3249* వ రోజు ....

 పర్యావరణ ధ్వంసకమవుతూ-కేవలం ఒక్కసారి వాడేసే ప్లాస్టిక్కులు ఇంకెంత కాలం వాడదాం?

గ్రామ స్వచ్ఛ సుందరోద్యమంలో 3249* వ ఘట్టం!

            ఈ మంగళవారం అక్టోబరు తొలిపూట పది మందితో 4.17 కే తెర తొలగిన ఆ ఘట్టం 6.06 నిముషాలకు ముగిసింది. ఆ తదుపరి ల్యాబ్ పరీక్షల బత్తుల రవి ననుసరించి, 24 మందీ తమ ఊరి శ్రమదాన నినాదాలు చేసింది 6.20 కి.

            నేనీ వేకువ గమనించిన తొలి శ్రమ సన్నివేశం భవఘ్ని నగరానంతర బండ్రేవుకోడు మలుపు వద్ద. ఒక బాగా ముసలి వైద్యునితో సహా ఆ 8 మంది పూనుకొన్నదే అది! అక్కడ చాలనాళ్లుగా వరి పొలం గట్టు వద్ద ప్రోగుపడిన పచ్చి పొడుం ట్రాక్టర్ లోకి నింపుకొని, ఆ రోడ్డు ఉత్తరపు గట్టున పోయడమే! అందులోని వేడీ, ఘాటు కంపూ వాళ్లెలా భరించారో వాళ్ళకే తెలియాలి!

            రెండవ దృశ్యం 216 వ జాతీయ రహదారి గంగులవారిపాలెం ఉత్తర దిశగా అక్కడ అరడజను మంది బాటనూ, దాని మార్జిన్ గడ్డినీ ఊడ్చి, తొలగించే పనిలో మునిగున్నారు. అక్కడొక కార్యకర్త మహావిష్ణువు సుదర్శన చక్రం లాంటి యాంత్రిక ఆయుధంతో పిచ్చి మొక్కల్ని లేపేస్తున్నాడు. మధ్యలో ఆయుధం మొరాయిస్తే - అతగాడే మరమ్మత్తు చేసుకొనడం చూశాను!

            రహదారి దక్షిణాన వంతెన పడమరగా జరిగింది అసలైన కష్టమంటే! అందులో మరీ 5 గురికైతే ఆ పొలం గట్టు వైపు ఎంత సుందరీకరించినా తృప్తి కలగదే! వాళ్లలో ఒక విశ్రాంత ఇంజనీరు గారైతే నిన్న రానందుకేమో, రెండునాళ్ల శ్రమనూ ఇప్పుడే సమర్పించుకొంటున్నట్లు కనిపించింది!

            సరే ఎలాగైతేనేం - ఎవరి అభీష్టానుసారం వాళ్లు ఈ పూట పాటుబడి, బండ్రేవుకోడు పెద్ద వంతెనకు పడమర భాగాన్ని శుభ్ర సుందరీకరించారు. ఈ సంతృప్తి చాలు వాళ్లు రోజంతా తమ సొంత పన్లు చేసుకొని, హాయిగా నిద్రించడానికి!

            రేపటి రేపు ఇదే వంతెనకు తూర్పు వైపుగా ఆగి, పనులు మొదలు పెట్టాలని నిర్ణయించుకొన్నారు!

      సంకల్పించే వారికి

కలకాలం హరిత శుభ్ర కళలిచ్చట పండాలని

ఆనందం, ఆరోగ్యం, అభ్యుదయం, చైతన్యం

గ్రామంలో ప్రతి యొక్కరి కన్నుల్లో నింపాలని

సంకల్పించే వారికి సమర్పింతు ప్రణామం!

- ఒక తలపండిన కార్యకర్త

   01.10.2024