3199* వ రోజు......... ....

 పర్యావరణ ధ్వంసకమవుతూ-కేవలం ఒక్కసారి వాడేసే ప్లాస్టిక్కులు మనకేల?

నేషనల్ హైవే ప్రక్కన నేటి శ్రమదినం సంఖ్య – 3199*

         శనివారం – 10.08.2024 వేకువ 4.16 కే మొదలై, 6.10 కి తలపెట్టిన పనులు పూర్తైనవి. శ్రమను పంచుకున్న కార్యకర్తలు మొత్తం 27 మంది! వారి ఉత్సాహానికి ప్రతిఫలంగా ప్రతిష్టితమైన పూల మొక్కలు 70.

         వీనిలో చాల వరకు గత సంవత్సరం నాటి పోషించగా పరమపదించిన చెట్లకు బదులుగా మళ్ళీ పెట్టినవే! ఈ పూట 3 రకాల – గద్దగోరు, సువర్ణ గన్నేరు, పారిజాత మొక్కలు నాటింది కూడ చాల వరకు ఈ శ్రామికులే! అది తమ ఊరి పట్ల వాళ్ళ నిబద్ధత! ఈ మనుషులందరి దినచర్యలో ఉదయ కాల శ్రమ సౌజన్యం తొలి భాగమై కూర్చుంది మరి!

         రాబోవు 1-2 ఏళ్ళ  NH 216 లోని ఈ 2-3 కిలోమీటర్ల పుష్ప హరిత సుందరీకరణం ప్రతిష్టాత్మకంగా మారిందట - ఈ కార్యకర్తలకు! ఔను – నేడది స్వచ్ఛ సుందర కార్యకర్తల స్వప్నం – రెండేళ్ల పిదప ఈ 3 వేల పూల – నీడ మొక్కలూ చెట్ల వర్ణ శోభితం మనందరికీ వాస్తవం!

         ఊరికి దూరంగా జరుగుతున్న రహదారి అలంకరణ గ్రుడ్డిగా జరిగేదేమీ కాదు సుమా! నిన్న ఇదే కాలమ్ లో నందేటి శ్రీనివాసుడు వివరించినట్లు - 3 రకాల మొక్కల్నీ ఎంత శ్రమించి, ఎంతెంత దూరంలో – ఏ వరసలో ఏ చెట్లు నాటాలో ముందస్తు ప్రణాళికతో నాటుతున్నవి!

         ఊరంతటి భవిష్యదాహ్లాదం కోసం ఈ మనుషులు పడే తపన చూస్తే ఆశ్చర్యం కలుగుతున్నది! ఎవరన్నా ఆదేశిస్తేనో – లక్షల కొద్దీ జీతాలిస్తేనో  - ఇలాంటి సముచిత శ్రమజీవులు దొరకరు!

         సిమెంటు దుకాణస్తులు క్రొత్తగా కట్టుతున్న కళ్యాణ మండపం మొదలు గంగులవారిపాలెం వీధి దాక – 200 గజాల బారునా 70 పూల మొక్కలు నాటిన, పాదులు త్రవ్విన, గడ్డి చెక్కిన, రహదారిని ఊడ్చిన, కొలతలు పట్టిన.. ప్రతి కార్యకర్తా ధన్యుడే!

ఈ ధన్యమూర్తులకు శ్రవణానందంగా పైడిపాముల సర్పంచి గారు తెలిపిన..

1) చల్లపల్లి డ్రైనేజి కోసం MLA గారు 2 కోట్లు కేటాయించిన,

2) గ్రామంలో రోడ్ల కోసం 60-70 లక్షలు శాంక్షన్ చేసిన,

3) కార్యకర్తల సుదీర్ఘకాల శ్రమదానం వల్లనే బుద్ధప్రసాదు గారు చల్లపల్లి కింతటి ప్రాధాన్యమిస్తున్నారనే,

4) ఇకముందు ఈ గ్రామం కోసం మరిన్ని సౌకర్యాల అవకాశాలూ,

5) ఈ మధ్యాహ్నాం మెహర్ వడ్ల మిల్లు వారి ఆహ్వానం సంగతీ,

6) ‘రేపటి వేకువ ఇదే రహదారిలో బండ్రేవు కోడు పెద్ద వంతెన వద్దనే మన శ్రమ’ అనే సూచనా!           

                  స్వచ్ఛ సుందర శ్రమోద్దీపము

కులాతీతము – మతాతీతము – క్రొత్త సంస్కృతి బీజప్రాయము!

నిరాఘాటము – ప్రజాశేయము – నిర్భర శ్రమ కాలవాలము!

రాను రాను దశాబ్ద కాలపు రాటుదేలిన క్రియా శీలము!

కార్యకర్తల మనోల్లాసము – స్వచ్ఛ సుందర శ్రమోద్దీపము!                             

- ఒక తలపండిన కార్యకర్త

     10.08.2024