పర్యావరణ ధ్వంసకమవుతూ-కేవలం ఒక్కసారి వాడేసే ప్లాస్టిక్కులు ఇంకెంత కాలం?
భాద్రపద శుద్ధచవితి (వినాయక వ్రతం) నాటి శ్రమ విశేషాలు – 3226*
శనివారం (7-9-24) వేకువ 4.00 దాటిందో లేదో – గంగులవారిపాలెం వీధి మలుపులో స్వచ్ఛ కార్యకర్తలు ఠంచనుగా హాజరు! అది పండగే గానీ - అప సవ్య ప్రకృతి పరిస్థితే గానీ - వాళ్ళ ప్రాభాత పూర్వక సామాజిక శ్రమ వేడుక ఆగదుగాక ఆగదు!
అదొక అరుదైన శ్రమజీవన సౌందర్యం – మా ఇళ్ళూ, మేమే గాదు – గ్రామంలోని అందరూ శుచీ శుభ్రతల ఫలితం చూడాలనే సత్సంకల్పం! ఇక వాళ్ల పట్టుదలైతే పదేళ్ల కాల పరీక్షలో మంచి మార్కుల్తో ఉత్తీర్ణమైంది!
ఎలాగంటే:
- 2 రోజుల్నుండి వేకువ శ్రమకు దూరమైన ఒక కార్యకర్త ఈ పండగ పూట ఆవురావురు మంటూ వచ్చి, ఆయుధ పాణియై పారిశుద్ధ్య కృషిలో దిగాడు!
- నిన్నరానందుకు నిద్ర పట్టలేదేమో గాని – ఒక 86 ఏళ్ల వైద్యుడు చాతనైనంతమేరకు శ్రమించి సంతృప్తుడయ్యాడు! ·
- ఇద్దరు నిశ్శబ్ద వీధి పారిశుద్ధ్య కృషీవలురు వచ్చీ రావడంతోనే వీధి తొలిమలుపు తూర్పు ప్రక్కన పూలమొక్కల పాదుల్ని సవరించబూనుకున్నారు.
- ఇక్కడికి పాతిక గజాల దూరంగా ముగ్గుర్నలుగురు ముళ్ల పూలకొమ్మలు వీధిలోకి చొచ్చుకువస్తుంటే కత్తెర్లతో వాటిమీదకు దాడి చేశారు!
- చీకట్లో అక్కడ ఏ కీటకాలు, సరీసృపాలుంటాయో అని వెనుకాడక ఐదారుగురు బండ్రేవుకోడు మురుగు కాల్వ నీటి అంచున కత్తులకు పని చెప్పి శుభ్రపరుస్తున్నారు!
- ఆ 60-70 గజాల రోడ్డును నలుగురు మహిళామణులు చీపుళ్లతో ఊడుస్తున్నారు!
- స్వచ్చ సైనికుల నిస్వార్థ ప్రయత్నాన్ని స్వాగతిస్తూ - ఉషోదయాన్ని సూచిస్తూ ఏడెనిమిది పక్షులు కిలకిలారావాలు చేస్తున్నాయి!
- ఈ దృశ్యాలను ఒక పెద్దాయన తన ఫోను కంట్లో నిక్షిప్తపరుస్తున్నాడు!
- ఇద్దరు మాత్రం కాస్త తీరికగా తూరుపు సింధూరపు తొలి సంజ వెలుగుల్లో మబ్బుల క్రీడా దృశ్యాల్ని పరిశీలిస్తున్నారు!
అప్పటికే శ్రమదాన సమయం ముగిసిందని ఒక డాక్టరు విజల్ మ్రోగింది. ఐనా ఐదారుగురు తమ పని ముగించిగాని ఒడ్డెక్కలేదు!
అసలే వారాంతం, అందునా వినాయకచవితి, మరి సార్థక నామధేయురాలు పల్నాటి అన్నపూర్ణ వట్టి చేతుల్తో వస్తుందా? శ్రమదాతలకు సుష్టుగా ఉండ్రాళ్ల పంపకం జరగనే జరిగింది!
6.30 వేళ ప్రక్క ఊరు - రామానగరానికి చెందిన రాజు గారు నింపాదిగా ముమ్మారు పలికిన నినాదాలతోనూ,
రేపటి పని చోటు కూడ బండ్రేవు కోడు కాల్వ గట్టు దగ్గరే అనే నిర్ణయంతోనూ ఒక పండుగపూట శ్రమదాన పరి సమాప్తి!
ప్రాపంచిక స్వస్తతకై
పర్యావరణం రక్షణ ప్రతి యొక్కరి బాధ్యత
ప్రాపంచిక స్వస్తతకై ప్రకృతితో సఖ్యత
అందరికీ ఆహ్లాదం - కొందరిదా బాధ్యత?
స్వచ్ఛోద్యమ చల్లపల్లి సాధిస్తుందా ఘనత?
- ఒక తలపండిన కార్యకర్త
07.09.2024