3197* వ రోజు......... ....

 పర్యావరణ ధ్వంసకమవుతూ-కేవలం ఒక్కసారి వాడేసే ప్లాస్టిక్కులు మనకేల?

మళ్ళీ 216 వ రహదారికే 23 గ్గురి సేవలు - @3197*

            అది 8.8.24 – శ్రావణ బహుళ చవితి గురువారపు బ్రహ్మ కాలం; NH 216 కు చెందిన శివరామపురం అడ్డ రోడ్డుకు దగ్గర్లోని ఒక బస్ షెల్డర్ ప్రాంతంలోని దక్షిణపు సుమారు 150 గజాల ప్రాంతం; తగదుమమ్మా అని 2-3 ఊళ్ళకు చెందిన ఇరవై ముగ్గురి సంసిద్ధం; వానలకు వెరవక ఎండలకు జడవక ఏ నాటి నుండో చల్లపల్లి గ్రామ స్వచ్చ శుభ్ర బాధ్యతలు మోస్తున్న మొండి ఘటాలవి!

            ఈ వేకువ జామున రహదారి వెంట 50 పూల మొక్కలు నాటడానికి వానదేవుడు సహకరిస్తాడనే అంచనాతో 3 ½ AM కో లేచి, 4.15 కి కార్యకర్తలు ఆ దూర స్థలానికి చేరుకున్నారు. ఐదారు సార్లు పూల వర్షం కురిసి, వాళ్ళ తలలూ బట్టలూ తడిస్తే తడిశాయి గాని, పనులకు ఆటంకం కలగలేదు. పనిచోటు తడితడిగా మారింది గాని, ఏ ఒక్కరూ జారి పడలేదు.

            కాకపోతే ఒక అరుదైన సంఘటన అక్కడ రోడ్డు ప్రక్కన పడి, ఆకులు ఎండి, చుట్టూ గడ్డి పెరిగిన ఒక తాటి చెట్టు మట్టలు నరుకుతున్న ముగ్గురులో ఒక ఆకుల దుర్గా ప్రసాదు గజమెత్తున ఎగిరి ప్రక్కకు దూకాడు అది తాటి పామో, జెర్రి పామో  గాని అతని చేతి ప్రక్కగా జరజరా ప్రాకిందట! 2 నిముషాల తర్వాత వాళ్లు తమ పనికానిచ్చారు.

            ఒక వంక సన్న చినుకుల తుంపర మైకు నుండి ఘంటశాల వారి పాటా  - మధ్యలో ఇద్దరు ముగ్గురి ఛలోక్తులూ కుంటుబడకుండా ఉత్సాహంగా సాగిపోతున్న బాధ్యతామయ వ్యక్తుల సామాజిక కర్తవ్యాలూ ఈ సన్నివేశాన్ని దగ్గరగా చూస్తే ఎంత మనోహరంగా ఉంటుంది? ఆ విధంగా

- రహదారి మీద పేరుకుంటున్న తడిమన్నును గోకుడు పారల్తో చెక్కిన,

- మొక్కలు పెట్టే చోట కలుపూ తొలగించిన, పాదులు త్రవ్విన,

- 5:1 నిష్పత్తిలో సువర్ణ గన్నేరు, పారిజాత వంశాల మొక్కలు నాటిన,

- ఒక గోనె సంచీడు ప్లాస్టిక్ సామాన్లు ప్రోగేసిన పనులన్నీ విజయవంతంగా ముగిశాయి.

            ఇక అప్పుడు రాదారి ప్రయాణికులు ఉలిక్కిపడేలా వినిపించాయి కోడూరు వేంకటేశ్వరుని స్వచ్చ సుందరోద్యమ నినాదాలు!

            ఆ పిదప అడపా వాని నిత్య వినూతన సూక్తులు!

            ఈ మహత్కార్యాలను చూసిన పర్యవేక్షించిన డాక్టరు దాసరి రామకృష్ణ ప్రసాదుని అభివందనలు!

            అందరి సూచనల సారాంశంగా రేపటి వేకువ అందరం కలువదగిన చోటు ఇదే NH 216 లో సబ్బినేని భవాని గారి ఆస్పత్రి తిన్నగా అనే నిర్ణయం!                      

         ఎవరు చెప్పగలరులే

ఎవరు చెప్పగలరులే ఏదో ఒక రోజున

చల్లపల్లి జనమంతా కదలి ఒక్క పెట్టున

ఎవరి వీధి చిక్కుముడులు వారె విప్పి చూపిన

ఆశ్చర్యం ఏముండదు అన్ని అనుకూలించిన!      

- ఒక తలపండిన కార్యకర్త

     08.08.2024