సింగిల్ యూజ్ ప్లాస్టిక్ సామాన్లు వద్దేవద్దు! నారచేతి సంచులు ముద్దే ముద్దు!!
మరొక మారు బైపాస్ వీధి శ్రమదానమే! - @3356*
శుక్రవారం వేకువ (17-1-25) 26 మంది నికర సమయదాతలు కాక, వేమూరు –ఘంటసాల - దుబాయి రాజేష్ కాక, 5 గురు పంచాయతీ + ముగ్గురు ట్రస్టు ఉద్యోగులూ - వెరసి 34 మంది వీధి పరిశుభ్రతా ప్రయత్నం నెరవేరింది.
ఒక్క అడపా బాబూరావు గారి స్వల్ప కాలాన్ని మినహాయిస్తే సదరు ఉప మార్గ నివాసులెవ్వరూ ఆ ప్రయత్నంలో కలిసి రాకపోవడమే కొరత!
“అరె! ఈ వీధెవరిది - ఇళ్ల ముంగిళ్ళెవరివి? ఇతర వార్డుల - గ్రామాల - విదేశాల వాళ్ళొచ్చి మా ఇళ్ల ముందు ఊడ్చడమేమిటి?” అని వాళ్లెందుకు నామోషీ పడరో అర్ధం కావడం లేదు.
గ్రామ సర్పంచీ, ఊరి ప్రముఖ వైద్యులూ, 70 నుండి 85 ఏళ్ళ పెద్దలూ వేకువ 4:15 - 6:30 నడుమ తమ వీధిని మెరుగుపరుస్తుంటే - నిమ్మకు నీరెత్తినట్లు మిన్నకుండడం భావ్యమా?
ఈపూట వీధి చెత్తా, ప్లాస్టిక్ తుక్కూ, రోడ్డు మార్జిన్ గడ్డీ, పిచ్చి మొక్కలూ పెద్దగా లేవు గాని, ఆరేడుగురా పనుల్ని చక్కబెట్టారు గాని, అసలైన 2 పెద్ద పనులకే కాలాన్ని, శక్తినీ ఖర్చు పెట్టవలసివచ్చింది.
బాటకు దక్షిణాన - ఒక ప్రాత ద్విచక్ర వాహనాలు క్రిక్కిరిసిన దగ్గరా, మరో ఇంటి ఎదుటా, రోడ్డు మార్జినే కాదు – ఏకంగా రోడ్డు పైన గూడ పదంగుళాల మందాన బరంతులుండగా - వీధి భద్రత దృష్ట్యా వాటిని గునపాల్తో త్రవ్వి, పారల్తో ఎత్తి, ఇతర చోట్ల రోడ్డును గట్టి పరచడమే నేటి కష్టతర చర్య!
రోడ్డు క్రుంగిన చోట్ల ఉత్తరపుటంచుల్లోని మట్టీ, మెరకల పని కూడ తక్కువ శ్రమేం కాదు!
కార్యకర్తల పని పట్టుదలను చూసి, ఊరి పట్ల వారి శ్రద్ధను గమనిస్తూ రాజేష్ ఒక వంక ఆశ్చర్యంగా, మరో ప్రక్క ఆనందంగా ఉండడాన్ని గమనించాను.
6:35 - 6:55 నడుమ సమీక్షా కాలంలో నినాదాల వంతు పైడిపాముల వారిది, బైపాస్ వీధి స్వచ్ఛ సౌందర్య చరిత్రను వివరించి, జాగ్రత్త పడవలసినవి ముచ్చటించినది DRK గారు, ఆసాంతం 30 మంది శ్రమను దగ్గరగా చూసిన అనుభవాన్ని వివరించి, వంగి కార్యకర్తలకు ప్రణమిల్లినది వేమూరి రాజేషుడు!
కార్యకర్తల బృంద విహార యాత్ర చాల కాలమైనందున అది అవసరమని నలుగురు చర్చించుకోవడం విన్నాను.
రేపటి వేకువ మన శ్రమస్థలి కోమలానగర్!
ఇన్నీ కలిసి రావడమే
తగుమాత్రం తాత్త్వికతలు, నాయకత్వ పటిమ కొంత
స్వచ్ఛరధానికి ఖర్చుల ఇంధనములు చాలినంత
కండలు కరిగించే శ్రమ, దండిగ జన సహకారము
ఇన్నీ కలిసి రావడమే ఈ స్వచ్చోద్యమ విజయము!
- నల్లూరి రామారావు
ఒక సీనియర్ స్వచ్ఛ కార్యకర్త
17.01.2025