పర్యావరణ విధ్వంసకమవుతూ-కేవలం ఒక్కసారి వాడేసే ప్లాస్టిక్కులు అవసరమా?
3315* వ శ్రమానందం కూడా బైపాస్ వీధిలోనే!
అనగా - విజయనగర్, అశోక్ నగరి చివరి వీధుల వద్దనే! అంటే-కామినేని భవన విభాగాల దగ్గరే; అనందోత్సాహాలు కూడ నిన్నటి వలెనే 31 మందివే; ఒకరకంగా-పరిమాణాన్ని బట్టి చూస్తే శుభ్రపడిన వీధి భాగం పెద్దది కాదు గాని వాసిలో మాత్రం తీసిపోనిదే! ఆ సంగతి -
1) సబ్బినేని బోసు గారి స్థలం ఉత్తర భాగాన్నీ, డ్రైనునూ చూసినా,
2) దివంగత రామకోటేశ్వర్రావు వైద్యుని ఇంటి దక్షిణపుటంచును చూసినా,
3) అశోక్ - విజయ్ నగర్ల చివరి బజార్ల మొదళ్లను ,
4) నిర్మాణంలో ఉన్న KDCC బ్యాంకు భవన దక్షిణపుటంచును పరిశీలించినా,
5) అంతెందుకు-బైపాస్ వీధి దక్షిణపు నాలుగైదు చెట్ల కొమ్మల సుందరీకరణను చూస్తూ వెళ్ళినా ఎవరికైనా చప్పున బోధపడుతుంది.
ఇద్దరు 1 వ తరగతి, ఒక తొమ్మిదో తరగతి విద్యార్ధుల ఉనికి కూడ నేటి శ్రమదాన విశేషమే!
పని విరమణ సమయం పాటింపు మాత్రం గత పది రోజులుగా అమలు కావడంలేదు.
డజను మందిని బ్రతిమాలితే ఒకరిద్దరు మాత్రం అయిష్టంగానే 6:15 కు ముందు పని ఆపారు!
ఆ 50x12 అడుగల వీధి మార్జిన్ ను ప్రాతకాలపు రెస్క్యూ టీము సభ్యులూ, ఇద్దరు మహిళలూ ఎంత పట్టుదలగా మెరుగులు దిద్దారో-DRK గారే చూసుంటే ఎంత సంతోషం దక్కేదో!
సరే-ఏదోరకంగా నేటి కాయకష్టం 6:18 కి ముగిసింది. అప్పటి తుది సమావేశం కాస్తా-స్వచ్చ చల్లపల్లి బ్యానర్ ఆలస్యం వల్ల అడపా గురవయ్య సూక్తుల మీద సూక్తులు చెప్పీ, తూములూరి లక్ష్మణ కార్యకర్త నినాదాలు పలికీ,
పసుపులేటి ధనలక్ష్మి గారి ఇద్దరు మనుమళ్లు-ఋత్విక్, ఋషిక్ లు స్వచ్చోద్యమ ఖర్చులకు చెరొక
వెయ్యి విరాళమిచ్చి (కరోనా ఏడాది తప్ప-చంటి పిల్లలప్పటి నుండి ఇస్తూనే ఉన్నారు!)
రేపటి శ్రమదానం కోసం మళ్లీ అశోక్ నగర్ తొలి వీధి వద్దే కలుసుకోవాలనే నిర్ణయంతోనూ.. నేటి కార్యక్రమం పూర్తి!
ఎందరో మహనీయ వ్యక్తులు
దాతలూ, అజ్ఞాత దాతలు, గుప్తదాతలు ఎందరెందరొ
మాట సాయంతోనె పనులకు మార్గదర్శకులైనవారలు
ప్రభుత అనుమతి తెచ్చి ఊరికి పాటుబడిన పరోపకారులు
ఎందరో మహనీయ వ్యక్తులు-అందరికి మా వందనమ్ముల!
- నల్లూరి రామారావు
ఒక సీనియర్ స్వచ్ఛ కార్యకర్త
07.12.2024