3354* వ రోజు ....

 సింగిల్ యూజ్ ప్లాస్టిక్ సామాన్లు వద్దేవద్దు! నారచేతి సంచులు ముద్దే ముద్దు!!

బైపాస్ మార్గానికి అంకితమైన పాతికమంది శ్రమ! - @3354*

         నిన్న కొద్దిపాటి భాగానికి పరిమితమైన కార్యకర్తల కష్టం ఈ పూట – బుధవారం (15-1-25) వేకువ సాగర్ టాకీసు దిశగా మరో 200 గజాల దాక విస్తరించింది. 6:30 దాక ఆ కష్టం ఆగనే లేదు!

సజ్జా ప్రసాదు అనే ఒక ఎడం వాటం కార్యకర్త మాటల్లో :

         “బెజవాడ రోడ్డులో చేతి నిండా పని దొరికింది గాని, ఈ బైపాస్ వీధిలో పని వెతుక్కోవలసొస్తున్నది!”

         అంటే సదరు వీధి వాసులకు ఇది ఒకరకంగా స్వచ్చంద శ్రమదాతల ప్రశంసన్నమాట! గణేశుడి చెత్త స్థలం నుండి తూర్పు దిశగా అలా చకచకా ముందుకు సాగుతున్న పారిశుద్ధ్య కార్యక్రమం అగ్రహారం అడ్డరోడ్డు తొలి ఇంటి వద్ద హఠాత్తుగా నెమ్మదించింది.

         చాల ఉత్సాహంగా 10 మంది కార్యకర్తలు అక్కడి ఎండు కొమ్మల - ఆకుల డంపును ఆ గృహస్తుడు చూస్తుండగానే 20 నిముషాల్లో ట్రాక్టర్లోకి ఎత్తారు గాని, అంతలోనే అతడు మనసు మార్చుకొని, తన కట్టెలు తనకే కావాలనడంతో మళ్లీ వాటిని అతని ఇంటి ఆవరణలోకి చేర్చవలసొచ్చింది. మిగిలిన గడ్డినీ, తుక్కునూ మాత్రం తొలగించే పని పూర్తయింది.

         ఒక అంజయ్యా, ఒక కస్తూరి శ్రీను మాత్రం MDO అఫీసు మూల ఉద్యానంలో తమ పనితనం చూపించారు!

         రోడ్డు అంచుల పల్లాల్ని సరిచేస్తున్న కోడూరు, అంబటి, నూతక్కి త్రయం తాతినేని వారి చీపురు దెబ్బకు దుమ్ములేస్తుంటే - దూరంగా వెళ్లి ఊడ్చుకోమని బ్రతిమాలారు!

         వీధి పని జరుగుతున్నంత పొడవునా ఇద్దరు నర్సమ్మలు రహదారి ఉద్యానాన్ని సీసాలు ఏరి, తుక్కుల్ని ఊడ్చి, సుందరీకరిస్తూనే ఉన్నారు.

         ట్రాక్టరెక్కి చెత్త సర్దే కాంట్రాక్టును ఈ మధ్య పంచాయతి ఉద్యోగి బండి శరత్ సొంతం చేసుకున్నాడు!

         ఇప్పటిదాక దశాబ్ద కాలపు వీధి పారిశుద్ధ్య కృషిని ఈ గ్రామస్తులై ఉండీ చూడనోచని వారు “ఒక్క సారైనా, ఒక్క రోజైనా...!” వచ్చి చూస్తే - కార్యకర్తలు గ్రామ మెరుగుబాటు పనుల్ని సంతోషగా చేస్తున్నారా, లేక నీరసంగా చేస్తున్నారా, ఏదైనా సొంతానికి అశించి చేస్తున్నారా, అసలు వాళ్ల ఆంతర్యమేమిటి?... అనే సంగతులు తెలుస్తాయి!

         6.40 కి నేటి తుది సమావేశాన్ని లయాత్మకంగా ప్రారంభించినది జ్యోతి విజయరాణి, నిన్న దూర ప్రాంతం నుండి వచ్చిన మహిళా ప్రొఫెసర్లు కార్యకర్తల్ని అభినందించిన విషయం ప్రస్తావించినదీ, ఈ దైనందిన వ్రాతల్ని పొల్లుబోకుండా ప్రత్యక్షరం పట్టి పట్టి చదువుతున్న నాదెళ్ల సురేశ్ ను గుర్తు చేసినదీ డాక్టరు DRK. ప్రసాదు;

         రేపటి బైపాస్ రోడ్డు పనుల పూర్తి కోసం నారాయణరావు నగర్ 1 వ రోడ్డు వద్ద కలవాలనేది అందరి కోరిక!

         మా వీధి సంక్రాంతి శోభ!

చల్లపల్లి జనులందున సౌందర్యపిపాస పెరిగి

గంగులపాలెం బాటన పండుగ సందడి హెచ్చెను

ఇరుగుపొరుగు ఊళ్ళ వాళ్ళ సెల్ఫీలీ వీధిలోన

విడివిడిగా, గ్రూపులుగా వందల ప్రజలిచ్చోటికి!

 

అసలెవ్వరిదీ ఆలోచన? ఏ సద్భావన పునాది?

ఎవరి దింత ధన వ్యయము? ఎవ్వరి శ్రమ దీని వెనుక?

నరకంగా పేరొందిన అప్పటి రహదారా ఇది?

మానవ శ్రమ సాధించిన మంచికి తార్కాణం ఇది!

- నల్లూరి రామారావు

   ఒక సీనియర్ స్వచ్ఛ కార్యకర్త

  15.01.2025