కాలక్షేపానికి ఓ సాయంత్రం..
ఓ ఆదివారం సాయంత్రం...
‘అలా షికారుకి వెళ్దామా’ అని పద్మని అడిగాను.
‘ ఓ’ అంటే వెళ్ళి మా ఊరి గార్డెన్ లో కాసేపు తిరిగి, మరి కాసేపు కూర్చొని, సంతోషంగా కాలక్షేపం చేసి వచ్చాం.
ఇలా కాస్త ఖాళీ దొరికితే చాలు ఆహ్లాదంగా ఉండే ఆ తోటకు వెళ్ళి మేమిద్దరం గడిపి రావడం గత కొన్నేళ్లుగా మామూలైపోయింది.
అక్కడ ఉన్న కాసేపూ సంభ్రమాశ్చర్యాలకు గురవడమూ మామూలే!
ఎందుకని?
......
స్వచ్చ చల్లపల్లి కార్యక్రమం మొదలుపెట్టిన తొలిరోజుల్లో -
‘మీరు అక్కడికి వెళ్ళి శుభ్రం చేద్దామంటే ఇక మీ వెనుక స్వచ్చ చల్లపల్లికి ఎవరూ రారు డాక్టరు గారూ’ అని ఓ మిత్రుడు హెచ్చరించాడు!.
“లేదండీ ఆ భాగం శుభ్రం చేద్దాం రండీ” అని పద్మ అడిగేది.
కృష్ణ కుమారి గారు కూడా ‘ డాక్టరు గారికి చెప్పి ఒప్పించండి మేడం’ అని పద్మ తో అనేవారు.
చివరకు ఆ ప్రాంతాన్ని శుభ్రం చేయడం మొదలు పెట్టాం.
ఎముకలు, పుర్రెలు, పొరలు పొరలుగా క్యారీ బ్యాగుల వంటి ప్లాస్టిక్ వ్యర్థాలు, కుళ్లిపోయిన ఆహార పదార్థాలు, పశు పక్ష్యాదుల శవాలు, టన్నుల కొద్దీ బట్టలు – కంపుతో గూడిన ఆ ప్రదేశాన్ని శుభ్రం చేయడం గొప్ప ఛాలెంజ్! అయినా ఒక్క కార్యకర్తయినా వెనుతిరిగితేనా! అలా ప్రతిరోజూ శుభ్రం చేసి, వచ్చిన వ్యర్థాలన్నింటినీ ట్రాక్టర్ల లోనూ, గురవారెడ్డి ఇచ్చిన Tata ace వాహనంలోను లోడ్ చేసి మరింత వెనుకగా పోశాము. దాదాపు రెండు అడుగులు లోతు చెత్త తీస్తే గానీ మట్టి కనపడలేదు.
మూడు రోజుల పాటు JCB సహకారం కూడా తీసుకోవాల్సి వచ్చింది. అక్కడ కొట్టిన కంపు వలన ఆ JCB డ్రైవరు, ఈ పని చేయించిన అడపా రాంబాబు మూడు రోజులూ కడుపులో తిప్పి భోజనం కూడా సరిగా చేయలేకపోయారు.
ఇప్పుడు కొత్త మట్టి కావలసి వచ్చింది. తాసీల్దారు గారి అనుమతితో నడకుదురు రేవు నుండి మట్టి తెప్పించి ఆ ప్రాంతం అంతా నింపాము. మొక్కలు పెట్టి ఒక తోటను, ఒక చుట్టిల్లును తయారు చేశాం. ఇప్పుడు ఆ ప్రదేశం సుందరంగా ఉంది.
స్వచ్చ చల్లపల్లి మొదటి వార్షికోత్సవానికి అప్పటి కేంద్ర మంత్రి శ్రీ వెంకయ్య నాయుడు అక్కడికే విచ్చేశారు.
ఇదంతా చల్లపల్లి శ్మశానం సంగతి..
.. .. ..
మరో సంవత్సరం తర్వాత మరిన్ని మొక్కలను పెట్టి పెద్ద ఆర్చిని ఏర్పాటు చేశాం. శ్మశానం రూపు రేఖలు క్రమంగా మారిపోయాయి. శ్మశానం అనే పేరు ఇపుడు దానికి నప్పక - ఎబ్బెట్టుగా ఉంది. ఇది ఒక “స్వచ్చ సుందర ఉద్యాన దహన సంస్కార భూమి”.
“ఇది శ్మశానం ఏమిటి రా - ఒక బృందావనంలా ఉంటేనూ!” అని ఒక పెద్ద మనిషి – తన బావ మరిది దేహ సంస్కారానికి వచ్చి ఫోనులో వాళ్ళబ్బాయితో అంటుంటే విన్నాను.
కలెక్టరు లక్ష్మీకాంతం గారు వేయించిన సిమెంటు రోడ్డుతో ఆ ప్రాంతం రూపు రేఖలే మారిపోయాయి.
అక్కడ కాసేపు సంచరిస్తే మనసంతా హాయిగా ఉంటుంది. స్వచ్చ కార్యకర్తలు ధారపోసిన శ్రమ, సమయం, దాతల సహాయం అన్నీ సినిమా రీళ్ళ లాగా బుర్రలో తిరుగుతుంటాయి! అన్ని కులాలు, మతాల వారు ఈ శ్రమదానంలో నిస్వార్థంగా పాల్గొన్నారు. మన ప్రాంతంలో ఆడవాళ్ళు - అందునా కులీన సాంప్రదాయ కుటుంబీకులు శ్మశానానికి రావడం చాలా అరుదు. కానీ ఈ శ్మశాన సుందరీకరణలో చాలామంది స్త్రీలు పాల్గొన్నారు.
వీటన్నిటి ఫలితమే కదా చూపు తిప్పుకోనీయని అందమైన ఆ ప్రాంతం .
ఇదీ మా చల్లపల్లి చిల్లలవాగు శ్మశానం కథ. అయితే మేం ఆ పేరుతో పిలవం. ‘తరిగోపుల ప్రాంగణం’ అంటుంటాం.
మా ఊరు వచ్చిన వాళ్ళందర్నీ మా ఇల్లూ – నా ఆస్తి పాస్తులు చూడండి అన్నట్లుగా ‘మా శ్మశానం చూసి వెళ్ళండి అనడం నాకు, పద్మకు పరిపాటైపోయింది.
- డా. డి.ఆర్.కె.ప్రసాదు.
03.11.2024