సింగిల్ యూజ్ ప్లాస్టిక్ సామాన్లు వద్దేవద్దు! నారచేతి సంచులు ముద్దే ముద్దు!!
శ్రమదానం ఈ వేకువ కోమలానగర్ ప్రధాన వీధికి చేరింది - @3357*
శనివారం (18.01.2025) వేకువ 4:20 కే అక్కడికి చేరిన తొలి బ్యాచ్, తక్షణమే వీధి మొదట్లో ఉన్న విజయ సాయి మెడికల్ షాపు వద్ద కత్తులు, దంతెలతో కాలుష్య దౌష్ట్యాల పైన కలబడింది. అంతలోనే కొందరు స్థానిక కార్యకర్తలూ, మూడూళ్ళ శ్రమదాతలూ వచ్చి చేరడంతో ఇక అక్కడి నుండి 2 గంటల పాటు – అంటే 6.20 దాక శ్రమ సందడే సందడి.
జాతీయ రహదార్ల హరిత సుందరీకరణ కారణంగా ఈ కోమలా నగర వీధి శుభ్రతా చర్యలు కొంతకాలంగా వెనుకబడినవి. బెజవాడ, విశాఖలకు ఈ వేకువనే కొందరు పయనించినందున శనివారానికి తగ్గట్లుగా కాక కార్యకర్తల సంఖ్య కాస్త తగ్గి 27 కే పరిమితమయింది గాని, పనుల నాణ్యత, పరిమాణము తగ్గలేదు.
ఈ పూట కొత్తగా వచ్చి చేరిన యువకార్యకర్త ఇదే కోమలానగర్ కు చెందిన ప్రముఖ వదాన్యుడు శ్రీ నర్రా సాయిబాబు గారి మనుమడు ఋషికేశ్ అర్జున్ . ఇలా స్థానికులు కొందరైనా ఎప్పటికప్పుడు వచ్చి కలుస్తుంటేనే గదా, యువ రక్తం ఎక్కుతుంటేనే గదా - శ్రమదానోద్యమానికి జవసత్వాలు నిలిచేది!
ఇకపోతే – కోమలానగర్ ప్రజలకు విన్నవించేదేమంటే – ఈ వేకువ 2 గంటల శ్రమ వల్ల మీ ప్రధాన వీధి ఎంత దర్శనీయంగా మారినదో గమనించండి.
ఈ వీధి సగంలోనే ట్రాక్టరు నిండుగా వ్యర్థాలు నిండిన విషయం గుర్తించండి. మీ వీధి దుమ్మునూ, ప్లాస్టిక్ వ్యర్ధాల్నీ గ్రామేతరులు సైతం వచ్చి ఊడ్చి, డిప్పలకెత్తి మోస్తున్న సంగతి మీకు వెగటుగా ఉందేమో చెప్పండి.
6.22 దాక మీలో కొందరు నిద్ర లేవనప్పుడు శ్రమించి, తాము శుభ్రపరచిన వీధిలో సంతృప్తిగా నడచివస్తున్న మీ ఊరి డాక్టర్లను, పెద్దల్ని తిలకించండి. ఒకవేళ - రేపటి నుండి స్వచ్ఛ సుందరీకరణలో పాల్గొనాలనిపిస్తే నిరభ్యంతరంగా విచ్చేయండి!
ఈ ఉదయం సభను తన నినాదాలతో ప్రారంభించినది నూతక్కి శివబాబు, సమీక్షించినది Dr. డి.ఆర్.కె. గారు.
రేపటి మన వేకువ శ్రమ సందడి కోమలానగర్ లోని ఈరోజు ముగించిన చోట నుండి మొదలగునట!
కడియాల సురేష్ గారి
స్వంత కుటుంబం బదులుగ స్వచ్ఛ కుటుంబంతోనె కలిసి
సంకురాత్రి వేడుకలను జరిపించుట - మురిపించుట
సంప్రదాయములతొ బాటు స్వచ్ఛత నారాధించుట
కడియాల సురేష్ గారి ఘనతకు చెందిన ముచ్చట!
- నల్లూరి రామారావు
ఒక సీనియర్ స్వచ్ఛ కార్యకర్త
18.01.2025