తమిళ శ్రీనివాసన్ విస్తుపోయిన 2 నిజాలు!
చెత్తను సంపదగా మార్చడంలో ‘జగమెరిగిన శ్రీనివాసన్ కు’ పరిచయమెందుకు గాని, ఈ 24-10-2024 శ్రమదాన సమయంలోని పై ఫోటోనూ అందరూ గుర్తించగలరు గాని, పనిలో బ్రహ్మ రాక్షసుడైన ఆ అరవ పెద్దమనిషి కళ్లు నిబిడాశ్చర్యంతో విప్పార్చిన ఉదంతమొకటి గుర్తుచేసుకొందాం!
క్రిందటేడాది చల్లపల్లిని ‘చెత్తకేంద్రం అక్కరలేని మోడల్ గ్రామం’గా మార్చాలని సదరు దానవుడు 2 దఫాలుగా మన ఊరికి రావడమూ – 2 వారాలపాటు మురుగు పనుల్తో మన కార్యకర్తల్ని రాచిరంపాన బెట్టడమూ గుర్తుంది కదా!
అతడి వరస చూస్తున్నప్పుడల్లా ఒకానొక ముఖ్యమంత్రి “పని లక్ష్యాలు పూర్తయ్యేదాకా నేను నిద్రపోను, ఉద్యోగుల్నీ – అధికారుల్నీ నిద్రపోనివ్వను....” అనే మాటలే గుర్తొచ్చేవి!
శ్మశానంలోనూ, ఊళ్లోనూ పనులు పరుగులు తీస్తున్న ఆ సమయంలో ఆ ‘నివాసన్’ తన ప్రక్కనే కంపు డిప్పలు మోస్తున్న స్వచ్ఛ కార్యకర్తను – (అతడెవరో తెలియక) అడిగాడు – “ఇంతకీ ఈ ఊరి సర్పంచి గారి భర్త ఎవరూ? కనపడరేం?” అని! “నేనేనండి – పైడిపాముల రాజేంద్రనండి” అని ఆ కార్యకర్త బదులిచ్చేసరికి –
“ఇదేమి చోద్యం! అసలిందరు కార్యకర్తలు ఈ వేకువ సమయంలో శ్మశానంలో కూర్చొని ఈ మురుగు పనులు చేయడమే వింతనుకొంటే - చాల రాష్ట్రాల్లోనూ, మా తమిళనాడులోనూ – స్త్రీలు సర్పంచులు అయినా – వాళ్ల భర్తలే సర్వాధికారాలూ వెలగబెడుతుంటారు; ఇక్కడంతా వింతగా ఉందే ! సర్పంచే స్వచ్ఛ కార్యకర్తగానూ, ఆమె భర్తే చెత్త పనులు చేస్తూనూ.... నమ్మశక్యం కావడం లేదే!.....” అన్నాడట!
దటీజ్ చల్లపల్లి సర్పంచి! దటీజ్ ఆమె పెనిమిటి!! దటీజ్ స్వచ్ఛ సుందర చల్లపల్లి!!!
- నల్లూరి రామారావు
ఒక తల పండిన కార్యకర్త
24.10.2024