3175* వ రోజు.......... ....

 పర్యావరణ ధ్వంసకమవుతూ - కేవలం ఒక్కసారికి మాత్రమే పనికి రాగల ప్లాస్టిక్కులు మనకేల?

3175* వ శ్రమ వివరాలిలా....

          తారీఖు ప్రకారం అది 12.7.24; రోజు పేరు శుక్రవారం; శ్రమప్రదేశం విజయవాడ రోడ్డుకూ సాగర్ టాకీసుకూ మధ్యస్తం; శ్రమకాలం గంటా 50 నిముషాలు, మబ్బు పట్టి చల్లగా అనిపిస్తున్నా - ఉక్క వాతావరణంలో పనులు చేసుకుపోయిన వారు అక్షరాలా 24 మంది!

          అసలు ఈ కార్యకర్తల ఉద్దేశమైతే బైపాస్ వీధి శుభ్ర సౌందర్యమే! కాని ఇందులో కొందర్ని ప్రక్క అడ్డ రోడ్లు వలపన్ని టెంప్ట్ చేస్తుంటాయి! ఈ ఉదయం తెల్లారుతున్నప్పుడు ఐదారుగుర్ని నారాయణరావు నగర్ వైపు 2 వీధులు ఆకర్షిస్తే - వాళ్లు చేసేదిలేక బాగుపరిచి వచ్చారు! (అందులో ఒక భారీ వృద్ధ కార్యకర్త ఇబ్బంది పెడుతున్న నడుమును గొర్రు ఆసరాగా సముదాయిస్తున్న చిత్రాన్ని గమనించారా?

          వాట్సాప్ ద్వారా ఈరోజు వారీ శ్రమదానాన్ని తెలుసుకొంటున్న వీక్షక పాఠకులు ఈ పూట ముందుగా చూడదగింది సినిమా హాలు మలుపు వద్ద రిపేరు చేసిన సిమెంటు రోడు దక్షిణపు మార్జిన్ గుంటనూ, నిటారుగా నిలబెట్టిన రైతు - సంత బజారు నామ ఫలకాన్ని!

          మన స్వచ్చ కార్యకర్త గంధం వేంకటేశ్వరుని ఇంటి వద్దనే డజను మంది కష్టం ఫలించి, పాక్షికంగా మురుగుకాల్వా, పూర్తిగా వీధి అంచులూ బాగుపడినవి! అక్కడ నిలిపి ఉన్న ట్రాక్టర్ లోని సగం వ్యర్ధాలు పుట్టుకొచ్చింది అక్కడే! గోనె సంచీడు ప్లాస్టిక్ తుక్కులు కూడ అక్కడి దుకాణ సముదాయాల దగ్గరివే!

          పని సందడి నెలకొన్నా - మైకు పాటలు మ్రోగుతున్నా – అచ్చటి గృహస్తుల్లో మూడొంతుల వారి వాకిళ్ళు తెరుచుకోలేదు! లేచిన వాళ్లైనా స్వచ్ఛంద శ్రమదానాన్ని పట్టించుకోనూ లేదు!

          చినుకులు పడబోతున్న వాతావరణమున్నా సగం మంది కార్యకర్తలు 6.10 దాక పనులాపలేదు.

          నేటి తుది సమావేశ ఆలస్యానికి మరోకారణం పల్నాటి వీర మహిళ - అన్నపూర్ణ! ఆమె పాయసం రుచిని అందరూ ఆస్వాదించారు!

          అడపా వాని సూక్తిముక్తాల పిదప -(నిన్నటి నినాదాలకర్త పసుపులేటి సత్యం కాగా) నేటి స్వచ్చోద్యమ సాంప్రదాయక నినాదాలు భోగాది వాసునివి!

          రేపటి వేకువ కూడ ఇదే బైపాస్ వీధి బాగు సేత కోసం దివిసీమ పాలిటెక్నిక్ వద్దనే కలుద్దాం!

          స్వార్థ క్రీడలుండ విచట

ఇది శ్రమదానం పోకడ – ఇది సామాజిక బాధ్యత

ఊరి కొరకు తయారైన నిత్య శ్రామికులు వీరు

సామూహిక హితం తప్ప - స్వార్థ క్రీడలుండ విచట

అందుకె ఇది చల్లపల్లి స్వచ్ఛోద్యమ ఘనచరిత్ర!

- ఒక తలపండిన కార్యకర్త

   12.07.2024