సింగిల్ యూజ్ ప్లాస్టిక్ సామాన్లు వద్దేవద్దు! నారచేతి సంచులు ముద్దే ముద్దు!!
3353* వ పని రోజు – బెజవాడ బాటలో.
మంగళవారం (14. 1. 2025 ) మకర సంక్రమణ వేళ- కారణలేవోగాని, కార్యకర్తల సంఖ్య 19+1 కే పరిమితమయి పోయింది. +1వ కార్యకర్త విజయవాడలో 4.10 కే బయల్దేరి, భారీ మంచును ఛేదించుకొంటూ 5.30 కే వచ్చిన డాక్టర్ గోపాళం శివన్నారాయణ!
ఈ వేకువ స్వచ్చ కార్యకర్తలు కలుసుకొన్నది HDFC బ్యాంకు వద్ద, పనులు జరిగినది.
1) R&B అతిథి గృహ -
2) MDO కార్యాలయ
3)బైపాస్ మార్గాల వద్ద. పని మంతుల సంఖ్య ఇంతగా పల్చబడటం ఈ మధ్య కాలంలో ఈ పూటే!
వీధి పనివారల సంఖ్య తగ్గినా, పనులు మాత్రం బాగానే జరిగాయి. 2 టిఫిన్ సెంటర్ల, 2-3 మాంసం దుకాణాల, ఒక మెకానిక్ షెడ్డు చోటులిప్పుడెంత బాగున్నవో చూడండి!
MDO కార్యాలయం ఎదుట డిసెంబరులో పడిన పెద్ద గుంటను పూడ్చడంలో ఒక పలుగు పనిమంతుడూ, మరొక పార వీరూడూ, బరువైన మలాటుతో రాళ్ళను పగుల గొట్టిన ఉత్సాహవంతుడూ ఎంత శ్రమించిందీ దగ్గర్నుండీ చూశాను!
బైపాస్ వీధి మొదట వాహన రాకపోకలకు అనువుగా నలుగురి శ్రమను అర్థం చేసుకొన్నాను. ఇక్కడ కూడ ఒక పలుగూ, ఒకపారా, 3 డిప్పలు నిర్విరామంగా పని చేయబట్టే రోడ్డు దక్షిణపు మెరక తొలగిపోయి, బాట విశాలంగా కనిపిస్తున్నది.
చల్లపల్లి శ్రమదానంలో ప్రతి పనికీ ఒక లెక్కుంటది! ఏ రోడ్డు గుంటను ఏ రద్దుతో పూడ్చాలో, ఊడిస్తే వచ్చిన దుమ్మునూ మట్టినీ, ఏ వీధి మార్జిన్ పల్లానికుపయోగించాలో ఆయా పనుల స్పెషలిస్టులెవరో – అన్నిటికీ ముందస్తు ప్రణాళికలుంటాయి! ప్రత్యామ్నాయాలు కూడ రెడీగానే ఉంటాయి!
ఈ పూట సంక్రాంతి పండగే గాని, వానలాగా మంచు కురిసిందేగాని, చెత్త బండి లోడింగు వల్లా, బైపాస్ వీధి మెరుగుదల వల్లా పని విరమణ 6.30 కు గాని కుదరలేదు. మొన్న కస్తూరి శ్రీను చేతి వేలు తెగిన లాంటి ఘటనా జరగలేదు.
6.40 కి బండి శరత్ బాబు నినాదాలతో మొదలైన తుది సమావేశం 6.55 కు గాని ముగియలేదు. DRK గారు వద్దన్నా వినకుండా 5000/- చెక్కును సమర్పించిన గోపాళం గారు తనకు “ఎక్కువగా మాట్లాడడమనే” వ్యసనమన్నారు గాని, ఆ మాటలెంత విలువైనవో – ఎందర్ని మేలుకొలుపుతున్నవో – వినే వారికి బాగా తెలుసు.
బైపాస్ వీధి శుభ్రత కోసం మనం రేపటి వేకువ కలువదగినది కూడ HDFC బ్యాంకు దగ్గరే!
జాగృతి నింపిన చాలట
జనహితమే కడు ముద్దట ! సన్మానములసలొద్దట !
నాలుగ్గోడల మధ్యన నలిగిపోక వీధికెక్కి
చేయగలిగినంత – తోచినంత సాయం చేయుట మేలట!
సోదర గ్రామస్తులలో జాగృతి నింపిన చాలట !
- నల్లూరి రామారావు
ఒక సీనియర్ స్వచ్ఛ కార్యకర్త
14.01.2025