3281* వ రోజు .......

 పర్యావరణ ధ్వంసకమవుతూ-కేవలం ఒక్కసారి వాడేసే ప్లాస్టిక్కులు అవసరమా?

                     గ్రామస్తులంతా చూసి తీరవలసిన 3281* వ శ్రమదానం!

          ఎందుకంటే- ఈ ఆదివారం (3-11-24)51 మంది శ్రమదానమూ, అది జరిగిన 3 రోడ్ల ముఖ్య కూడలీ  అలాంటివి మరి!  అసలు గ్రామ ప్రయోజక సామాజిక- సామూహిక శ్రమదానమంటే ఏమిటి?

      లింకన్ చెప్పినట్లు –‘చల్లపల్లి జనంచేత, జనం కొరకు, జనం వలన జరుగదగిన -  జరిగి తీరవలసిన సత్కార్యం’ కేవలం 51 మంది పదేళ్లూ పదేనేళ్లూ చేస్తేచాలా?

          స్వచ్ఛ కార్యకర్తలు పదేపదే గ్రామ సోదరులను అభ్యర్థించేదేమిటి ? “అయ్యలారా! మీరంతా మురుక్కాల్వ పన్లు చేయొద్దు - శ్మశానాలు బాగుచేయొద్దు - ఆఖరికి మీ ఇళ్ల వద్ద బజారును ఊడవకపోయినా పరవాలేదు - వీలైతే ప్రతిరోజూ, కనీసం శని - ఆదివారాల్లో అదీ మీ వాడకట్టు దగ్గర్లో జరుగుతున్న శ్రమదాన యజ్ఞాన్ని వచ్చి చూడండి! ఊరికింకా ఏ మంచి పన్లు జరగాలని స్వచ్చ కార్యకర్తలు చర్చిస్తున్నారో వినండి చాలు....” అనేగదా !

          అరె! ఈ ఊరికి చెందని కార్ల, బస్సుల ప్రయాణకులు కూడ 2 నిముషాలాగి, 1) గణేశ్ ప్రెస్ ఎదుటా, 2) సచివాలయం దగ్గర డ్రైన్లోనూ, 3) సువిశాల 3 వీధుల కూడలినీ, 4) మునసబు వీధి దగ్గరి వైజయంతం గోడనూ,

      ఇంకా మీ సైకిళ్ల - మిఠాయిల- కూల్ డ్రింకుల – పండ్ల పూల-టీ-టిఫెన్ బళ్ల దుకాణాలను పట్టిపట్టి ఊడుస్తుంటే – ఎంగిళ్ళెత్తుతుంటే  - దుమ్ము కొట్టుకుపోతున్న ముఖాలేసుకొని, 6.25 కు సాధానాల సతీష్ గొంతు నుండి గ్రామ భవిష్యత్ సూచక నినాదాలు మ్రోగుతుంటే నిమ్మకు నీరెత్తినట్లుండి పోవుట న్యాయమా?

          ఈ వేకువ 4.20-6.15 నడుమ ఏమేం జరిగాయో, ఏ కార్యకర్తలు తమ ఊరి కోసం ఎంత శ్రమించారో – సంతోషించారో- అరటి పళ్ళెవరు పంచారో  శేషు, నందేటి శ్రీనులే పాటలు పాడారో – అసలీ శ్రమ సంస్కృతీ నిర్మాణమేమిటో పూర్తిగా వివరించలేను గాని ఈ 9 వ తేదీ- శనివారం జరగబోయే దశమ వార్షికోత్సవ వాతావరణాన్నైనా గ్రామస్తులందరూ ఆలోచించి, అభినందిస్తే బాగుండునని నా విన్నపం.   

     నేనిది వ్రాస్తున్న 7.30 కాలానికీ సుందరీకర్తలు కుడ్యాలంకరణలో మునిగే ఉన్నారని సమాచారం!

 

         రేపటి వేకువ కూడ మనం కలిసేది సెంటర్లోని కూల్ డ్రింకు కొట్ల వద్దేనని పునరుద్ఘాటించబడినది!

                 వదిలేయుట న్యాయమా?

ఎంతైనా సొంత ఊరు - పుట్టి పెరిగి, కలిసిమెలిసి

బ్రతుకుతున్న స్వగ్రామం-పర్యావరణం చెడితే

 కళా కాంతి లోపిస్తే ఒక్క గంట దాని కొరకు

పాటుబడుట అసాధ్యమా? వదిలేయుట న్యాయమా?

- నల్లూరి రామారావు

   ఒక సీనియర్ స్వచ్చ కార్యకర్త

   03.11.2024