3251* వ రోజు ....

 పర్యావరణ ధ్వంసకమవుతూ-కేవలం ఒక్కసారి వాడేసే ప్లాస్టిక్కులు ఇంకెంత కాలం వాడదాం?

చాలా విశేషాలతో 3251* వ నాటి శ్రమదానం!

         తేదీ అక్టోబరు 3, బుధవారం. స్థలం 216 వ జాతీయ రహదారిలో బండ్రేవుకోడు కాల్వ దగ్గర 22 వ  కిలోమీటరు, సొంతూరి నిమిత్తం ఈ వేకువ 4.20 - 6.30 అనగా 2 గంటల సమయాన్నీ, శ్రమనూ అర్పించుకొన్న చల్లపల్లి తదితర గ్రామ పౌరులు 36 మంది, విశేషించి మహిళలు 9 మంది.

         ఇక - పనులదేముంది – ఏ రహదారినెలా శుభ్రం చేయాలో - ఎక్కడ మొక్కల్నాటాలో – వాటి పాదుల కలుపెప్పుడు తీయాలో - ఎప్పుడెప్పుడు ఆ మొక్కల్ని సుందరీకరించాలో - వాటి దాహం తీర్చాలో – వ్యర్ధాల్నెలా డంపింగ్ యార్డుకు చేర్చాలో - రోడ్ల భద్రతకేం చేయాలో - ఏ శ్మశానాన్నెలా నిర్వహించాలో - వీధి ఆక్రమణలను ఎంత వరకు ఆపాలో –  ఇత్యాదులన్నీ ఇందులో ప్రతి ఒక్కరికీ పదేళ్ల నుండీ కొట్టిన పిండే!

         అందుకని - నేటి పనుల వివరాలట్లా ఉంచి, ముఖ్యమంత్రి గారు పాల్గొన్న నిన్నటి బందరులోని “స్వచ్చతాహిసేవా” కార్యక్రమంలో మన స్వచ్చ – సుందర చల్లపల్లీయుల పాత్రను ప్రస్తావించుకొందాం!

- చల్లపల్లి స్వచ్చ - సుందరోద్యమ రథసారధిని ముఖ్యమంత్రి సన్మానించడం గాని, ఆ వూరి శ్రమదానోద్యమాన్ని పదేపదే ప్రస్తావించడం గాని,

- 2 నిముషాలు కేటాయించినా, 10 నిముషాల DRK గారి ప్రసంగానికెవ్వరూ అడ్డుపెట్టక పోవడం గాని,

- రాష్ట్రస్థాయి రాజకీయ నాయకత్వమూ, అధికారగణమూ ఈ శ్రమదాన ప్రత్యేకతను ఆసక్తిగా గమనించడం గానీ – ప్రశంసా పత్రం గానీ....

         చల్లపల్లి పరిసర ప్రజలకూ ప్రత్యేకించి స్వచ్చ కార్యకర్తలకూ మహదానంద దాయకం కావచ్చు! ఐతే ఇవన్నీ కేవలం ఇద్దరు డాక్టర్ల – లేదా స్వచ్చ కార్యకర్తల ఘన విజయాలనేకంటే –

         ఒక మంచి సామాజిక ప్రయోగ విజయమనీ, పరిశుభ్ర స్వచ్ఛాంధ్ర నిర్మాణం దిశగా పడిన అడుగులనీ, రాష్ట్రానికి రాబోయే మంచి రోజుల చిహ్నాలనీ భావించడం సమంజసం!

         నిన్నటి, నేటి విశేషాలనూ 36 మంది కార్యకర్తల్లో గ్రామ సర్పంచీ, ఇంకా సగం మంది ఉత్సాహ ఉద్వేగాల్నీ చూసైనా గ్రామ పౌరుల్లో మరింత మంది స్వచ్చ కార్యకర్తలు రేపటి నుండీ వస్తారని ఆశిద్దాం!

         నిన్నటి బందరు సభా విశేషాలను వివరించింది DRK గారైతే, దైనందిన నినాదాల్ని చేయించింది పద్మావతి గారైతే –

         25,000/- విరాళాన్ని చెక్కుగా ఇచ్చిన వారు వేమూరి కోటేశ్వరమ్మ (రిటైర్డ్ టీచరు)!

         రేపటి మన వేకువ తొలి కలయిక ఈ 216 వ రహదారి - 22 వ కి.మీ వద్దనే!

         కృషికి ప్రతిఫలమైన స్వప్నం!

రోజు - వారమొ గణన కాదిది - నెలల తరబడి జరుగుతున్నది

చల్లపల్లికి దక్షిణంగా సాగిపోయిన రాచమార్గం

సంస్కరణకూ, హరిత వైభవ సాధనకు శ్రమదాన యజ్ఞం  

కార్యకర్తల వేల గంటల కృషికి ప్రతిఫలమైన స్వప్నం!

- ఒక తలపండిన కార్యకర్త

   03.10.2024