చల్ల‘పిల్ల’ పెళ్లి 10 వ వార్షికోత్సవ కార్యక్రమాలు చురుకుగా జరుగుతున్నాయి.....

 చల్ల‘పిల్ల’ పెళ్లి 10 వ వార్షికోత్సవ కార్యక్రమాలు చురుకుగా జరుగుతున్నాయి.

(8 వ వార్షికోత్సవ సభలో చల్లపల్లిని చల్ల’పిల్ల’ గా గురవారెడ్డి గారు చమత్కరించారు)

- క్లబ్ రోడ్ నుండి కాసానగర్ వరకు గల 2.2 కి.మీ. ల హైవే రోడ్డుకు ఇరువైపులా స్వచ్చ కార్యకర్తలు నాటిన మొక్కలకు కంప కట్టడం పూర్తయింది. ఈ 4.4 కి.మీ. ల ప్రాంతంలో కలుపు తీయడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని స్వచ్చ చల్లపల్లి కార్యకర్తలు, మనకోసం మనం ట్రస్టు కార్మికులు, మంగళాపురం, వెంకటాపురం శ్రమ జీవులు కలసి పూర్తి చేశారు.          

- శివరాంపురం నుండి వెంకటాపురం రోడ్డు కిరువైపులా గత సంవత్సరం నాటిన మొక్కల ప్రాంతమంతా కలుపు తీయడం పూర్తయింది.

- పాగోలు రోడ్డులో బ్రహ్మం గారి గుడి వద్ద నుండి రైస్ మిల్ వరకు రెండు వైపులా మంగళాపురం శ్రమజీవులు కలుపు తీశారు.

- నాగాయలంక రోడ్డులో పబ్లిక్ టాయిలెట్ ప్రాంతం నుండి కాసానగర్ వరకు రోడ్డుకిరువైపులా వెంకటాపురం శ్రమ జీవులు కలుపు తీస్తున్నారు.

- విజయవాడ రోడ్డులో 6 వ నెంబరు కాలువ నుండి గ్రామ పంచాయితీ వారు, తరిగోపుల ప్రాంగణం నుండి మంగళాపురం శ్రమజీవులు కలుపు తీస్తున్నారు.

- “స్వచ్చ చల్లపల్లి స్వాగత ద్వారం” పనులు ముమ్మరంగా సాగుతున్నాయి.

- హైవే రోడ్డులో స్వచ్చ సుందర చల్లపల్లి పేరుతో “Signage” ఏర్పాటును ‘సాధనాల సతీష్’ ఆధ్వర్యంలో జరుగుతోంది.

- చిన రాజా గారి ఇంటి ముందు తోటను శుభ్రం చేసి మొక్కలను నాటి కంప కట్టడం జరిగింది.

- చిన రాజా గారి ‘వైజయంతము’ ప్రహరీ గోడకు క్రొత్తగా రంగులు వేయించడం జరిగింది.

- శ్మశానం, డంపింగ్ యార్డులలో అవసరమైన చోటల్లా మళ్లీ క్రొత్తగా రంగులు వేసి ముగ్గులు వేయడమూ, పాత నామఫలకాలను మళ్లీ రాయడమూ జరుగుతోంది.

- స్వచ్చ కార్యకర్తలు ఎంతో ఉత్సాహంగా బందరు రోడ్డును అద్దం వలె శుభ్రపరుస్తున్నారు.

- హిందూ శ్మశాన వాటికకు ప్రహరీ గోడ, ప్రవేశ ద్వారం పూర్తయినాయి. దహనవాటికకు, స్నాన వాటికకు పునాదులు పడ్డాయి.  

            ‘మనకోసం మనం’ ట్రస్టు ఆధ్వర్యంలో జరుగుతున్న పై కార్యక్రమాలన్నింటికీ సర్పంచ్ పైడిపాముల కృష్ణకుమారి గారు, ఉప సర్పంచ్ ముమ్మనేని నాని గారు, పంచాయతీ పాలకవర్గం, పంచాయతీ సెక్రటరీ మాధవేంద్రరావు గారు, గ్రామ పంచాయతీ సిబ్బంది మొత్తం, అన్ని ప్రభుత్వ విభాగాల ఆఫీసర్లు – ఉద్యోగులు, ప్రజా ప్రతినిధులు, మన జర్నలిస్టు మిత్రులు మనః స్ఫూర్తిగా సహకరిస్తున్నారు.         

            తాపీ మేస్త్రి  శ్రీనివాస్, పెయింటర్ నాంచారయ్య, ఆర్టిస్ట్ వెంకట్, ఎలక్ట్రీషియన్ బసవేశ్వరరావులు తమ సొంత ఇంటి పనుల వలె ఈ పనులన్నీ చేయిస్తునారు.

            ఈ పనులన్నింటికీ సమన్వయకర్త  దాసరి వేంకట రమణ (చిన్నాజీ) గారు.

            తలా ఒక చేయి వేయడమంటే ఇదే కదా!

            రండి...అందరం కలిసి మన చల్లపల్లిని దేశంలోనే ఒక నమూనాగా చూపిద్దాం.  

            ఈ నెల 9 వ తేదీ ఉదయం జరిగే స్వచ్చ సుందర చల్లపల్లి దశమ వార్షికోత్సవానికి అందరూ ఆహ్వానితులే!  

- దాసరి రామకృష్ణ ప్రసాదు

   తరిగోపుల పద్మావతి

   02.11.2024.