గారి భూరి విరాళమూ, ప్రభుత్వ సహాయం పొందే ప్రయత్నమూ,
2) శంకర శాస్త్రి గారి 5,000/- సహాయమూ,
3) మరొక వ్యాపారి 500/- అజ్ఞాత విరాళమూ మరికొన్ని విశేషాలు!
శుక్రవారం నాటి శ్రమదానం కోసం కూడా సినిమాహాలు పడమరగా జరుపుటకు మరొకమారు కలుద్దాం!
ప్రకంపనలై - ప్రభంజనమై
ఎందరో స్వచ్చాభిమానులు ఎంతగా ఆశీర్వదించిరొ
ఎందరెందరు దానశీలుర దృష్టి ఇచ్చట ప్రసాదించిరో
కవుల - గాయక - కళాకారుల కలం - గళములు ప్రతిధ్వనించెనొ
ప్రకంపనలై - ప్రభంజనమై స్వచ్ఛ సంస్కృతి పాదుకొనెనో !
- ఒక తలపండిన కార్యకర్త
11.07.2024