3311* వ రోజు ....

 పర్యావరణ విధ్వంసకమవుతూ-కేవలం ఒక్కసారి వాడేసే ప్లాస్టిక్కులు అవసరమా?

మంగళవారవు (3.12.24) శ్రమదానం 3311* వ సారి.

          అది 216 వ రహదారిలోని కాసానగరి నుండి కప్తానుపాలెం దిశగా జరిగింది. 4:20 నుండి 6:20 దాక చినుకు చిత్తడి లేకున్నా చలిగాలుల మధ్య తాపీగానే జరిగిపోయింది.

          పారిశుద్ధ్య పనులు జరిపింది 27 మంది కాక - కాసానగర చిన్నారులు ముగ్గురు కూడ!

          క్రమపద్ధతిలో పనులు జలిగిన మాట వాస్తవమే గాని సులభంగా - సుకరంగా కాదు! బాటల కూడలి మూల మలుపు కావడం వల్ల, ఎత్తు పల్లాల చోటైన కారణంగా దుమ్మూ కసవూ ఊడ్చిన కష్టం కన్న - చిరుగుంటలు పూడ్చిన శ్రమకన్న - డివైడర్ల కలుపేరి, మట్టి నింపటం కన్న - వందలాది డిప్పల వ్యర్ధాల్ని ట్రాక్టర్లోకి మోయడం కన్న -వాహనాల్ని తప్పుకొంటూ పని ముగించడమే పెద్ద విశేషంగా చెప్పుకోవాలి!

          ఒక వైద్య కార్యకర్త తాను పని చేయడం కంటే - ఈ జాగ్రత్తలు తీసుకోవడానికే ప్రాధాన్యతనిచ్చారు. తెలవారే వేళ - జతలుజతలుగా, జట్లుజట్లుగా అందరు ఎంత దీక్షగా పనిలో మునిగారంటే - సదరు DRK వైద్యుడు ఆ శ్రమైక జీవన దృశ్య సౌందర్యావలోకనంలో మునిగి, 6:15 కు దాక విజిలు ఊదడమే మరిచి పోయేంత!

          అసలీ శ్రమ దృశ్య ప్రత్యేకతలూ, ఊరికి సుదూరంగా వీధి సౌందర్యారాధనలూ ఊరి ప్రజల్లో ఎందరికి పట్టాయిలెండి! ఎవరి పనుల హడావిడిలో వాళ్లు! ఎవరి జీవన తాపత్రయంలో వాళ్లు!

          స్వచ్ఛ కార్యకర్తలు మాత్రం 6:25 సమయంలో కాఫీ సేవిస్తూ తమ కష్టం వల్ల 150 గజాల రహదారి 2 గజాల వెడల్పు విస్తరించిన వైనాన్నీ పని జరిగిన - జరగని చోటుల వ్యత్యాసాన్నీ బేరీజు వేసుకొన్నారు!

          అప్పుడిక అడపా గురవయ్య మైకందుకొని, స్వచ్చ సుందరోద్యమ నినాదాలతో బాటు 2 సూక్తుల్ని వినిపించాడు.

          రేపటి శ్రమ త్యాగం కూడ కప్తానుపాలెం కాసానగరుల మధ్యనే జరుగునని ఇందుమూలముగా తెలియుచున్నది.

          ఎక్కడెక్కడ గూటి పక్షులు

కనెక్టికట్ లో ఒక సురేశుడు భాగ్యనగరిలొ వర ప్రసాదుడు

నిన్న వేకువ సినీదర్శకుడున్న పళముగ వచ్చి కలియుట!

ఎక్కడెక్కడ గూటి పక్షులు ఒక్కచోటికి చేరుచుండుట!

ఈ శ్రమోద్యమ మెంతమందికి ఇన్స్పిరేషన్ ఇచ్చుచున్నదొ!

- నల్లూరి రామారావు

   ఒక సీనియర్ స్వచ్ఛ కార్యకర్త

   03.12.2024