పర్యావరణ విధ్వంసకమవుతూ-కేవలం ఒక్కసారి వాడేసే ప్లాస్టిక్కులు అవసరమా?
పుష్యమాస పంచమీ శుక్రవారపు పని దినం సంఖ్య - 3314*
అనగా – 6.12.24 తేదీ. ఇక – 4:20-6:13 నడుమ - విజయనగర్ 3 వ వీధి పారిశుద్ధ్యానికి పూనుకొన్న స్వచ్చ కార్యకర్తల సంఖ్య 31. అందులో ఇద్దరో-ముగ్గురో స్థానికుల సహకారం కూడ!
కార్యకర్తల సంఖ్య పొదుపు పాటించడానికి కారణం-బహుశా శుభకార్యాలు కావచ్చు! మరి ఈపూట వీధి సేవకుల కృషి ఎలా ఉన్నదంటే:
- వీరిలో పాతిక మంది పనులూ శ్రీమాన్ Dr. గోపాలకృష్ణయ్యగారి వీధికే పరిమితమయ్యాయి. ఆ వీధిలో నేలలో మురుగు పారుదల వ్యవస్థ ఉన్నది, పైన పారిజాతాల వంటి పూల సువాసనలున్నవి. వాటితో బాటు కొంత కలుపూ, పిచ్చి మొక్కలు సైతం మొలిచి పెరుగుతున్నవి.
కొన్ని పెద్ద చెట్ల కొమ్మలు వీధిని క్రమ్మేసినవి. క్రమబద్ధీకరించవలసిన పూల మొక్కల పాదులూ ఎదురు చూస్తున్నవి.
ఇన్ని పనులున్నప్పుడు-ఈ పాతిక మంది వాలంటీర్లు విజృంభించక మానతారా? ఆ చిన్న బజారు నుండే పెద్ద ట్రాక్టరు వ్యర్ధాలు దొరికాయి. అంతకుముందే కొంత అందంగా ఉన్న విజయనగర్ 3 వ లైను వాళ్ల కాయకష్టంతో ఇప్పుడు మరింత పొందికగా కనిపిస్తున్నది.
ఇదే కాక-బైపాస్ వీధి ఉత్తరం కొసన ఐదారుగురి కష్టమూ ఫలించింది. అక్కడ 15 గజాల మేర చిందర వందరగా పెరిగిన కొన్ని చెట్ల కొమ్మల్ని, కలుపు మొక్కల్నీ ఎంత సుందరీకరించిందీ ఫోటోల్లో గానీ – ప్రత్యక్షంగా కానీ చూడండి!
అసలెందుకీ పదకొండేళ్ల గ్రామ స్వచ్చ-శుభ్ర-సుందరీకరణ యజ్ఞం నిత్య నూతనంగా వర్ధిల్లుతున్నదో ఆలోచంచండి!
పనులు ముగిశాక-6:25 కు అశోక్ నగర్ 1 వ వీధి మొదట కొలువు తీరిన కార్యకర్తలు మాలెంపాటి అంజయ్య గారి సుందరోద్యమ నినాదాలతో గొంతులు కలిపారు.
ఈ రోజు 12:00 లకు కొండపల్లి బాబూరావు గారి గృహప్రవేశ ఆహ్వానాన్ని గుర్తు చేసుకొన్నారు.
రేపటి ఉదయం కూడ సజ్జా వారి వీధిలోనే (అశోక్ నగర్ 1 వ లైను) కలవాలని నిశ్చయించుకొన్నారు!
ఎందరెందరో బుద్ధి జీవులు
కార్యకర్తల గౌరవించిన, చల్లపల్లికి సహకరించిన,
ఉదాత్తతలను ప్రదర్శించిన, విలువలకు ప్రాధాన్యమిచ్చిన,
శ్రమోద్యమమును స్వాగతించిన, శరీర శ్రమ విలువ లెరిగిన
ఎందరెందరో బుద్ధి జీవులు - అందరికి మా వందనమ్ములు!
- నల్లూరి రామారావు
ఒక సీనియర్ స్వచ్ఛ కార్యకర్త
06.12.2024