3313* వ రోజు ....

 పర్యావరణ విధ్వంసకమవుతూ-కేవలం ఒక్కసారి వాడేసే ప్లాస్టిక్కులు అవసరమా?

పరిశీలించదగిన - పరిశోధించదగిన శ్రమానందం! - @3313*

          ఈ గురువారం (5/12/24) అనేకాదు - సామాజిక బాధ్యతల పట్ల ఆసక్తి ఉన్న ఎవరైనా ఏరోజైనా స్వచ్ఛ చల్లపల్లి స్వచ్ఛంద వేకువ శ్రమను చూసి, విశ్లేషించి, ఆనందించి, ఆశ్చర్య చకితులు కావలసిందే! ఎందుకంటే:

          ఇదొక అద్భుత సామాజిక ప్రయోగం! సదరు ప్రయోక్తల టీము కూడ - నాదెళ్ల సురేష్ ఈ 1 వ తేదీన చెప్పినట్లు అన్ని విధాల సమతూకమైనదే!

          ఈ టీముకొక మంచి మార్గదర్శకత్వమున్నది; 10-11 ఏళ్ల అనుభవమున్నది; మొన్నమొన్నటి దాక యువక ప్రాతినిధ్యం తగ్గినా ఇప్పుడది పరవా లేదు; ఇందులో కలాన్నీ గళాన్నీ వాడే కళాకారులున్నారు; ప్రాద్దున్నే జీతం భత్యం లేని ఈ పనిలో దిగితే వీధి పారిశుద్ధ్యంలో లీనమైపోయే కార్యకర్తలున్నారు; శ్రమశిక్షణ కూడ ఉన్నది!

          ఈ పూట NH 216 రహదారి శ్రమ జాతర 4:5 0-6.30 మధ్య 2 గంటలకు పైగా జరిగింది. (కత్తుల వారి పని మాత్రం 4.20 కే మొదలు!)

          కాసానగర దక్షిణ రాదారి దక్షిణ భాగంలో మట్టి గోకి, గడ్డి చెక్కే పనీ, రాదారి డివైడర్లో ఎండు గడ్డి తొలగించి, మన్ను సరిజేసే కృషీ, జంక్షన్ ను మరొమారు క్షుణ్ణంగా శుభ్రపరిచే శ్రమా, ప్రోగైన తడీ-పొడీ మట్టిని గుంటలు పూడ్చగా మిగిలిందాన్ని ట్రాక్టర్ లో నింపే కష్టమూ రోడ్డుకు ఉత్తరాన – ఇళ్ళ ముంగిళ్ళ దగ్గరి వ్యర్ధాల సేకరణ-అన్నీ సక్రమంగా పూర్తై, శ్రమకు ప్రతిఫలం దక్కింది!

          ఒకరా ఇద్దరా-32 మంది పట్టుదలతో పనిచేసుకుపోతుంటే-విశాలమైన రహదారి 150 గజాలు శుభ్ర-సుందరంగా మారక ఏం చేస్తుంది?

          జంక్షన్ మయాన పనిలో మునిగి, ససేమిరా విరమించని ముగ్గురి వల్ల –

          6.35 కు మొదలైన చివరి సరదా సమావేశం సాధనాల సతీష్ నిలకడగా పలికిన నినాదాలతో మొదలై,

          రేపటి వేకువ వీధి కృషి బైపాస్ వీధిలో- సజ్జా ప్రసాదు గారి అశోక్ నగర్ వద్ద జరుగుననే నిర్ణయంతో ముగిసింది.

          ఇంకా మీకవకాశమున్నది.

న్యూజిలాండ్ క్రైస్ట్ చర్చీ, ఒరిస్సా గోపాలపురమూ,

తెలుగునాటను చల్లపల్లీ దిశను నిర్దేశించుచున్నవి:

“విజ్ఞులగు గ్రామస్తులారా! పెద్ద మనసుల వృద్ధులారా!

ఊరిమేలుకు పాటుబడుటకు ఇంకా మీకవకాశమున్నది.”

- నల్లూరి రామారావు

   ఒక సీనియర్ స్వచ్ఛ కార్యకర్త

   05.12.2024