3312* వ రోజు ....

 పర్యావరణ విధ్వంసకమవుతూ-కేవలం ఒక్కసారి వాడేసే ప్లాస్టిక్కులు అవసరమా?

డిసెంబరు 4 న కూడ జాతీయ రహరారి సేవలే! - @3312*

          మరి ఆసేవలేమో వేకువ 4.11 కే 14 మందితో మొదలయ్యాయి గాని - అందులో అరేడుగురు త్వరగా నిష్క్రమించి, మిగిలిన వారితో తదుపరి కలిసిన వారితో బాటు మొత్తం నికరంగా 27 మంది పరిచర్యలూ కాసానగర కూడలికే దక్కాయి!

          28 వ కార్యకర్త ఒక ఉపాధ్యాయుడు – తన చిన్నారిని కాన్వెంట్ లో దించి వచ్చి, 25 నిముషాల పాటు శ్రమించారు. మిగిలిన వారిలో :

          మళ్లీ ముగ్గురి వీధి సుందరీకరణ ప్రయత్నం కేవలం రోడ్డు మలుపుకే పరిమితమయింది.

          కప్తానుపాలెం వైపుగా రహదారి దక్షిణ భాగం 50 గజాలు కాలుష్య రహితం చేయడానికి ఇద్దరు రైతులూ, నలుగురైదుగురు విశ్రాంత వృద్ధ కార్యకర్తలూ, ఆస్పత్రి నర్సమ్మలు కష్టించారు.

          తెల్లారాక చూస్తే - అక్కడ పిచ్చి మొక్కలూ, ధాన్యం గింజల మిగుళ్లూ, గడ్డీ, ముఖ్యంగా అంగుళమెత్తున పేరుకొన్న మట్టీ మాయమై, మన్ను మాత్రం నలుగురి ప్రయత్నంతో ట్రాక్టర్ లోకి చేరింది.

          కాఫీలు రావడం ఆలస్యమై 6.10 తర్వాత కూడ 7-8 మంది చీపుళ్లతో రోడ్డు తుడవడం పునః ప్రారంభించారు. మూడవ మారు విజిలు ఊగితే గాని ఆరేడుగురు 6.15 కు పనులు విరమించారు.

          ఇక కాఫీ కషాయాస్వాదన సమయంలో సందడి సరే - ఈపూట ఏ కార్యకర్తల ఘనకార్యాలెలా ఉన్నవో అనే దానిమీద కొన్ని జోకులు! అనారోగ్యంతో స్వచ్చ కార్యకర్త ఉద్యోగం మానేసిన కొండపల్లి బాబూరావు పునరాగమనంతో అతని మీద ఛలోక్తులు!

          మాలెంపాటి, ప్రాతూరి వారలకు మంచి సాకు దొరికి, (పెన్షన్ అందినందున) - బలవర్ధకమైన పప్పుండల పంపకం చేశారు!

          చాల అరుదుగా వచ్చే వేల్పూరి ప్రసాదుని (ట్రాక్టరెక్కి మట్టి సర్దుతున్న) స్వచ్ఛ - సుందర నినాదాలతో ప్రారంభమైన తుది సమావేశంలో - కార్యకర్తల్లో చెప్పుకోదగ్గ నృత్యకారుడైన బాబూరావు తన నూతన గ్రృహప్రవేశానికి - 6/12/24 - శుక్రవారం 12:00 కు రావలసిందిగా (రామానగరం - BSNL కార్యాలయం ఎదుట) కార్యకర్తలకు సాదర ఆహ్వానం పలికాడు.

          రేపు కూడ ఇదే కాసానగర కూడలి వద్దనే అగి, మిగిలిన పని పూర్తిచేయాలని మెజారిటీ కార్యకర్తల అభిప్రాయం!

          సంతసము దక్కించుకొందురు

సంతసము దక్కించుకొందురు సమూహపు నిస్వార్ధ శ్రమలో

నిన్నకన్నా నేటి తమ కృషి మిన్న అని తలపోయడంలో

గొంతు కలుపుచు స్వచ్ఛ సుందర నినాదాలను పలకడంలో

క్రొత్తగా ఎవరైన వచ్చీ చెత్త పనులను చేయడంలో!

- నల్లూరి రామారావు

   ఒక సీనియర్ స్వచ్ఛ కార్యకర్త

   04.12.2024