3198* వ రోజు......... ....

 ఒక్కసారికి మాత్రమే ఉపయోగించే ప్లాస్టిక్ వాడొద్దని ప్రతినబూనుదాం. కాలుష్య కోరల నుండి పర్యావరణాన్ని మనమంతా కాపాడుదాం.

3198* రోజుల శ్రమదాన కార్యక్రమం

         ఈరోజు (09.08.2024) శుక్రవారం వేకువ జామున 4.20 కి 9 మంది స్వచ్ఛ సైనికులతో దైనందిన స్వచ్ఛ సేవను మొదలు పెట్టి 216 జాతీయ రహదారికి ఇరువైపులా నాటుతున్న మొక్కలలో భాగంగా ఈరోజు 38 సువర్ణ గన్నేరు, 11 పారిజాతం, 6 గన్నేరు మొక్కలు (మొత్తం 55) నాటే పనిని హైవేకు ఒక ప్రక్కన ప్రారంభించారు.

         సమయం గడిచిన కొద్దీ ఒకొక్కరు ఒకొక్కరుగా పనిలో ప్రవేశించి ముందుగా నిర్దేశించిన ప్రదేశంలో పాదు త్రవ్వి, మొక్క పెట్టి, ఎరువు వేసి, నీటి తడికి కుదురు చేసుకుంటూ ఎవరి పనిలో వారు నిమగ్నమవడం, సమయం వృధా కాకుండా మహిళా కార్యకర్తలిద్దరూ మొక్కలను చేతి ముందుకు అందించడం, ఒక ఊరి కొరకు స్వచ్చందంగా, విసుగూ విరామం లేకుండా దశాబ్దకాలం జరిగినా ప్రతిరోజూ నూతన ఉత్సాహంతో ఎగిసిపడే కెరటంలా శ్రమిస్తున్న ఈ స్వచ్ఛ కార్యకర్తల్ని ఆ పని సమయంలో ఒకసారి చూసినా చాలనిపిస్తుంది.

         216 జాతీయ రహదారిపై ఆ సమయంలో స్పీడుగా వెళ్లిపోయే వాహనాల నుండి జాగ్రత్తగా ఎలాంటి ఇబ్బంది లేకుండా వారి పనిని పరిపూర్ణం చేసుకొని ఈరోజు 6 గంటల సమయానికి 55 మొక్కలు నాటి పుట్టెడు సంతోషాన్ని మనసంతా నింపుకున్న స్వచ్ఛ సైనికులకంటే ధన్యులెవరు, వీరి స్వేదంతో తడిసి చల్లపల్లి పునీతమై, పరిశుభ్రమై, స్వచ్చంగా, సుందరంగా రూపుదిద్దుకుంటున్న నేపధ్యంలో రాబోయే రోజుల్లో జాతీయ రహదారిపై ప్రయాణించే వారికి ఈ హైవే మొత్తంలో ఒంగోలు to కత్తిపూడి వరకూ ఎక్కడా కానరాని అందచందాల పూలసోయగాలు చల్లపల్లి ప్రవేశంతోనే దర్శనమిచ్చి చెట్లకొమ్మలే చేతులుగా స్వాగతం పలకబోతున్నాయి.

         ఒక సిరా చుక్క, లక్ష మెదళ్ల కదలిక అన్నట్లుగా మార్పు కోసం వేసిన ఒక అడుగు చల్లపల్లి అందాలను చూసిన అనేక మంది మెదళ్ళను ఆలోచింప చేస్తుందనడంలో అతిశయోక్తి లేదు.

         6.05 నిముషాలకు పని ముగించిన 23 మంది కార్యకర్తల కాఫీ కబుర్ల అనంతరం -

           స్వచ్ఛ కార్యకర్త జాని గారి నినాదాల హోరుతో చంద్రబాబు గారి ధ్వని అనుకరణతో ఈరోజు చివరి ఘట్టం సరదాగా గడిచింది.

         మెహర్ రైస్ మిల్లు వారి నూతన గృహ ప్రవేశ ఆహ్వానం, డొక్కా సీతమ్మ లాంటి మన అన్నపూర్ణమ్మ గారి మామ గారైన పల్నాటి మల్లిఖార్జునరావు గారి పేరుతో ఇచ్చిన 2,000/- విరాళం,

         TV లో రేపటి మా ప్రసారాలు అన్నట్లుగా రేపు ఉదయాన మనం ఆగలవలసిన ప్రదేశం జాతీయ రహదారిపై నూతన కల్యాణ మండపం దాటిన తర్వాత ఎలక్ట్రికల్ టవర్ల సమీపాన అని చెప్పుకుని నిష్క్రమించడం జరిగింది.        

 

పెద్దపెద్ద తుఫానులే రానివ్వదురా చెట్టు

వానలెన్నొ కురిపించి వరదలనె అరికట్టు

ఎండ వేడి తగ్గించి ఎంతో హాయి తెచ్చిపెట్టు -

నీడనిచ్చి, పండ్ల నిచ్చి, ప్రాణాలె నిలబెట్టు

తరతరాలు తన స్వరం లోకానికి పంచిపెట్టు

అందుకే నాటాలి ప్రతి ఒక్కరూ మొక్క - ఆస్వాదించాలి ప్రకృతిని ఎంచక్కా.

- నందేటి శ్రీనివాసరావు

   ప్రజా కళాకారుడు

   09.08.2024.