సింగిల్ యూజ్ ప్లాస్టిక్ సామాన్లు వద్దేవద్దు! నారచేతి సంచులు ముద్దే ముద్దు!!
ఆదివారం (19-1-25) కూడ కోమలానగర్ లోనే! - @3358*
అది కూడ వేకువ 4.20 కే ముఖ్య వీధిలోనే! పాల్గొన్న వారి అంచనా సంఖ్య 35! స్థానికుల ప్రమేయం తగు మాత్రం!
మెయిన్ రోడ్డు బారునా ఒక్కో అడ్డ వీధిని దాటుకొంటూ ఉత్తర దిశగా సాగుతున్న వీధి పారిశుద్ధ్య రథం మళ్లీ 6.25 కు గాని ఆగ లేదు. ఆదివారం ఆనవాయితీ ప్రకారం ధ్యానమండలి ప్రముఖలు పాల్గొన్నారు.
పది - పదకొండేళ్లుగా ప్రత్యక్షంగా జరుగుతున్న ఊరి బాగుదల పనుల్ని చూస్తూ, మెచ్చుతున్న స్వచ్చ – శుభ్ర – సౌందర్యాభిమానులింకా ఎందరో ఉన్నారు.
“ఆ! మనమేం చేయగలంలే” ఈ చలీ, మంచూ మన ఒంటికి పడవులే - నాలుగు రోజులాగాక చూద్దాంలే”,
“పదేళ్లేంటి – ఎన్నేళ్ళయినా ఈ శ్రమదానం జరుగుతూనే ఉండేదే గనుక - సొంత పని ఒత్తిడి తగ్గాక వెళ్లి జాయినవుదాంలే”...
ఇలాంటి ఆలోచనా ప్రతిబంధకాలతో వాళ్ళాగి ఉండొచ్చు!
“ఇదొక అవశ్యాచరణీయమైన మంచి పని” అని తెలిశాక కూడ అలాంటి అ శ్రద్ధలెంతవరకు సమంజసాలు? ఒక్క మారు వచ్చి, ఆ 2 గంటల శ్రమ సందడి చూస్తే, పాల్గొంటే పోయేదేముంటుంది –
కొన్ని ఇన్ హిబిషన్సూ, కొన్ని సందిగ్ధతలూ, చిన్నపాటి అనారోగ్యాలూ తప్ప?
ఈ చల్లపల్లి స్వచ్చ – సుందరీకరణ శ్రమదానాన్నేమో నిన్న విశాఖలో మహా మహులెందరో పొగిడి, వీడియోలు చూసి, ప్రశంసలూ, లక్ష రూపాయల నగదు బహుమతులూ ఇచ్చారు! స్థానిక ప్రజల్లోనేమో చాలీ చాలని ప్రతిస్పందన!
నేటి స్వచ్ఛంద శ్రమదాన తుది సమావేశాన్ని నినాదాలతో మొదలెట్టిన ధ్యాన మండలి సభ్యుడు రాయపాటి రాధాకృష్ణ గారు, ఊళ్లో కనీసం ఒక వార్డులో – ఒక వీధి ఈ ఆదివారం బాగా శుభ్రపడినందుకు సంతోషం వెలిబుచ్చినది DRK డాక్టరు గారు,
రేపటి మన వేకువ పనులు కోమలానగర్ ప్రధాన వీధి చివరన!
శ్రమే సరియగు మార్గమంటూ
వెక్కిరించిన వాళ్లు సైతం కార్యకర్తల వెనుకనడచిరి
వలదువలదని విన్నవించిన వాళ్లు కూడా అనుసరించిరి
స్వచ్చ సుందర కార్యకర్తల శ్రమే సరియగు మార్గమంటూ
ఇప్పుడందరు మెచ్చుచుండిరి! వేయి నోళ్లుగ ప్రస్తుతించిరి!
- నల్లూరి రామారావు
ఒక సీనియర్ స్వచ్ఛ కార్యకర్త
19.01.2025