పర్యావరణ ధ్వంసకమవుతూ-కేవలం ఒక్కసారి వాడేసే ప్లాస్టిక్కులు ఇంకెంత కాలం వాడదాం?
మన శ్రమదానంవయస్సు ఇప్పటికింకా 3250* రోజులే!
ఇది గాంధీ జయంతి – బుధవారం – వేకువ 4.17 కే శ్రమదాతలు పని చోటుకు చేరుకొన్నారు. ఈ పూట పని స్థలాలు కూడ గంగులవారిపాలెం వీధికీ, 216 వ రహదారికీ చెందినవే. ఆదినారాయణ అనే గాంధేయవాది (మంగళాపురం) నేటి 24 మంది కార్యకర్తల్లో ఒకరు. జాతిపిత ఆశయమైన ‘స్వచ్చతా’ సాధన చల్లపల్లి వీధుల్లో కన్న మిన్నగ ఎక్కడ జరుగుతున్నది!
ఈ 2.10.2024 నాటి కార్యకర్తల పని వివరాలలోకి వెళితే :
- మళ్లీ 6 గురు కార్యకర్తలు బండ్రేవు కోడు డ్రైను గట్టును భద్రపరుస్తూ కనిపించారు. అందుకు వాళ్లు వాడింది షెడ్డర్ నుండి గుట్టగా పడి పైకి బాగున్నా – లోపల వేడీ, దుర్వాసనా కొట్టే కొమ్మల – రెమ్మల – వ్యర్థాల పొడిని
- నలుగురైదుగురి రెండోముఠా 216 వ రహదారి ఉత్తరపు భాగాన్ని శుభ్రపరుస్తున్నారు. వాళ్ల దగ్గర 2 దంతెలూ, 2 చీపుళ్ళూ, గడ్డిని తునాతునకలు కొట్టే యంత్రమూ, డిప్పలూ! 2 మార్లు విజిళ్ళు మ్రోగినా – 6.10 అవుతున్నా పని ఆపని ముఠా ఇది.
- మిగిలిన డజను మంది సంగతేమంటే – వాళ్ళనాకర్షించింది పెద్ద డ్రైనుకు ఉభయ ప్రక్కలా ఉన్న రకరకాల తుక్కూ, పిచ్చి మొక్కలూ.
ఇవాళ మరీ భయపెట్టింది బందరుకు దారి తీస్తున్న వందల వాహనాల వేగం! అక్కడ CM గారు పాల్గొనే గాంధీ జయంతికి హాజరౌతున్న పోలీసు- రెవిన్యూ- తదితరుల ఆత్రుత ఆన్నమాట! ఈ కార్యక్రమంలో భాగంగా – ‘ స్వచ్చ పరిశుభ్రతా’ చర్చల్లో చల్లపల్లి తరపున మన డాక్టరు దంపతులు పాల్గొనే అంశం కూడ ఉన్నదట!
మరొక ప్రముఖ గాంధేయ శాసన సభ్యుడైన మండలి బుద్ధప్రసాదు గారు నారాయణరావు నగర్ లో నిర్వహించే జాతిపిత జయంతి కార్యక్రమం ఉన్నదట!
నేటి సమీక్షా సభను తన స్వచ్ఛ- సుందరోద్యమ నినాదాలతో ప్రారంభించినది పద్మావతి వైద్యశాల నర్సు వక్కలగడ్డ వెంకట నాగ లక్ష్మి!
రేపటి వేకువ కూడ మనం కలుసుకొనేది – 216 వ రహదారి మీద (బందరు నుండి) 22 వ కిలో మీటరు రాతి వద్దనే!
సగంమంది గ్రహించజాలరు
చల్లపల్లే దేశమున తొలి సచ్ఛసంస్కృతి బీజమందురు
స్వచ్ఛ సుందర కార్యకర్తలె సదరు విత్తులు చల్లుచుందురు
జనం స్వస్తత కంత కన్నా సహజ సూత్రం ఉండదందురు
అది ఎందుకని గ్రామస్తులింకా సగంమంది గ్రహించజాలరు?
- ఒక తలపండిన కార్యకర్త
02.10.2024