3227* వ రోజు .......

 పర్యావరణ ధ్వంసకమవుతూ-కేవలం ఒక్కసారి వాడేసే ప్లాస్టిక్కులు ఇంకెంత కాలం?

                   మరొక శ్రమానంద ఆదివారం (08.09.2024)! @ 3227*

 కొన్నేళ్ళ క్రిందట ఈ స్వచ్ఛకార్యకర్తలే చల్లపల్లి ATM సెంటర్లో ఆనంద ఆదివారాలు నిర్వహించేవారు- శ్రమదానం పట్ల అవగాహన కల్గించేందుకు.

ఆ ఒక్కరోజు మాత్రం వాళ్ళ చీపుళ్ళకూ, దంతెలకూ, డిప్పలకూ విశ్రాంతి నిచ్చి, రెండుగంటల పాటు అడి, పాడి, నాటికలు ప్రదర్శించి చాలా వేషాలు కట్టే వారు. గ్రామస్తులూ, ప్రయాణికులూ,విద్యార్థులూ వందలుగా వచ్చేవారు.

            తరవాత్తరవాత ఆ సన్నివేశాలు కొన్ని పనిచోటుల్లోనే జరుగుతున్నాయి -శ్రమతో మిళితమైపోయి! వందల్లో  గ్రామస్తులు రాకున్నా - నేటి 36 మంది ప్రేక్షక- కార్యకర్తలూ, డజన్లలో ప్రయాణికులూ ఈ శ్రమదానం పోకడను గమనించారు.

            అప్పటి- ఇప్పటీ ఆదివారపు ఆనందాలు వేకువ 4.15 కే మొదలౌతున్నాయి! ఈ పూట కూడా స్వచ్చోద్యమ ఆస్థాన గాయకుడు మత  సహనం గురించి పాట పాడాడు. అప్పట్లో రంగస్థలం మీద జరిగిన నాట్య విన్యాసాలు ఈ వేకువ సమయంలో శ్రమ రూపంలో చెట్ల మీదా- వీధి మార్జిన్లలో- అటు బండ్రేవు కోడు కాల్వ అంచుదాకా, ఇటు వరి పొలం గట్టు దాకా చోటు చేసుకున్నాయి!

            ఈ ఉదయం జరిగిన శ్రమ వేడుకలో పాల్గొనని, చూడని గ్రామస్తులెవరైనా “జై స్వచ్చ చల్లపల్లి సైన్యం” సామాజిక మాధ్యమంలో రేఖా మాత్రంగా వీక్షించవచ్చు; వీడియోలలో సదరు ఉద్వేగ భరిత ఉత్సాహపూరిత శ్రమ సన్నివేశాల్ని తెలుసుకోవచ్చు. ఒక బట్టతలాయన - 60 ఏళ్ల విశ్రాంత ఉద్యోగి అంతెత్తు చెట్టు మీదకెక్కి చీకట్లో కొమ్మల్ని నరకడం చూసి – ప్రాత సినిమా (చెంచులక్ష్మి)లోని “ చెట్టులెక్కగలవా  ఓ నరహరి పుట్టలెక్కగలవా..” అనే పాటను గుర్తు చేసుకోవచ్చు!  

            నాలుగు రోజుల్నాడు ఎత్తైన నిచ్చెన మీద నుండి జారి, ఒక రక్తదాన వీరుడి భుజమ్మీదుగా క్రింద పడ్డ ఒక .. వనుడు మళ్లీ చెట్టుపై కెక్కిన వింతనూ చూడవచ్చు! ఇవేమన్నా సర్కస్ ఫీట్లా అనే సందేహం కలిగినా కలగొచ్చు!

            అసలెప్పుడూ ఈ వేకువ వీధి పారిశుద్ధ్యంలోకి తొంగిచూడని చల్లపల్లి వాస్తవ్యులెవరైనా అనుకోకుండా ఈ గంగులవారిపాలెం వీధిలో ఒక్క పెట్టున 30 మందికి పైగా డాక్టర్లు, పంతుళ్లు, రైతులు, గృహిణులు సందడి సందడిగా ఊడుస్తుంటే- గడ్డి పీకుతుంటే - మురుగు కాల్వగట్లు బాగుచేస్తుంటే- మర రంపం చప్పుళ్ళూ, ట్రాక్టర్ మ్రోతలూ, ఇవి కాక కొందరి కూని రాగాలూ వినిపిస్తుంటే.... ఏమనిపిస్తుంది? ఇదేదో వింత లోకంగా తోచదూ? వాళ్ళలో  గ్రామ సామాజిక స్పృహ మేల్కొని, అపరాధ భావం కలగదూ?

            ఈ ఆదివారం విశేషమేమంటే- విజయవాడ నాగార్జున హాస్పిటల్ లో  పని చేసే డాక్టర్లు దాసరి వరుణ్, దివ్యలు సకుటుంబంగా వచ్చి పాల్గొన డమే గాక - ట్రస్టుకు వారిచ్చిన 2 లక్షల భూరి విరాళం! దాతా, స్వీకర్తా ‘మనకోసం మనం’ ట్రస్టుకు శాశ్వత సభ్యులే!

మరో కొసమెరుపేమనగా – పల్నాటి అన్నపూర్ణ కార్యకర్తలందర్నీ దొరకబుచ్చుకొని, వేడి వేడి ఉప్మా తినిపించడం.

            30+ మంది చేరిన చోట ఇలాంటి విశేషాలకు కొదవేమి?

మన రేపటి వేకువ శ్రమదాన స్థలం కూడ భవఘ్నినగర్ దాటాక- గంగుల వారిపాలెం మలుపు వద్దనే!

                ఉత్తుత్తి కబుర్లతోనె

సుద్దులెన్నొ చెప్పుకొన్న - పెద్ద ప్లాన్లు గీసుకొన్న

ప్రయత్నమెంత చేసిననూ - రాద్ధాంతం నెరపిననూ

దినదినమేబది గంటల తీవ్ర శ్రమదానం వలె

ఉత్తుత్తి కబుర్లతోనె ఊరికి మేలొన గూడున?

- ఒక తలపండిన కార్యకర్త

   08.09.2024