పర్యావరణ ధ్వంసకమవుతూ-కేవలం ఒక్కసారి వాడేసే ప్లాస్టిక్కులు ఇంకెంత కాలం వాడదాం?
విసుగూ – విరామ మెరుగని స్వచ్చ – సుందరోద్యమం - @ 3252*
అక్టోబరు మాసపు తొలి శుక్రవారం (4-10-24) నాటి పని దినం సంఖ్య అది. ఉద్యమ కర్తలైతే 29 మంది, శ్రమస్థలమొచ్చేసి 216 వ జాతీయ రహదారిలో 21-22 కిలోమీటరు రాళ్ల వద్ద.
పని స్వభావం - రహదారి దక్షిణంగా 60-70 గజాల్లో పెరగబోతున్న పిచ్చిమొక్కల, పూల చెట్ల పాదుల గడ్డి పనిబట్టడమే! ముగ్గురు కార్యకర్తలు మాత్రం చల్లపల్లి - గంగులవారిపాలెపు, బందరు – అవనిగడ్డ క్రాస్ రోడ్డు వద్ద పనిలో కుదురుకొన్నారు.
మరో ముగ్గురు చెట్ల పెంపకందారులు బండ్రేవుకోడు వంతెన కటూఇటూ ఎక్కడ కాస్త సందు దొరికితే అక్కడ బోగన్ విలియా నాటుతున్నారు. ఈ మామిడి చెట్లు ఇంకాస్త పెరిగి, మొండి ఏడాకుల చెట్ల మీదకు పూల తీగలు ప్రాకి పుష్పించి, గద్ద గోరు చెట్ల రంగుల పూలు గాలికి తలూపుతూ, నవ్వుతుంటే - బహుశా దీపావళి నాటికి చూడాలి - ఈ కిలోమీటరు బాట అందచందాలు!
పై బృందాలకు దూరంగా ఆరేడు గట్టి పిండాలు రోడ్డు భద్రత దృష్ట్యా కాల్య అంచును ఆకు పొడులమర్చుతున్నారు. అది వెదజల్లే దుర్వాసనా, కళ్లలో పడే దుమ్ము వాళ్లకేం క్రొత్త కాదు!
ఇక్కడికి కిలోమీటరు దూరాన - ORC రోడ్డు ప్రాంతాన డజను మంది శ్రమిస్తున్న చోట మంచి సందడి కనిపించింది. మైకు నుండి పాటలు సరే – జాషువా గారి కాటి పద్యం పంక్తులూ, కాళ్లకూరి నారాయణరావు గారి చింతామణి నాటకం బిల్వ మంగుళుని పద్యాలు కూడ విన్పించాయి!
పని వాళ్లు 29 మందీ – పని స్ధలాలు మూడూ – పని గంటలు యాభైపైగానూ – ఇదీ ఇంచుమించుగా చల్లపల్లిలో కనిపించిన దృశ్యం! ఈ సందడి లేనిదే – ఈ శ్రమలో పాల్గొననిదే - తుదకు నినాదాలు చేసి, పనుల్ని సమీక్షించుకోనిదే ఈ శ్రామిక బృందానికి రోజు గడవదు!
9-11-24 న జరుగనున్న శ్రమదాన పర్వదినానికి అత్యద్భుత సినీ కథారచయిత శ్రీ విజయేంద్ర ప్రసాదు గారు అతిధిగా వస్తే ఎలా ఉంటుందనే చర్చ జరిగింది. అంతకు ముందు కస్తూరి విజయుడు సక్రమంగా చేసిన శ్రమదానోద్యమ నినాదాలను అందరూ పునరుద్ధాంటించారు.
రేపటి పనుల కోసం ఈ 216 వ రహదారిలోని నూకలవారిపాలెం డొంక సమీపంలో కలవాలని నిర్ణయించారు.
ఎన్ని జన్మలు ఎత్తవలెనో
వేకువన మూడున్నరకె ఈ వింత మనుషుల మేలుకొలుపులు
నాల్గుదాటంగానె వీధుల పారిశుద్ధ్యపు పనులు మొదలు
అదొక లోకం - అదొక సందడి - 6 గంటలు దాటు వరకు
ఎన్ని జన్మలు ఎత్తవలెనో వీళ్ల ఋణమును తీర్చు కొరకు!
- ఒక తలపండిన కార్యకర్త
04.10.2024