పర్యావరణ ధ్వంసకమవుతూ-కేవలం ఒక్కసారి వాడేసే ప్లాస్టిక్కులు మనకేల?
మంగళవారం (6.08.2024) నాటి రహదారి సుందరీకరణ - @3196*
ఈ వేకువ కూడ NH 216 మీద – పెదకళ్ళేపల్లి క్రాస్ రోడ్డు సమీపాననే 2 డజన్ల మంది సుమ – హరితీకరణ ప్రయత్నం! అందుకు నిన్నటి రాత్రీ – ఈ వేకువ కార్యకర్తల సన్నద్ధం!
కొలతలు కొలిచి, ఎనిమిదేసి అడుగుల ఎడంగా – బాటకు దక్షిణంగా – కర్ర పుల్లలు పాతడం నిన్నటి పనీ, లెక్క ప్రకారం గద్ద గోరూ, పారిజాతం పూల మొక్కల్నీ, మట్టినీ, ఎరువుల సంచుల్నీ ట్రాక్టర్ లో సర్దడం ఈ వేకువ పనీ!
మీరెవరైనా వాట్సప్ ఫొటోల్లో చూడవచ్చు – బాగా ఎత్తైన రోడ్డు మీద నుండి క్రింది మార్జిన్ లోకి దిగి పనిచేస్తున్న మహిళా కార్యకర్తల్నీ, కాస్త ఎడంగా పెరుగుతున్న వరి పైరుల్నీ! తెల తెల వారే వేళ - ఒక మంచి ఆశయంతో సర్వజానానందం కోరి జరుగుతున్న ఈ మహత్తర శ్రమ సన్నివేశాలెంత మనోహరంగా ఉన్నవో!
ఈ కాస్త మంది తలా గంటన్నర శ్రమతోనే 200 గజాల రహదారి శుభ్రంగా మారిపోతున్నదే – వార్డులన్నిటి నుండీ కనీసం 10 మంది వంతున వచ్చి ప్రయత్నిస్తే? 150-200 మంది కలిసిమెలిసి వీధుల అందచందాలకు బాధ్యత వహిస్తే? రోజూ 100 కి తగ్గకుంటే పూల మొక్కల్తో రహదారుల్నీ – గ్రామ వీధుల్నీ అలంకరిస్తుంటే? అసలా శ్రమ దృశ్యాలు ఊహించుకోవడానికే అపురూపంగా ఉన్నాయి. ఎప్పటికైనా అవి స్వచ్చ – సుందర చల్లపల్లిలోనే సాధ్యపడేది!
నేటి వేకువ పని వివరాల కొస్తే :
- గద్ద గోరులు 31, పారిజాతాలు 19, మొత్తం 50 పూల మొక్కలు నాటారు.
- నిన్న కొన్ని ఏరినా సరే – ఈ పూట కూడ గోనె సంచి నిండా ప్లాస్టిక్ కప్పులూ, గ్లాసులూ, సీసాలూ దొరికాయి. ఇంకో పెద్ద సంచికి సరిపడా కళ్ళేపల్లి రోడ్డు కూడలి వద్ద నాలుగు ప్రక్కలా మిగిలిపోయాయి!
నేటి సమీక్షా సమావేశ వివరాలివి :
- నేను స్పష్టం చేసిన నినాదాలు
1) “జై – స్వచ్చ సుందర చల్లపల్లి – జై జై స్వచ్చ సుందర చల్లపల్లి!
2) స్వచ్చ సుందర ఆరోగ్య చల్లపల్లిని సాధిస్తాం! సాధిస్తాం!
3) స్వచ్చ - సుందర ఆనందం చల్లపల్లిని – సాధిస్తాం! సాధిస్తాం!
4) స్వచ్చ సుందర ఆదర్శ చల్లపల్లిని – సాధిస్తాం! సాధిస్తాం!
- అడపా గురవయ్య సూక్తి ముక్తాలు,
- రేపటి సమైక్య శ్రమదానం కోసం కలువదగినది – శివరామపురం రోడ్డుకు తూర్పుగా!
మాలెంపాటి గోపాలకృష్ణయ్య గారి (అమెరికాలో ఉన్నా సరే) క్రమం తప్పని నెల చందా 2000/- చెక్కు రూపంలో కార్యకర్తల సమక్షంలో ధన్యవాదపూర్వకంగా అందినది.
బత్తిని శ్రీనివాస్ - ఉమాదేవి గారలు (హైదరాబాద్) చల్లపల్లి స్వచ్చోద్యమాన్ని అభిమానిస్తూ నెలనెలా పంపుతున్న 5,000/- నెలవారీ చందాను ఈరోజు ఆన్లైన్ లో పంపినందుకు కృతజ్ఞులము .
ఉలకొద్దా – పలకొద్దా?
ఊరి చిక్కు సమస్యలకు ఉలకొద్దా – పలకొద్దా?
దినదిన మొక గంట శ్రమే అసాధ్యమనిపిస్తుందా?
నీకు ఇంగితం నేర్పిన – నిన్ను తీర్చిదిద్దినట్టి
గ్రామ ఋణం తీర్చేందుకు కాస్తయినా పాటుబడవా?
- ఒక తలపండిన కార్యకర్త
06.08.2024