3225* వ రోజు ... ....

 పర్యావరణ ధ్వంసకమవుతూ-కేవలం ఒక్కసారి వాడేసే ప్లాస్టిక్కులు ఇంకెంత కాలం?

ఇది 3225* వ సామాజిక ప్రయోజనకర శ్రమ సంతర్పణ!

            హూణ శకం ప్రకారమైతే 06.09.2024, శాలి వాహన శకమైనపుడు -1946 భాద్రప్రద శుద్ధ తదియ శుక్రవారం! అదీ వేకువ 4.12 బ్రహ్మ ముహూర్తం! ఆ చీకటి గుయ్యారంలో గంగులవారిపాలెం బాట మలుపులో మురుగు కాల్వ గట్టు మీద ఇద్దరు మహిళలతో సహా అష్ట సంఖ్యాక స్వచ్చ కార్యకర్తలు!

            వాళ్ళ  చేతుల్లో చీపురు, గొర్రు, దంతె, పార, పలుగు వంటి కాలుష్య నిర్మూలన ఆయుధాలూ, తలల మీద సింగరేణి బొగ్గు గని కార్మికుల్లా దీపాలూ, అంతరంగాల్లో తమ ఊరికేదో మేలు చేయాలనే తపనలూ!

            అంతలోనే వచ్చి, వాళ్ళను కలుసుకొన్న 13 గ్గురు సజాతీయులూ! అప్పుడు మొదలైన సామూహిక శ్రమదాన సందడి కాలు బాగాలేని పల్నాటి అన్నపూర్ణమ్మతోనూ, నూరు శాతం పనిమీద దృష్టి నిలిపి సమయం పట్టించుకోని జాస్తి వాని తోనూ 6.14 కు ముగియడం!

ఈ  యొక్క శ్రమదానం సందడిగా ఎలా మారిందంటే:

- మైకు నుండి సద్భావనలను రేకెత్తించే ఘంటసాల తదితర గాయకుల పాటలూ,

- అప్పుడప్పుడూ బిగ్గరగా కోడూరు వారి అదలింపులూ,

- ఉండుండీ నందేటి వాని కూని రాగాలూ,

- ఉషారెక్కువైనప్పుడు మైకు పాటకనుగుణంగా ఇద్దరి స్టెప్పులూ,

- చీపుళ్ళ గరగరలూ, మర రంపం చప్పుళ్ళూ,

- ఇన్ని రకాల దృశ్యాలను చూస్తూ నాలాంటి వాళ్ళ ఆశ్చర్యార్ధకాలూ..

            ఇక మీరే చెప్పండి ఇది చప్పటి శ్రమదానమా - లేక ఏనాటికానాటి నవనవోన్మేష క్రీయాశీలక- సృజనాత్మక దృశ్యమా?

            ఈ స్వచ్చ కార్యకర్తల్లో ప్రసాదు’, ‘శ్రీనివాస్నామధేయులెక్కువ ఇద్దరు ప్రసాదుల రోడ్ల చెట్ల మరమ్మత్తులోనూ, మరో ప్రసాదు చీపురు పనిలోనూ నిమగ్నులైతే,

            నలుగురు శ్రీనివాసుళ్ళు రోడ్లు మార్జిన్ల గడ్డి చెక్కుడులోనూ, పిచ్చి చెట్ల పీకుడులోనూ నిమగ్నులైతే,

            బృందావన నరసింహాదులు మహా వృక్ష ఖండన మండనాల్లో దిగారు!

దృష్టిని బట్టే కనిపిస్తుంది స్పష్టని విన్నానూ

నువ్వది వేదం అన్నావూ - నేనది వాదం అన్నానూ..

అని ఒక కవి భావించినట్లు

            ఈ దైనందిన శ్రమదానం నా  దృష్టిలో ఒక మహత్తర సందేశం! 100 మంది కార్యకర్తల మానలేని వ్యసనం! ఇప్పటికీ కొందరు గ్రామస్తులు పట్టించుకోని వ్యవహారం!

            నేటి శ్రమ సందడి ఉపాధ్యాయ విశిష్టతను గుర్తు చేసే గురవయ్య గారి మాటలతోనూ, BSNL నరసింహుని పద్ధతైన నినాదాలతోనూ, DRK గారి స్వచ్చ సుందరోద్యమ సమాచారంతోనూ రేపటి మన ప్రయత్నం ఇదే గంగులవారిపాలెం భవఘ్ని నగర్ దగ్గర అనే నిర్ణయంతోనూ ముగిసింది!

            అహం మీసం త్రిప్పుతుంటే

స్వార్ధములు తొడగొట్టుతుంటే అహం మీసం త్రిప్పుతుంటే

బిడియములు, సందిగ్ధతలు మరి కొంతమందిని అడ్డుకొంటే

అడ్డు గోడలు దాటుకొంటూ బాధ్యతలు గుర్తుంచుకొంటూ

గ్రామ సేవకు దిగే వారలు కదా అభివందనార్హులు?                                                        

- ఒక తలపండిన కార్యకర్త

   06.09.2024