3177* వ రోజు.......... ....

 పర్యావరణ ధ్వంసకమవుతూ - కేవలం ఒక్కసారికి మాత్రమే పనికి రాగల ప్లాస్టిక్కులు మనకేల?

3177 వ వీధి శుభ్రతాచర్యలు పాతిక మందివి!

          15.7.24 (సోమవారం) గ్రామ శ్రమదాన సంప్రదాయం కాస్త మారి, రెస్క్యూ టీమ్ తో బాటు ఇతర కార్యకర్తలు కూడ కలిసి, గంగులవారిపాలెం వీధిలో సన్ ఫ్లవర్ కాలనీ రోడ్డు మొదట్లో ఆగారు. ఐతే - అక్కడ పనిలో వొంగకుండా, శాయినగర్ తొలి వీధిని పట్టుకొన్నారు. ఒక నెల రోజుల వానలకే అక్కడ మెట్టతామర పూలమొక్కలు అడవిగా పెరిగిపోయి, ఉత్తరపు ఖాళీల్లో రకరకాల పిచ్చి-ముళ్ల మొక్కలూ, తీగలూ ప్రాకిపోతే –

          నికరంగా డజను మంది ఆ 50 గజాల వీధి బాగుదలలోనే తలమునకలైపోయారు! ఆ మసక వెల్తురులో ఏవి పీకేయవలసిన మొక్కలో - ఏవి ఉంచవలసిన గోగు, కొయ్య తోటకూర మొక్కలో నాబోటివాళ్లు గుర్తించడం ఆలస్యమైపోయింది.

          దక్షిణం ప్రక్క మురుగు కాల్వ సగమేమో గడ్డి క్రమ్ముకుపోయి, కాడలల్లుకొని, నడకే మరిచిపోయింది. ఆ కంపును భరిస్తూ, గడ్డినీ కాడల్ని బైలుకు లాగిన నలుగురు కార్యకర్తలదెంత కష్టమో.... “నేను విన్నాను, నేను అర్థం చేసుకొన్నాను!”

          అర్ధం చేసుకోలేనిదొకటే – “తమ వీధిలో - ఇళ్ల మధ్యలో ఇందరు కష్టపడుతుంటే - ఆ 10-12 ఇళ్ళవారెవరూ వాకిళ్లు తెరచి వీధిలోకి రారెందుకని?”

          ఇచ్చటికి కాస్త దూరంగా - నిన్న పని విరమించిన ఇంటి ఎదుటి ఉద్యానంలో మళ్లీ ముగ్గురు పూనుకొని కరెంటు తీగల దాక ప్రాకిన పూల తీగల్నీ - మళ్లీ 3 నెలల దాక అణగి మణగి ఉండేట్లు చూశారు.

          ఇంకో ఇద్దరిది అదో టైపు! ప్రధాన శ్రమదాన స్రవంతికి దూరంగా, వాళ్లొక గలీజు చోటు ఎన్నుకొంటారు, ఎంత ఆలస్యమైనా సరే - కష్టమైనా సరే - ఆ భాగాన్ని క్షుణ్ణంగా తీర్చిదిద్దిగాని విరమించరు. ఈ పూట వాళ్ళలా తీర్చిదిద్దిన ప్రాంతం సన్ ఫ్లవర్ కాలనీ వీధి ప్రక్కన లోతైన డ్రైను గట్టు! (ఇందులో ఓ పెద్దాయనే ఈ పూట నినాదాలు మ్రోగించింది!)

వీధి వ్యర్ధాల్ని ఎత్తడం ఈ పూట కుదర్లేదు!

6.20 కి పనిపాటుల సమీక్షా సమయంలో

1) నిన్నటి సభా విశేషాలూ,

2) గత నెల ట్రస్టు ఆదాయ వ్యయాలూ,

3) అక్టోబరు 3 న అమెరికాలో నాదెళ్ళ సురేశ్ చల్లపల్లి స్వచ్చోద్యమం జ్ఞాపికగా చేయబోయే 100 కిలోమీటర్ల పరుగూ,

4) మాలెంపాటి గోపాలకృష్ణయ్య గారి పునరాగమమూ ప్రస్తావనకొచ్చాయి!

          నినాదాల కోసం కోడూరు వెంకటేశ్వర మహోదయునికి మైకు ఈయకపోవడం మంచిదయింది!

          రేపటి మన పునర్దర్శనం గంగులవారిపాలెం వీధిలోని సన్ ఫ్లవర్ కాలనీ రోడ్డు వద్దనే!

          చక్కదిద్దిన – చింతమార్చిన

కళాకాంతులు లేని ఊరికి, హరిత సంపద లేని వీధికి

అడుగు ముందుకు పడని డ్రైనుకు, అన్ని పబ్లిక్ ప్రదేశాలకు

శరీర శ్రమతోనె లోటును చక్కదిద్దిన - చింతమార్చిన

స్వచ్చ సుందర ఉద్యమాన్నే సహర్షిస్తాం - సమర్ధిస్తాం!

- ఒక తలపండిన కార్యకర్త

   15.07.2024