3282* వ రోజు ... ....

 పర్యావరణ ధ్వంసకమవుతూ-కేవలం ఒక్కసారి వాడేసే ప్లాస్టిక్కులు అవసరమా?

సోమవారపు వీధి పారిశుద్ధ్య బాధ్యతలు! - @3282*

          నిన్నటి కన్నా 7 గురు తక్కువగా 4.11.24 న పనిదినమైనా సరే - 44 గురి వీధి పరిశుభ్రతా కృషి ఫలించి, 2 ముఖ్య బజార్లలో - బందరు బాటలోనూ, నాగాయలంక దారిలో పొట్టి శ్రీరాములు అడ్డ వీధి దాకా-

          “ఇవీ ఏ గ్రామంలోనైనా ఉండవలసిన బజారులంటే – దుకాణాల ఎదుటి జాగలంటే – సచివాలయ ప్రాంగణాలంటే – పెట్రోలు బంకులున్నా-ఖాళీ స్థలాలన్నా-వాటినానుకొని గోడలైనా...!” – అని మెచ్చదగినంతగా బాగుపడ్డాయి!

          గ్రామస్తులైన మీరే చిత్తగించండి –

- ఐదార్రోజులల్నాడు ఈ కిలోమీటరు పైగా బందరు వీధి ఎలా ఉన్నదీ-కార్యకర్తల కాయకష్టంతో ఇప్పుడెలా మారిపోయిందీ?

- ½ కిలోమీటరు నిడివి గల నాగాయలంక రోడ్డు మాత్రం 3 రోజుల క్రితం ఇంత శుభ్ర-సుందరంగా అనిపించిందా?

          అదాటున చూస్తే కాదు-స్వచ్చ కార్యకర్తల కళ్ళతో చూస్తే గాని – ‘అందంగా ఉన్నాయే ఈ ఊరి వీధులు’ అనిపించే వాటిలోనూ ఏలోపాలున్నదీ తెలీదు! ఏదైనా క్షుణ్ణంగా తీర్చిదిద్దితే తప్ప-ఈ స్వచ్ఛ కార్యకర్తల జాతికి పైపైన ఊడ్చుకుంటూ పోవడం తెలీదు మరి!

          మనలో చాలమందిమేమో “అయ్యో! పాపం – ఈపిచ్చోళ్లు వీధి గోడలకు సొంత ఖర్చుతో రంగులేసి, బొమ్మలు చిత్రించి, బంకుల దగ్గరి ఉద్యానాన్ని మళ్లీ-మళ్లీ స్వచ్ఛ-సుందరీకరిస్తారేమిటి? స్వచ్ఛ కార్యకర్తలంటే మరీ ఇంత పాగల్ గాళ్లనుకోలేదే...” అనుకోవచ్చు!

          మరి-వాళ్ల గ్రామ సామాజిక నిబద్ధత అలాంటిది! “తమ ఊరు అన్ని ఊళ్ళ కన్నా మెరుగ్గా ఉండాలనే వాళ్ళ తపనను” మనమెలా తప్పుపడుతాం? అదీ గాక సుమారు ఈ 50-60 మంది ‘పాగల్ గాళ్ళకు గత 2 వారాల నుండి రేపు శనివారం-(9-11-24) న జరగబోయే దశాబ్ది శ్రమదాన ఉత్సవ ఉద్విగ్నత పట్టుకొంది!

          ఆ ఊపులో వాళ్ళు పస్త్ర దుకాణం ఎదుట మీటింగు పెట్టుకొని-నందేటి శ్రీనుతో నినాదాలు చేయించి, పాటలు పాడించుకున్నారు, (ఇంకా నయం డాన్సులు చేయలేదు!-కొండపల్లి బాబూరావు గనుక ఉంటే అదీ జరుగుండును) నేటి కృషిని సమీక్షించుకున్నారు.

          నాగాయలంక-పాగోలు రోడ్ల వద్ద తమ అవసరముందని-రేపటి-వేకువ బ్రహ్మం గారి గుడి వద్ద కలుసుకోవాలని కూడ నిర్ణయించారు!

          ఆదర్శం కాకపోదు!

స్వచ్ఛ కార్యకర్తలకిది వ్యసనమె కావచ్చు గాని

ఆత్మ తృప్తి దాయకమగు అభ్యాసమె కావచ్చును;

అటు తమకూ-ఇటు ఊరుకు ఆరోగ్య ప్రదాయినై

అన్ని గ్రామములకు గూడ ఆదర్శం కాకపోదు!

- నల్లూరి రామారావు

   ఒక సీనియర్ స్వచ్చ కార్యకర్త

   04.11.2024